
– 255-4 తో పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా జట్టు
_ సెంచరీతో ఆదుకున్న ఉస్మాన్ కవాజా.. సహకరించిన హెడ్, స్మిత్, గ్రీన్
– చెమటోడ్చిన భారత బౌలర్లు.. స్పిన్నర్లు సహకరించని పిచ్
India Vs Australia 4th Test Day 1: ‘కంగారులు కంగారెత్తించారు.. రెండు టెస్టులు ఓడిపోయిన కసి పట్టుదల ఆస్ట్రేలియాలో కనిపించింది.. అందుకే 3వ టెస్టులో కెప్టెన్ మారగానే గాడినపడింది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ, దూకుడుతో 3వ టెస్టులో ఓడించి 4వ టెస్టులో ఆదిలోనే దంచుడు షురూ చేశారు. అహ్మదాబాద్ లో తొలిరోజే టీమిండియాకు షాకిచ్చారు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ-2023 ఆఖరి టెస్టులో మొదటి రోజు ఆసీస్ పై చేయి సాధించింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి 255/4తో పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగు టెస్టులు సిరీస్ లో భాగంగా భారత పర్యటనకు ఆస్ట్రేలియా నెలరోజుల కిందట వచ్చింది. ఇప్పటికే మూడు టెస్టులు పూర్తికాగా భారత్ 2-1 సిరీస్ ఆదిపత్యంలో కొనసాగుతోంది. చివరి టెస్టు అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమైంది.
ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ధాటిగానే బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనింగ్ వచ్చిన ట్రివీఎస్ హెడ్ జోరుగా బ్యాటింగ్ చేయడంతో ఓవర్ కు సగటున నాలుగు పరుగులు చొప్పున రన్స్ వచ్చాయి. భారత బౌలర్లను ఓపెనింగ్ జోడి హెడ్, కవాజా సమర్థవంతంగా ఎదుర్కోవడంతో భారీగానే పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా నిలిచింది. ఈ దశలో 16వ ఓవర్ లో బౌలింగ్ కి వచ్చిన అశ్విన్ ను అటాక్ చేసే ప్రయత్నంలో భారీ షాట్ కు యత్నించి హెడ్ 32(44) రవీంద్ర జడేజా చేతికి చిక్కాడు. దీంతో తొలి వికెట్ భారత్ ఖాతాలో చేరింది. మరో ఏడు ఓవర్ల పాటు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ కు పరుగులు రావడం కష్టమైంది. 23వ ఓవర్ లో షమీ అద్భుతమైన బౌలింగ్ కు లబుచాంజ్ 3(20) క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు.
కవాజా – స్మిత్ బలమైన భాగస్వామ్యం..
పది పరుగులు వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్ మరో ఓపెనర్ కవాజాతో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 79 పరుగుల జోడించారు. ఈ జోడిని విడగొట్టేందుకు తీవ్రంగా యత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలర్లు అందర్నీ ప్రయోగించాడు. ఈ దశలో రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలింగ్ కు స్టీవెన్ స్మిత్ 38(135) ఔట్ అయి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన హ్యాండ్స్ కాంబ్ కొద్దిసేపు బ్యాటింగ్ చేసి 17 (27) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు.

ఆదుకున్న కవాజా – కామెరాన్ గ్రీన్ జోడీ..
ఆస్ట్రేలియా మొదటి రోజు ఆధిపత్యం చెలాయించడంలో ఓపెనర్ ఉస్మాన్ కవాజా, కామెరాన్ గ్రీన్ జోడి కారణం. 70 ఓవర్లలో 170 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్ కు వచ్చిన గ్రీన్ – కవాజ జోడీ ఆచి, తూచి బ్యాటింగ్ చేశారు. ఈ దశలో మరో వికెట్ పడితే భారత్ పూర్తిగా పట్టు బిగించేందుకు అవకాశం ఉన్న దశలో ఈ ఇద్దరు బ్యాటర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.
ఈ ఇద్దరూ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టారు. దీంతో స్కోర్ బోర్డ్ పై మొదటి రోజు ఆసీస్ కు మెరుగైన స్కోర్ లభించింది. ముఖ్యంగా కవాజ ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడితే.. రెండో ఎండ్లో గ్రీన్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో మొదటి రోజు ఆసీస్ నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ 255 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది.
స్పిన్నర్లకు అనుకూలించని పిచ్..
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో గత మూడు టెస్టుల్లోనూ స్పిన్నర్లు తిప్పేశారు. మొదటి రెండు టెస్టుల్లో అశ్విన్, జడేజా మాయాజాలంతో భారత్ ఘన విజయం సాధిస్తే, మూడో టెస్టులో అనూహ్యంగా ఆసీస్ జట్లో చోటు సంపాదించిన కుహనా మాన్ స్పిన్ తో భారత్ బ్యాటర్లను చుట్టేయడంతో ఘోర పరాభావాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. మూడో టెస్ట్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇరుజట్లు స్పిన్ పైనే నమ్మకాన్ని పెట్టుకున్నాయి. అయితే మొదటి రోజు ఆశించిన స్థాయిలో స్పిన్కు సహకారం లభించకపోవడంతో భారత్ మొదటి రోజు వెనుకబడింది.
ఇది స్కోర్ వివరాలు..
మొదటిరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 255/4తో ఉంది. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావెస్ హెడ్ 32(44), ఉస్మాన్ కవాజ 104(251) నాట్ అవుట్, మార్నస్ లబుచాంజ్ 3(20), స్టీవెన్ స్మిత్ 38(135), పీటర్ హాండ్స్ కాంబ్ 17(27), కామరాన్ గ్రీన్ 64 బంతుల్లో 49 పరుగులతో కవాజాతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలింగ్లో మహమ్మద్ షమీ 17 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు సాధించగా, రవిచంద్ర అశ్విన్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్, రవీంద్ర జడేజా 20 ఓవర్లు బౌలింగ్ ఒక చేసి ఒక వికెట్ సాధించారు.