
Groom fell Asleep: పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. వివాహానికి ఉండే విలువ అలాంటిది. పెళ్లంటే నూరేళ్ల పంట. జీవితాంతం కలిసి కాపురం చేసే భాగస్వామిని మన దాన్నిచేసుకునే ఓ తతంగం. అందుకే అందరు ఎంతో నిష్టగా ఉంటారు. పెళ్లికి వరుడు, వధువు ఇద్దరు పవిత్రంగా ఉండటం సహజమే. ఏ ఆహారాలు కూడా తీసుకోరు. ఎందుకంటే మధ్యలో లేవడం కుదరదు కాబట్టి. కానీ ఇటీవల అన్నింట్లో విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి అని తెలిసినా మద్యం తీసుకుంటున్నారు. ఫలితంగా ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. తాగొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోవడం సభ్యత అనిపించుకోదు. వేదమంత్రాల సాక్షిగా పెళ్లి వేడుకలో మంత్రాలు ఉచ్ఛరించాలి. వధువు మెడలో తాళి కట్టాలి. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు సాక్షిగా ఉంటారు. ఇలాంటి పవిత్రమైన కార్యాన్నే అపవిత్రం చేశాడో ప్రబుద్ధుడు. పెళ్లి మండపంలోకే తాగొచ్చి మంత్రాలు ఉచ్ఛరించలేక నిద్రపోవడం విచిత్రం.
తాజాగా అస్సాం రాష్ట్రంలోని నల్బారీ జిల్లాలో ఓ జంటకు పెళ్లి నిశ్చయించారు. ముహూర్తం దగ్గర పడింది. దీంతో వధువు వచ్చి పెళ్లిపీటల మీద కూర్చుకుంది. కాసేపట్లో వరుడు కూడా వచ్చాడు. కానీ అతడు మద్యం మత్తులో తూగుతూ వచ్చాడు. సరిగా కూర్చోలేక అటు ఇటు పడిపోయాడు. అందరు సర్ది చెప్పినా అతడు సరిగా కూర్చోలేక మండపంలోనే పెళ్లి మంత్రాలు చదువుతుండగానే నిద్రలోకి జారుకున్నాడు. వరుడు గుర్రుపెట్టి నిద్రపోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
ఇదేమిటి పెళ్లి చేసుకోవాల్సిన వరుడు నిద్రపోతున్నాడని అందరు అడిగినా అతడిలో ఉలుకు లేదు. పలుకు లేదు. దీంతో అందరికి సీన్ అర్థమైంది. అతడు ఫుల్లుగా మద్యం తాగొచ్చాడని అక్కడ కంపు కొడుతున్న వాసన తెలియజేస్తోంది. వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏమిటిది? వరుడికి ఏమైనా బాధ్యత ఉందా? మండపంలోకి తాగొస్తాడా? అని నిలదీసింది. ఇలాంటి తాగుబోతుతో తాను పెళ్లికి సిద్ధంగా లేనని తెగేసి చెప్పింది. తాగుబోతు మొగుడు తనకు అక్కర్లేదని పెళ్లకి నిరాకరించింది.
ఇరువర్గాల్లో అలజడి మొదలైంది. వధువు కుటుంబం వరుడి కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవిత్రంగా భావించే పెళ్లి మండపంలోకే తాగొచ్చిన వాడు ఇక జీవితాంతం తనను ఎలా చూసుకుంటాడని వధువు ప్రశ్నించింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తాగొచ్చిన వరుడు నిర్వాకం వల్ల జరగాల్సిన పెళ్లి కాస్త రద్దయింది. పెళ్లికొడుకు చేసిన పనికి వరుడు కుటుంబీకులు తల దించుకోవాల్సి వచ్చింది. ఒక్క పూట కూడా మందు తాగకుండా ఉండలేకపోయిన అతడి చేష్టలకు అందరు శాపనార్థాలు పెట్టారు.