Vegetables : ఏమే.. ఓ రెండు వందలు ఇవ్వు మార్కెట్ కు వెళ్లివస్తా.. ఇంకో వంద ఎక్కువ ఇవ్వు ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని వస్తాను అంటే భార్య పప్పు డబ్బాలో దాచిన డబ్బులు ఇచ్చేది. ఓ వారం మొత్తం సరిపడా కూరగాయలు వచ్చేవి. రెండు మూడు వందల్లో వారం సరిపడ కూరగాయలు వస్తే.. ఇప్పుడు రెండు రోజులకు కూడా సరిపడా కూరగాయలు వచ్చేలా లేవు. ఐదు వందలు తీసుకొని మార్కెట్ కు వెళ్తే వామ్మో ఇప్పుడే వచ్చామే అప్పుడే పర్స్ ఖాళీ అయిందా? ఇంటికి వెళ్తే నా పెళ్లం ఈ డబ్బులు నేనే ఏదో చేశాను అనుకుంటది అని భయపడే పరిస్థితి తెచ్చాయి కూరగాయలు.
కాస్త చదవడానికి మీకు ఎలా అనిపించినా.. నిజంగా ఇదే కదా ప్రస్తుతం కూరగాయల వల్ల మీ పరిస్థితి. రూ. 500 తీసుకొని వెళ్తే ఐదు కూరగాయలు కూడా రావడం లేదు. టమాట రూ. 100 మిర్చి రూ. 100 ఇంకే రూ. 200 ఇక్కడే అయిపాయే. మరి మిగిలిన కూరగాయలు తీసుకొనేది ఎలా అని ముక్కున వేలు వేసుకొని వచ్చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సరైన వర్షాలు పడటం లేదు. ఇప్పటి కీ ఎండలు మండుతున్నాయి. దీనితో కూరగాయల సాగు పైనా ప్రభావం చాలా పడింది. దీంతో కూరగాయలు మార్కెట్ లోకి తక్కువ వస్తున్నాయి.
చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో అన్ని రకాల కూరగాయాల ధరలు నలభై శాతం పెరిగాయి.. పచ్చి మిర్చి కిలోకి వంద, చిక్కడు కిలో కి నూట ఇరవై, క్యారెట్ వంద, కాకరకాయ తొంభై , కాలిఫ్లవర్ ఎనభై, అకుకూరలు కిలోకి డెబ్భై గా ఉంటే మార్కెట్ రూ. 500 లతో అవుతుంది అంటారా?… గతంలో మూడు వందల రూపాయల కూరగాయలు కొనుగోలు చెస్తే వారం రొజులకి సరిపడేది కదా. కానీ.. ఇప్పుడు కనీసం రెండు రోజులకి కూడ సరిపోవడం లేదు కదా..
ఈధరలు మరింత పెరిగే అవకాశం వుందంటున్నారు వ్యాపారస్థులు. కొత్త పంట చేతికి వస్తే సామాన్యుడి జేబు నిండుగా ఉంటూనే కూరగాయల సంచి కూడా నిండుగా ఉంటుంది. లేదా జేబు ఖాళీనే, సంచి ఖాళీనే. మొత్తం మీద ఇప్పటికే ఎండ తీవ్రత ఉంది. దీంతో కొత్త పంట సాగు చేయడం కష్టమే. వర్షాలు కొట్టకపోతే కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. సో కాస్త గుండె పదిలం చేసుకోండి.