Virat Kohli Birthday Special Story: నేను ఇక్కడ పని చేయడానికి రాలేదు. ఈ సామ్రాజ్యాన్ని ఏలెందుకు వచ్చాను. అని కే జి ఎఫ్_ 2 లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను నిజం చేసినవాడు విరాట్ కోహ్లీ. రెప్పపాటులో బంతిని బౌండరీ, కళ్ళు తెరిచి మూసేలోపు సిక్సర్, మంచినీళ్లు తాగినంత ఈజీగా ఆఫ్ సెంచరీ, ఒంటికి షర్టు వేసుకున్నంత సులభంగా సెంచరీ.. ఇలా ఏదైనా చేయగలడు.. తనదైన రోజు ఎలాగైనా ఆడగలడు. చేజింగ్ కు దిగి ఎదురుదాడి చేయగలడు. మొండిగా నిలబడి ఒంటి చేత్తో జట్టుకు విజయాలను అందించగలడు.. 34వ జన్మదిన జరుపుకుంటున్న ఈ క్రికెట్ మేరునగ శిఖరానికి ఓకే తెలుగు టీం శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఒకసారి విరాట్ కోహ్లీ జీవిత చరిత్రను పరిశీలిస్తే..

పరిచయం అక్కర్లేని పేరు
విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.. టీం ఇండియా రన్ మిషన్.. చేజింగ్ మాస్టర్.. కింగ్ కోహ్లీ.. ఇలా ఎన్ని పేర్లు పెట్టి పిలుచుకున్నా అతనిపై ఉన్న అభిమానం కొంచమైనా తగ్గదు.. వయస్సు పెరుగుతున్నా కొద్దీ తన ఆటలో మరింత పదును పెంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఏడాది క్రితం తన పని అయిపోయిందని విమర్శించిన వాళ్ళనోళ్ళతోనే ఇవ్వాళ పొగించుకుంటున్నాడు. టి20 మెన్స్ వరల్డ్ కప్ 2022లో టీం ఇండియా తరఫున కోహ్లీ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీం ఇండియాలో ఒక సభ్యుడుగా ఉన్న కోహ్లీ.. మరోసారి టి20 ప్రపంచ కప్ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
తండ్రి చెప్పిన మాటలు విని
జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడే వాడు గొప్ప వ్యక్తి అవుతాడని చిన్నప్పుడు తన తండ్రి చెప్పిన మాటలను అక్షరాల పాటిస్తున్నాడు కోహ్లీ. క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజుగా పేరుపొందిన కోహ్లీ.. 15వ సంవత్సరంలోనే క్రికెట్లోకి అడుగు పెట్టాడు.. తర్వాత అంచలంచెలుగా ఎదిగాడు. 2008లో అండర్ 19 ప్రపంచ కప్ కు కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. అప్పుడే అండర్ 19 వరల్డ్ కప్ సాధించి పెట్టాడు. కోహ్లీ కెరీర్ ను మలుపు తిప్పింది. రంజి ట్రోఫీ ఆడే సమయంలో తన తండ్రి చనిపోయినప్పటికీ మ్యాచ్ ను ఒంటి చేతితో టీమ్ ని గెలిపించాడు. 2008లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్లో 100 పరుగులు సాధించిన తర్వాత కోహ్లీ టీం ఇండియా జట్టుకు ఎంపిక అయ్యాడు. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరూ గాయపడినప్పుడు 2008లో శ్రీలంకతో ఆడిన ఐడియా కప్ ద్వారా మొదటిసారి వన్డే క్రికెట్లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత కోహ్లీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తన ప్రతిభను చాటుతూ మహేంద్రసింగ్ ధోని తర్వాత భారత క్రికెట్ జట్టు సారధ్య బాధ్యతలు దక్కించుకున్నాడు.. టీం ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు. కోహ్లీ సారధ్యంలో టీమిండియా ఐసీసీ ట్రోఫీలు సాధించలేదని అపవాది తప్ప కెప్టెన్గా ఎన్నో సాధించాడు. 2019 వన్డే వరల్డ్ కప్ లో వరుసగా ఐదు ఆఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి కెప్టెన్ గా నిలిచాడు. టి20 వరల్డ్ కప్ లోనూ సెంచరీ చేసిన మొదటి భారత కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డు అందుకున్నాడు. ధోని నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న విరాట్.. టెస్టుల్లో ఏడవ స్థానంలో ఉన్న భారత జట్టును నెంబర్ వన్ టీం గా నిలపాడు.. అతి తక్కువ కాలంలో 40 టెస్ట్ విజయాలు జట్టుకు అందించి తిరుగులేని నాయకుడు అనిపించుకున్నాడు. భారత క్రికెట్ సమాఖ్య తో ఏర్పడిన విభేదాల వల్ల మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
