
IPL 2023: రేపటినుండి ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. 9 జట్లు బరిలో ఉన్నాయి. ఎవరి బలం వారిదే. ఈ సీజన్ లో మాత్రం ఈ మూడు జట్లకు ఐపీఎల్ చాలా కీలకం.. ఎందుకంటే
సన్రైజర్స్ హైదరాబాద్
గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాలకే పరిమితమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. నయా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్, వ్యూహ చతురత కలిగిన కోచ్ బ్రియాన్ లారా మార్గదర్శకంలో సరికొత్తగా కనిపిస్తోంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజ్ ఈస్ట్రన్ కేప్ జట్టును మార్‌క్రమ్ టైటిల్ విజేతగా నిలిపాడు. దీంతో ఐపీఎల్‌లో హైదరాబాద్ కూడా అతడిపై ఎన్నో ఆశలతో జట్టు పగ్గాలు అప్పగించింది. గత మూడేళ్లలో కెప్టెన్‌ను మార్చడం సన్‌రైజర్స్‌కు ఇది మూడోసారి. 2016లో టైటిల్ నెగ్గిన తర్వాత హైదరాబాద్ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమైంది. 2021లో చివరన నిలవగా.. నిరుడు 8వ స్థానంతో సరిపెట్టుకొంది. జట్టు వైఫల్యాల నేపథ్యంలో వార్నర్, కేన్ విలియమ్సన్‌లను కెప్టెన్సీ బాధ్యతల నుంచి మేనేజ్‌మెంట్ తప్పించింది. ఈ సీజన్‌లో అనుభవజ్ఞుడైన మయాంక్ అగర్వాల్‌ను ఖరీదు చేయడంతో టాపార్డర్‌లో స్థిరత్వం రాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో సర్రున దూసుకెళ్తున్న ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్స్ రాకతో మిడిలార్డర్ బలం పెరిగింది. గ్లెన్ ఫిలిప్స్, క్లాసెన్, మార్‌క్రమ్‌పై అధిక భారం పడే చాన్సుంది. భువనేశ్వర్‌తోపాటు ఉమ్రాన్ మాలిక్, జెన్సన్, నటరాజన్, అప్ఘాన్ స్పిన్నర్ ఫజల్ హక్ ఫారుఖీతో బౌలింగ్ విభాగం వైవిధ్యంగా కనిపిస్తోంది.

హైదరాబాద్‌లో
కీలక ఆటగాళ్లు
మార్‌క్రమ్ (కెప్టెన్), మయాంక్, బ్రూక్స్, వాషింగ్టన్ సుందర్,
భువనేశ్వర్, ఉమ్రాన్
గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని..
ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)ను ఫ్యాన్స్ ఎప్పుడూ ఫేవరెట్‌గానే పరిగణిస్తారు. తొమ్మిది సార్లు ఫైనల్ చేరితే.. నాలుగుసార్లు విజేతగా నిలిచింది. 2008 నుంచి చెన్నై సారథిగా ఉన్న మహీకి ఇదే చివరి లీగ్ అని భావిస్తున్న నేపథ్యంలో.. తమ కెప్టెన్‌కు ట్రోఫీతో గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని జట్టు భావిస్తోంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను ఖరీదు చేయడంతో జట్టు బలం పెరిగింది. గతేడాది సారథ్య బాధ్యతల నుంచి ధోనీ తప్పుకొని జడేజాకు అప్పగించినా.. అతడు కొన్ని కారణాలతో జట్టును వీడి వెళ్లాడు. కానీ, జడ్డూ మళ్లీ జట్టుతో కనిపించడం అభిమానులకు ఊటరనిచ్చే విషయం. ఇంటా-బయట ఫార్మాట్ తిరిగి రావడంతో చెపాక్‌లో చెన్నై విజృంభించే అవకాశం ఉంది. మెలి కలు తిరిగే వికెట్‌పై జడేజా, మొయిన్ అలీ ప్రత్యర్థులకు చెమటలు పట్టించడం ఖాయం. డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, స్టోక్స్, ధోనీ, జడేజాతో బ్యాటింగ్ బలంగా ఉంది. లో స్కోరింగ్ గేమ్‌లో రహానెను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొచ్చు. బౌలింగ్ విభాగం కొంత ఆందోళనకరంగా కనిపిస్తోంది. పేసర్ ముఖేష్ చౌదరి గాయంతో దూరమవడం లోటే. గాయం నుంచి కోలుకొన్న దీపక్ చాహర్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. మోకాలి నొప్పి కారణంగా స్టోక్స్ సగం మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసే అవకాశాల్లేవు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ మహీష్ తీక్షణ ఆలస్యంగా జట్టుతో చేరనుండడం కూడా కలవరపరిచేదే.

చెన్నైలో
కీలక ఆటగాళ్లు
ధోనీ (కెప్టెన్), స్టోక్స్, జడేజా, రుతురాజ్, కాన్వే, తీక్షణ.
పాండ్యా సేన.. ఫేవరెట్‌గా!
ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే కప్ కొట్టిన గుజరాత్ టైటాన్స్‌పై భారీ అంచనాలున్నాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆ జట్టు మరోసారి చాంపియన్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. గతేడాదితో మొదటిసారిగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్.. నిలకడైన ప్రదర్శనతో 14 మ్యాచ్‌ల్లో పది గెలిఇ పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. జట్టును సమర్థంగా నడిపించిన పాండ్యా.. ఆ అనుభవంతో భారత టీ20 పగ్గాలందుకున్నాడు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ జాతీయ జట్టులో కుదురుకోగా.. బౌలింగ్‌లో షమి, రషీద్ ప్రధానాస్త్రాలు. మొత్తంగా గుజరాత్ టీమ్ ఎంతో సమతౌల్యంగా కనిపిస్తోంది. ఆయా ప్లేయర్లకు వారి పాత్రలపై స్పష్టత తీసుకురావడం వెనుక కోచ్ ఆశిష్ నెహ్రా అండ్ కో శ్రమ ఎంతో ఉంది. యువ ఆటగాళ్లు శివమ్ మావి, సాయి కిషోర్ పరిణతి చెందిన ఆటను ప్రదర్శించడం కూడా గుజరాత్ విజయాల్లో కీలకమైంది. గిల్, మిల్లర్, తెవాటియా, కేన్ విలియమ్సన్‌తో బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. సారథిగా హార్దిక్ వ్యవహరించినా.. అంతా నెహ్రా డైరెక్షన్‌లో జరిగిందనే టాక్ బలంగా వినిపించింది. దీని నుంచి పాండ్యా బయటపడాలి. వికెట్ కీపర్ కేఎస్ భరత్, సాహా మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఫెర్గూసన్ లాంటి పేసర్‌ను వదులుకోవడంతో.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ లేని లోటు కనిపిస్తోంది.

గుజరాత్‌లో
కీలక ఆటగాళ్లు
హార్దిక్ పాండ్యా (కెప్టెన్),
కేన్ విలియమ్సన్, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్,
రషీద్, షమి.