Walking Benefits: నడక.. 40 విధాల మేలు అంటారు వైద్యులు.. పెరిగిన ఉరుకులు పరుగుల జీవితం, బిజీ లైఫ్ కారణంగా శారీరక వ్యాయామం తగ్గిపోతోంది. కూర్చుని చేసే జాబ్‌ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరుతున్నాయి. దీంతో వైద్యులు ఉదయం సాయంత్రం నడవడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. నడక ద్వారా 40 రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొంటున్నారు. అందుకే శీతాకాలంలో ఎక్కువ మంది నడకకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే ఈ నడక ద్వారా మరో పెద్ద ముప్పుకు కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు అదేంటో తెలుసుకుందాం.
రోజూ 30 నిమిషాల నడక..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలి. కఠినమైన వ్యాయామాలు కాకున్నా కనీసం రోజూ 30 నిమిషాలపాటు నడిచినా సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు సుమారు 7 వేల అడుగులు నడిచేవారికి.. శరీరంలో ఇతర అవయవాల నుంచి సంభవించే మరణం ముప్పు 50% నుంచి 70% వరకు తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అధ్యయనం పేర్కొంటోంది. అంతకంటే ఎక్కువ నడిస్తే మరింత ప్రయోజనం ఉంటుందని వెల్లడించింది. అతి వేగంతో నడక అవసరం లేదని.. మరీ నెమ్మదిగా కాకుండా కాస్త వేగంగా నడిస్తే చాలని పేర్కొంటుంది. 11 ఏళ్ల పాటు నడక తీరుతెన్నులు, వాకింగ్ చేసే వారిపై పరిశోధన చేసి ఈ విషయం వెల్లడించారు.
ఈ వ్యాధులు అదుపు..
వ్యాయామం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గ్లూకోజ్, బరువు నియంత్రణలో ఉంటాయి. దీని వల్ల గుండెకు సంబంధించిన రోగాల ముప్పు తగ్గుతుంది. వ్యాయామం కోసం కష్టమైన కసరత్తులే చేయనవసరం లేదని క్రమం తప్పకుండా రోజూ నడిస్తే చాలని అధ్యయనం నిర్వహించిన నిపుణులు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో మీ ఆరోగ్యం కోసం రోజూ కాసేపు వాకింగ్ చేయండి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు వైద్యుల సూచనతో వాకింగ్ చేయండి.