Tragedy of a married Woman : కాలం ముగిసిపోతేనే కాలయముడు వెంటపడతాడు అంటారు. కానీ వీడు అంతకంటే దారుణం. అసలు వాడు మనిషి కాదు. నరరూప రాక్షసుడికి మించిన లక్షణాలు ఉన్నవాడు. అందుకే అతడి బాధ భరించలేక.. అతడు పెడుతున్న వేధింపులు తట్టుకోలేక ఆ వివాహిత తనువు చాలించింది. తన మూడేళ్ల కుమారుడిని వదిలిపెట్టి.. బలవన్మరణానికి పాల్పడింది. కన్నవాళ్ళకు కన్నీరు మిగిల్చింది. మూడేళ్ల కుమారుడికి అమ్మ ప్రేమను దూరం చేసింది.
Also Read: ఎట్టకేలకు ఇండియాలో టెస్లా.. ముంబైలో షోరూం స్పెషాలిటీ ఇదే
ఆ యువతి పేరు తేజావత్ మౌనిక. స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బాసిత్ నగర్. మౌనిక డిగ్రీ వరకు చదువుకుంది.. మౌనికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరువూరు పట్టణానికి చెందిన సాపావట్ కృష్ణ ప్రసాద్ తో పెళ్లి జరిగింది. తెలిసిన బంధువులు ఈ సంబంధాన్ని తీసుకురావడంతో మౌనిక పెళ్లికి ఒప్పుకుంది. వేరే రాష్ట్రమైనా సరే అబ్బాయి మంచివాడని తెలియడంతో మౌనిక మూడు ముళ్ళు వేయించుకోవడానికి సిద్ధపడింది.. మొదట్లో కృష్ణ ప్రసాద్, మౌనిక అన్యోన్యంగా ఉండేవారు. వీరిద్దరి ప్రేమకు ప్రతిరూపంగా ఒక బాబు జన్మించాడు. కృష్ణ ప్రసాద్ వివాహం జరిగిన రెండు సంవత్సరాల వరకు బాగానే ఉన్నాడు. స్థానికంగా ఓ సంస్థలో పని చేసేవాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ఉద్యోగం మానేశాడు. మద్యానికి బానిసయ్యాడు. ఆ తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆమెను నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. కొట్టడం కూడా ప్రారంభించాడు.
భర్త ప్రవర్తన భరించలేని విధంగా ఉండడంతో మౌనిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వారు పంచాయతీ నిర్వహించారు. పెద్దమనుషులు కృష్ణ ప్రసాద్ ను మందలించడంతో తప్పు చేశానని.. మన్నించమని కోరాడు. ఇకపై భార్యను మంచిగా చూసుకుంటానని పేర్కొన్నాడు. కానీ కొద్దిరోజులు మాత్రమే మౌనికతో బాగున్నాడు. ఆ తర్వాత మళ్లీ తన అసలు రూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. దీంతో మౌనిక తట్టుకోలేకపోయింది. మూడు సంవత్సరాల కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో మౌనికను కృష్ణ ప్రసాద్ ఫోన్ లో వేధించేవాడు. రాయడానికి వీలు లేని బూతులు తిట్టేవాడు. భర్త వేధింపులు అంతకంతకు పెరిగిపోతుండడం.. మద్యం తాగి ఫోన్లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉండడం.. ఇతరులతో సంబంధాలు కడుతుండడంతో మౌనిక తట్టుకోలేకపోయింది. ఇదే విషయాన్ని కన్నవారితో చెప్పి బాధపడిపోయింది. అయితే కన్నవారు ఎంతగా ధైర్యం చెప్పినప్పటికీ మౌనిక బాధ తగ్గలేదు. పైగా ఆమె మనసు మరింత గాయపడింది. ఈ నేపథ్యంలోనే తాను చనిపోతే నైనా భర్త మారతాడని భావించి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఫ్యాను కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read: మద్యం తాగేవారికి అలర్ట్.. ఈ బ్రాండ్ టెస్ట్ చేశారా?
మూడు సంవత్సరాల బాబు ఏడుస్తూ ఉండడంతో చుట్టుపక్కల వారు చూశారు. ఇంట్లోకి వచ్చి చూడగా మౌనిక ఫ్యాన్ కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. దీంతో మౌనిక తల్లిదండ్రులు గుండెలు పగిలే విధంగా రోదించారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మౌనిక భర్త కృష్ణ ప్రసాద్, అత్త రామ్ కి, ఆడపడుచు కృష్ణవేణి పై పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి మౌనిక ధైర్యవంతురాలు. చదువుకున్న యువతీ. ఆయనప్పటికీ తన భర్త పెట్టిన వేధింపులు తట్టుకోలేక.. అతడు అనే సూటిపోటి మాటలు భరించలేక తనువు చాలించింది. తన ఇంట్లో ఉన్నప్పుడు మానసికంగా శారీరకంగా వేధించిన కృష్ణ ప్రసాద్.. చివరికి మౌనిక పుట్టింటికి వెళ్ళినప్పటికీ ఊరుకోలేదు. పైగా తన క్రూరత్వాన్ని మరింత దారుణంగా ప్రదర్శించాడు. ఆమెను అంతం చేసేదాకా వదిలిపెట్టలేదు.