BCCI Sacks Chetan Sharma: టీమిండియా జట్టులో మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకు గాను చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లోనే ఇంటి దారి పట్టడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వెన్నుచూపి రావడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్ ను కనీసం కట్టడి చేయకుండా పరుగులు సమర్పించుకోవడం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆటపై కూడా సందేహాలు రావడం గమనార్హం. దీంతో టీమిండియాలో మార్పులు అనివార్యమనే చెబుతున్నారు.

పొట్టి క్రికెట్ , వన్డే, టెస్ట్ సిరీస్ లకు వేరువేరుగా కెప్టెన్లు ఉండాలనే వాదన కూడా వస్తోంది. మూడింటికి ఒకే కెప్టెన్ కావడంతో అతడిపై ఒత్తిడి పడుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొట్టి క్రికెట్ కు ఒకరు, వన్డేలకు ఇంకొకరు, టెస్ట్ లకు మరొకరు ఉండాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు బీసీసీఐ ఆలోచన చేస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో చోటుచేసుకున్న పరిణామాలతో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని క్రీడా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జాతీయ సెలక్షన్ కమిటీపైనే వేటు వేయనుంది. ఇంకా కొందరిపై వేటు పడే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ వంటి వారు వయసు ముప్పై దాటడంతో వారిని కూడా టీ20 నుంచి పక్కకు తప్పించనున్నట్లు సమాచారం.
రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా గడవకముందే అతడి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఓటమి భారంతో వచ్చిన టీమిండియాను ప్రక్షాళన చేయాలని బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మను మరికొంత కాలం కొనసాగిస్తే అతడి ప్రతిభ తెలుస్తుంది. కానీ ఇలా అర్థంతరంగా మార్పులు చేస్తే టీమిండియాకు నష్టమే కలగొచ్చని ప్రేక్షకులు చెబుతున్నారు. ఏదిఏమైనా రోహిత్ శర్మను మాత్రం తొలగించడం ఖాయమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

2024లో జరిగే ప్రపంచకప్ కంటే ముందే జట్టులో మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్నారు. హార్థిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారు. హార్థిక్ పాండ్యా నేతృత్వంలోనే ఇండియా, న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. వర్షం కారణంగా నవంబర్ 18న జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. దీంతో రెండు జట్లు సమరానికి సిద్ధమైనా వర్షం దెబ్బతో ఆట కొనసాగలేదు. తరువాత జరిగే మ్యాచులకు రెండు జట్లు కసరత్తు చేస్తున్నాయి. దీంతో హార్థిక్ పాండ్యా సారధ్యం ఎలా ఉండబోతోందనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.