
Ugadi: చైత్రమాసం అనగానే ఉగాది గుర్తుకు వస్తుంది. ‘ఉగం’ అంటే నక్షత్ర గమనం. ఏడాదిని ‘ఉగం’గానూ, దాని తొలిరోజును ‘ఉగాది’గానూ వ్యవహరిస్తున్నాం. అదే విధంగా సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకూ ‘వారం’ (రోజు). సూర్యోదయం సమయంలో ఏ గ్రహ హోరు ఉంటుందో… ఆ రోజును ఆ గ్రహ నామంతో పిలుస్తారు.
సనాతన ధర్మం కాల వ్యవస్థను రూపొందించడంతో పాటు… ఉగాదినాడు నిర్వహించవలసిన విధివిధానాలను కూడా నిర్దేశించింది. జీవితం శుభాశుభాల మిశ్రమం. దాన్ని నడిపే కాలం లక్షణం కూడా అదే. కాబట్టి మంచి సంకల్పాలతో, సత్సంప్రదాయాలతో ఉగాదిని స్వాగతించాలి. ఈ సూత్రాన్ని పరిగణనలోకి తీసుకొని… మన జీవితాలు శుభప్రదంగా గడవాలని పూర్వులు పంచాంగాన్ని రూపొందించి… మార్గనిర్దేశనం చేశారు.
ఉగాది రోజున బ్రహ్మీ ముహూర్తంలో లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, అభ్యంగన స్నానం ఆచరించాలి. నూతన వస్త్రాలను ధరించి, నిర్మలమైన వాతావరణంలో భగవంతుడి ముందు జ్యోతిని వెలిగించాలి. ఇష్ట దేవతను పూజించాలి. ఉగాది పచ్చడిని నివేదించాలి. పెద్దలకు నమస్కరించి, ఆశీర్వచనం తీసుకోవాలి. అనంతరం ఆలయానికి వెళ్ళి, భగవద్దర్శనం చేసుకోవాలి. భగవంతుడికి నివేదించిన ఉగాది పచ్చడిని (నింబకుసుమ భక్షణం) పరగడుపున ప్రసాదంగా స్వీకరించాలి. వేప పూత, కొత్త బెల్లం, నెయ్యి, మామిడి ముక్కలు, లవణం, మిరియాలు లేదా కారం పొడుల మిశ్రమంగా… ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. దీన్ని స్వీకరిస్తే వాత, పిత్త, కఫ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందనీ, ఆరోగ్యం చేకూరుతుందనీ ఆయుర్వేదం చెబుతోంది.

అనంతరం పంచాంగ పఠనం లేదా శ్రవణం చెయ్యాలి. సనాతన భారతీయ జ్యోతిష శాస్త్ర గణనను అనుసరించి.. పంచాంగం పరిగణనలోకి వచ్చింది. మనకు ప్రభవ నుంచి క్షయ వరకూ అరవై సంవత్సరాలు ఉన్నాయి. ఆయా సంవత్సరాల ఫలాలనూ, ఫలితాలనూ పంచాంగం స్థిరీకరిస్తుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలనే అయిదు అంగాలతో కూడినది పంచాంగం. సంపద కోసం తిథి, దీర్ఘాయుష్షుకు వారం, పాప విముక్తికి నక్షత్రం, ఆరోగ్యానికి యోగం, కార్య సిద్ధికి కరణం… వీటి పట్ల జాగ్రత్తగా మెలగాలని శాస్త్రం చెబుతోంది. వాటిలో దేనివల్లనైనా సంప్రాప్తించగల ఉపద్రవాలను పంచాంగం సూచిస్తుంది. నివారణోపాయలను కూడా చెబుతుంది. ఉగాది నుంచి దేవీ సంబంధమైన వసంత నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు ప్రారంభమవుతాయి.