‘‘ఉద్యోగులను ఆఫీస్ కు పిలవాలా? ఇంటి నుంచే పని చేసుకోమని చెప్పాలా?’’ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు ఇదో సమస్యగా మారింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో.. కంపెనీలన్నీ ఉద్యోగులను ఇళ్లకు పంపించేశాయి. ఇంటి నుంచే పనిచేయాలని కోరాయి. అయితే.. కమ్యునికేషన్ గ్యాప్ రావడం.. వర్క్ ఔట్ పుట్ లో తేడాలు రావడంతో.. ఆఫీస్ నుంచి పని చేస్తేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చాయి చాలా కంపెనీలు. ప్రముఖ ఐటీ సంస్థలన్నీ ఉద్యోగులను ఆఫీస్ కు పిలవడానికే సిద్ధమయ్యాయి. అయితే.. ఉద్యోగులు మాత్రం మరో విధంగా ఆలోచిస్తున్నారు.
కరోనా భయం ఇంకా తొలగిపోలేదు. థర్డ్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తూనే ఉన్నాయి. కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే ఉంది. నీతి ఆయోగ్, ఎస్బీఐ వంటి సంస్థలూ థర్డ్ వేవ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లి పనిచేయడానికి చాలా మంది ఉద్యోగులు వెనకడుగు వేస్తున్నారు. లండన్ కు చెందిన ప్రైజ్ వాటర్ హైజ్ కూపర్స్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులనుంచి ఈ విషయమై అభిప్రాయాలను సేకరించింది.
దీని ప్రకారం.. 41 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుకు రావడానికి విముఖత చూపస్తున్నారట. భారత్ కు చెందిన ఓ ప్రముఖ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ కూడా ఆగస్టులో లో రెండు లక్షల మందిని సర్వే చేసింది. ఇందులో ఏకంగా 48 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కే ఓటు వేయడమే కాకుండా.. వీరంతా శాశ్వతంగా ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారట!
ఇంటి నుంచి పనిచేస్తున్న వారిలో చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. హైదరాబాద్ లో పనిచేసే వారిని తీసుకుంటే.. దాదాపు 40 శాతం ఐటీ ఉద్యోగులు నగరాన్ని వదిలి వెళ్లారు. ఇలాంటి వారంతా తిరిగి.. నగరానికి చేరుకోవడానికి సంశయిస్తున్నారు. వచ్చిన తర్వాత మళ్లీ థర్డ్ వేవ్ వంటిది మొదలైతే.. ఇబ్బందికరమని భావిస్తున్నారట. అయినప్పటికీ.. రావాల్సిందేనని కొన్ని కంపెనీలు ఆదేశిస్తే.. కొందరు సీనియర్లు ఉద్యోగం వదిలేసి, వేరే సంస్థకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారట! ఈ విధంగా.. ఆఫీసుకు పిలిస్తే అయిష్టత వ్యక్తం చేస్తున్నారు దాదాపు సగం మంది ఉద్యోగులు! ఇలాంటి పరిస్థితుల్లో.. వారిని ఆఫీసుకు పిలవడం సవాల్ గానే మారింది సంస్థలకు!