ఎన్నో అవమానాలు
గత ఏడాది టి20 ప్రపంచకప్ లో టీం ఇండియా ఓటమికి బాధ్యత వహిస్తూ నుంచి వైదొలిగిన కోహ్లీకి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత వన్డే, టెస్ట్ కెప్టెన్సీ పదవులు కూడా ఊడిపోయాయి.. దీనికి తోడు ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లీ బ్యాట్ ఒక్కసారిగా లయతప్పింది. దాదాపు కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ వచ్చి మూడేళ్లు దాటిపోయింది.. ఇక కోహ్లీ పని అయిపోయింది అన్న తరుణంలో బూడిద నుంచి ఫినిక్స్ పక్షి వచ్చినట్టు ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై సెంచరీతో మెరిసాడు.. ఇది చిన్న జట్టు కదా అని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడి నుంచి కోహ్లీ కెరీర్ మరో మలుపు తీసుకుంది. తాను ఫామ్ లోకి వచ్చాను అంటే నమ్మని వాళ్ళు నమ్మే పరిస్థితి తీసుకొచ్చాడు కోహ్లీ. అందుకు సాక్ష్యమే టి20 మెన్స్ వరల్డ్ కప్ 2022. ఈసారి కప్ గెలిచేందుకే ఆడుతున్నాడు అన్నట్టుగా సాగుతున్నాయి కోహ్లీ ఇన్నింగ్స్. ఇప్పటికే ఈ ప్రపంచ కప్ లో టీమిండియా తరఫున లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్న కోహ్లీ విలువ గురించి చెప్పేందుకు పాకిస్తాన్ మీద ఆడిన ఒక ఇన్నింగ్స్ చాలు. 32 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీం ఇండియాకు వంటి చేత్తో విజయం అందించిన అసలు సిసలు వారియర్ కోహ్లీ. హరీస్ రవూఫ్ బౌలింగ్లో ఆఖరిలో కొట్టిన రెండు సిక్సర్లు ఎవ్వర్ గ్రీన్ అని చెప్పొచ్చు. నరాల తెగే టెన్షన్లో కూడా ఎంతో కూల్ గా టీం ఇండియాకు విజయం అందించడం వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కే సాధ్యమవుతుంది.

సచిన్ రికార్డులు బద్దలు కొట్టాడు
ప్రపంచ క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు సచిన్ టెండుల్కర్.. భారత క్రికెట్ దేవుడైన సచిన్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టే వారు ఎవరైనా ఉన్నారా అంటే… ఈ ప్రశ్నకు సమాధానం విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్లో 24 వేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండేళ్ల క్రితం దాకా ఏదో సరదాకి కొడుతున్నట్టు సెంచరీలు బాదాడు. వన్డేల్లో 43, టెస్టుల్లో 27 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ… ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై టి20 సెంచరీ బాది.. మొత్తంగా 71 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్ గా నిలిచాడు.. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 8,000, 9,000, 10,000 11,000 మైలురాయిని అందుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ.. 175 ఇన్నింగ్స్ లో ఎనిమిది వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ.. 222 ఇన్నింగ్స్ లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.. ఈ దశాబ్ద కాలంలో 20వేలకు పైగా పాల్గొని చేసిన మొట్టమొదటి క్రికెటర్ గా సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్ కోహ్లీ. ఈ అరుదైన ఘనతతో ఐసీసీ దశాబ్దపు క్రికెటర్ గా అవార్డు అందుకున్నాడు.. 2016 ఐపీఎల్ సీజన్లో 973 పరుగులు చేసిన విరాట్ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఐదు సీజన్ల వరకు ఈ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు. ఇక ప్రస్తుత టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ లో కోహ్లీ ఫామ్ చూస్తుంటే కప్ కొట్టేందుకే ఆడుతున్నాడా అనిపిస్తోంది! తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, తన కూతురుని అత్యాచారం చేస్తామని కొందరు బెదిరించినా.. ఎన్నడు కూడా కోహ్లీ నోరు మెదపలేదు. తన బ్యాటింగ్ ద్వారానే వారికి సమాధానం చెప్పాడు.. ఎందుకంటే అతడు కింగ్ కోహ్లీ.