bank : డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు లేకున్నా రిస్కే, ఎక్కువగా ఉన్నా రిస్కే, ఉన్న డబ్బును కాపాడుకోవాలి అంటే కూడా రిస్కే. ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకోవాలంటే చాలా మంది భయపడుతుంటారు. దొంగలు పడితే ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం దొంగల పాలు అవుతుంది. కొన్ని సార్లు ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. అందుకే రిస్క్ లేకుండా బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మరి ఈ బ్యాంకుల్లో కూడా సమస్యలు ఉంటే ఏం చేయాలి కదా. ఓకవేళ మీ అకౌంట్ ఉన్న బ్యాంకు దివాళ తీస్తే మీరు ఏం చేస్తారు. మిగిలింది ఏం ఉంటుంది చేతులు ఎత్తేయడమే అనుకుంటున్నారా. కాదు ఓ దారి ఉంది అందుకే ఈ ఆర్టికల్ చదివేసేయండి.
ఇండియాలో బ్యాంకులు దివాలా తీయడం ఈ మధ్య కామన్ గా చూస్తున్నాము. కానీ ఇలా జరిగినప్పుడు కస్టమర్లు ఇబ్బందులు పడకూడదని డిపాజిట్ ఇన్షూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) కస్టమర్ల డబ్బును బీమా చేసి ఉంచుతుంది. అయితే ఈ సంస్థ కూడా దివాళ తీస్తే అని అనుకోకండి. ఎందుకంటే సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కు చెందిన అనుబంధ సంస్థ. సో మీరు డబ్బులు దాచుకున్న బ్యాంకు దివాళ తీసినా సరే అసలు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు నిపుణులు.
అందరూ భయపడుతున్నట్టు బ్యాంకు దివాలా తీసినా డిపాజిట్లకు మాత్రం 5 లక్షల రూపాయల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ లభించే అవకాశం ఉంటుంది. మీకు ఖాతా ఉన్న బ్యాంకు దివాలా తీసిందంటే మాత్రం ఈ డబ్బు మీకు కచ్చితంగా లభిస్తుంది. అయితే ఈ బీమా మొత్తాన్ని కొన్ని సంవత్సరాల క్రితం పెంచేశారు. ఫిబ్రవరి 4, 2020 ముందు వరకు బ్యాంకులు దివాలా తీస్తే డిపాజిట్లకు కేవలం ఒక లక్ష వరకు మాత్రమే బీమా ఉండేది. కానీ ఈ ఫిగర్ ను మార్చి ఏకంగా రూ. 5 లక్షలు చేశారు.
ఈ నియమం ఇప్పుడు కాదు గత నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2020లో మారింది. డిపాజిట్ బీమా 1 లక్ష నుంచి 5 లక్షలకు పెరిగడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి అనేక బ్యాంకుల్లో ఖాతాలు కూడా ఉంటాయి. అలాంటి వారికి డిపాజిట్లకు ప్రత్యేకంగా బీమా ఉంటుంది. మీక గనుక ఒకే బ్యాంకులో ఉన్న మొత్తం డిపాజిట్లకు కలిపి రావాలంటే మాత్రం రూ. 5 లక్షల గరిష్ట పరిమితి వస్తుంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల దగ్గర నుంచి అన్ని కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు వరకు కూడా ఈ DICGC బీమా పరిధిలో ఉంటాయి.
బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినా, బ్యాంకు శాశ్వతంగా మూసివేసినా సరే రూ. 5 లక్షల వరకు బీమా వస్తుంది. పరిమితి కంటే ఎక్కువ డిపాజిట్లు ఉంటే వారి మిగిలిన డబ్బు తిరిగి రావడం కష్టమే అని చెప్పవచ్చు. ఈ ప్రాసెస్ బ్యాంక్ ఎసెట్ రికవరీ ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుందట. అందువల్ల రూ. 5 లక్షలతో సర్ది చెప్పుకోవాల్సిందే అన్నమాట. మీ బ్యాంకు దివాలా తీస్తే మాత్రం కచ్చితంగా మొత్తం భీమా 90 రోజుల్లోపు లభిస్తుంది. భారతదేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులకు DICGC బీమా వర్తిస్తుంది. 5 లక్షల వరకు డబ్బు అయితే కచ్చితంగా గ్యారెంటీ ఉంటుంది అంటున్నారు నిపుణులు.