Gestures: నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. అవసరాలకు అనుగుణంగా నాలుకను మెలి తిప్పుతుంది. ఇందులో చెబుతోంది అబద్దమా? నిజమా? అనేది ఎదుటి మనిషికి అనుభవానికి వస్తే గాని అర్థం కాదు. అలాంటి అనుభవాన్ని ఎదుర్కొక ముందే ఎదుటి మనిషి మనకు చెప్పేది అబద్దమా? నిజమా? అనేవి తెలుసుకోవాలంటే.. కచ్చితంగా వారి హావభావాలను పసిగట్టాలని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు. ఆ హావభావాలు ఎలా ఉంటాయో వివరించి మరీ చెబుతున్నారు.
తీక్షణమైన కంటి చూపు
ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు అతడు తీక్షణంగా మన వైపే చూస్తున్నాడు అంటే కచ్చితంగా అబద్ధం చెబుతున్నట్టు లెక్క. ఆ మాటలకు మనం స్పందించే తీరును బట్టి అతడు తన వ్యవహార శైలి మార్చుకుంటాడు. అలాంటి వ్యక్తులు చెప్పే మాటలు ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు.
విపరీతంగా చెమటలు పడితే..
కొందరు మాట్లాడుతున్నప్పుడు విపరీతంగా చెమటలు పడతాయి. మాట తడబడుతుంది. మాటిమాటికి చేతికి ఉన్న గోర్లను నోటితో కొరుకుతారు. అంతేకాదు పదేపదే చేతితో జుట్టు నిమురుకుంటారు. అలాంటి లక్షణాలను ప్రదర్శించేవారు కచ్చితంగా అబద్ధం చెబుతున్నట్టే లెక్క అని మనస్తత్వ నిపుణులు అంటున్నారు.
సూక్ష్మ కదలికలను పసిగట్టండి
కొంతమంది మాట్లాడుతుంటే చిన్న చిన్న సూక్ష్మ కదలికలను ప్రదర్శిస్తారు. మాట మాట్లాడుతున్నంత సేపు భయపడటం.. లేదా వణికిపోవడం.. వారిలో వారే బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా అబద్ధం చెబుతున్నట్టే లెక్క.
కట్టు కథలు చెబితే నమ్మొద్దు
కొందరు మాట్లాడుతున్నంత సేపు రకరకాల ఉదాహరణలు చెబుతారు. మాటలు వ్యక్తీకరించే సమయంలోనూ కట్టుకథలు అల్లుతారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అబద్ధాలు మాత్రమే కాదు మోసం చేయడంలోనూ ఇలాంటి వారు ముందంజలో ఉంటారు.
కాళ్లు, చేతులను విపరీతంగా కదిలిస్తారు
కొందరు మాట్లాడుతుంటే కాళ్లు చేతులను విపరీతంగా కదిలిస్తారు. కొన్నిసార్లు వాళ్ల చేతులు వణుకుతుంటాయి. సందర్భం లేకుండా వారి చేతి వేళ్లను వారు నొక్కుకుంటారు. అలాంటి వారు చెప్పే మాటలు ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదు.
వారి అవసరం కోసం ఏదైనా చేస్తారు
కొంతమంది స్వరం హై- మాడ్యూలేషన్ తో ఉంటుంది. అలాంటివారు తమ అవసరాల కోసం ఎలాంటి పని అయినా చేయగలరు. ఎలాంటి మాటలైనా మాట్లాడగలరు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది.
మాటలు తత్తరపాటుకు గురవుతుంటే..
కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నిజాన్ని దాచేందుకు అబద్ధం ఆడతారు. తర్వాత ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిజాన్ని వెళ్లగక్కుతారు. మళ్లీ వెంటనే ఆ నిజాన్ని దాచేందుకు వరుసగా అబద్ధాలు ఆడతారు. ఇలాంటి సమయంలో వారి మాట తత్తరపాటుకు గురవుతుంది. అలాంటి వారి మాటలు నమ్మకపోవడమే మంచిది.
మాటలు ఒక రకంగా.. సైగలు మరొక రకంగా
కొందరు అబద్దాలు చెప్పినప్పుడు ఊరికే దొరికిపోతారు. ఎందుకంటే వారి నోటి నుంచి వచ్చే మాట ఒకరకంగా ఉంటే.. చేతులు లేదా కళ్ళ నుంచి వచ్చే సైగలు మరో విధంగా ఉంటాయి. అలాంటివారు చెబుతోంది అబద్ధమని వారి సంకేతాల ద్వారానే ఎదుటి వ్యక్తులు తెలుసుకోవచ్చు.
మూసే ప్రయత్నం చేస్తుంటారు
కొందరు మాట్లాడుతున్నప్పుడు అన్యమస్కారంగా వారి కళ్ళను వారే మూసుకుంటారు. లేదా యాదృచ్ఛికంగా తమ నోటిని చేతితో మూసే ప్రయత్నం చేస్తారు. ఇలాంటివారు చెప్పే మాటలను నమ్మితే నిండా మునిగినట్టే.
శరీరమే సంకేతాలు ఇస్తుంది
కొందరు మాట్లాడుతున్నప్పుడు శరీర భంగిమలు చాలా దృఢంగా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు వారు పిడికిలి బలంగా బిగిస్తారు. అలాంటప్పుడు తాము చెబుతోంది నిజం అనే భ్రమ కలిగిస్తారు. అలాంటి మాటలు నమ్మితే నిలువునా మోసపోయినట్టే.
(అయితే పై లక్షణాలు ఉన్నంత మాత్రాన అబద్ధాలకు సూచికలు కావు. మాకు తెలిసిన సమాచారం, వివిధ రకాల వ్యక్తుల తో మాట్లాడిన తర్వాత .. ఆ విషయాలను ఈ కథనం రూపంలో అందించాం. అయితే ఇటువంటి సందేహాలకు, సమస్యల పరిష్కారానికి మేము బాధ్యత వహించం)