Mokshada Ekadashi: మన హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలలో ఒకటైన మార్గశిర మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలోనే మార్గశిర మాస శుక్ల ఏకాదశి రోజు విష్ణుమూర్తిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోయి మనకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. అందుకే మార్గశిర శుక్ల ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. మోక్షద ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.
నేడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి పూజ గదిని శుభ్రపరచుకోవాలి. ఈ ఏకాదశి వ్రతం ఆచరించే వారు కఠిన ఉపవాసంతో ఈ వ్రతం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించేవారు ఈరోజు బియ్యం పప్పు ధాన్యాలు, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు. కఠిన ఉపవాసంతో విష్ణుమూర్తి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి అనంతరం ప్రత్యేక అలంకరణ చేయాలి. అలాగే స్వామివారికి పాయసం నైవేద్యంగా సమర్పించి విష్ణుసహస్రనామాలు భగవద్గీత వంటి వాటిని చదవాలి.
Also Read: విడిపోయిన వారితో కలవడానికి ఈ 5 రాశుల వారు ఏ మాత్రం ఆలోచించరు..?
సాయంత్రం కూడా మరల పూజ చేసి మన ఆర్థిక స్తోమత కొద్ది దానధర్మాలను చేయాలి. విష్ణు సహస్ర నామాలను చదువుతూ రాత్రి జాగరణ చేయాలి. మరుసటి రోజు ఉదయం తిరిగి పూజ నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఉపవాసాన్ని విరమించడంతో ఈ ఏకాదశి వ్రతం పూర్తి అవుతుంది.ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో జన్మల పాపాలు సైతం తొలగిపోయి మోక్షం లభిస్తుంది. అలాగే విష్ణుమూర్తిని పూజించడం వల్ల లక్ష్మిదేవి కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి.
Also Read: నిజమైన స్నేహితులలో ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉంటాయి.. ఏవంటే?