T20 World Cup 2022-India vs England: టి20 మెన్స్ వరల్డ్ కప్ కీలక దశకు చేరుకుంది. భారత్, జట్ల మధ్య టఫ్ ఫైట్ గురువారం జరగబోతోంది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. సౌత్ ఆఫ్రికా పై మినహా సూపర్ 12లో విజయం సాధించిన టీం ఇండియా ఫుల్ జోష్ లో ఉంది. అదే ఫామ్ సెమిస్ లోనూ సాగించాలని భావిస్తోంది. రాహుల్, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా రాణిస్తే టీం ఇండియాను ఆపడం ఇంగ్లాండ్ కు సాధ్యం కాదు. మరోవైపు ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ శర్మ చేతికి గాయం అయింది. దీంతో అతను క్రీజు నుంచి బయటికి వెళ్లిపోయాడు. రోహిత్ గాయం పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అటు బౌలింగ్లో హర్షదీప్ సింగ్, షమీ, భువి రాణిస్తే భారత్కు తిరుగు ఉండదు.

అడ్వాంటేజ్ ఇదే
హార్డ్ హిట్టర్స్ ఉన్న ఇంగ్లాండ్ ను ఓడించడం టీం ఇండియాకు అంత సులువు కాదు. టోర్నీ ప్రారంభించి ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న ఇంగ్లాండ్ భారత్ పై విజయం సాధించి ఫైనల్ మ్యాచ్లో అడుగు పెట్టాలని చూస్తోంది. అలెక్స్ హేల్స్, బట్లర్, లివింగ్ స్టోన్,బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, సామ్ కరన్ వంటి ఆటగాళ్ళతో బలంగా కనిపిస్తోంది. బౌలింగ్లో ఇంగ్లీష్ టీం సత్తా చాటుతోంది. కీలక ఆటగాడు డేవిడ్ మలన్ గాయంతో సెమీస్ కు దూరమయ్యాడు. ఇది టీం ఇండియాకు అడ్వాంటేజ్. అయితే ఫస్ట్ సెమిస్ లో కివీస్ పై పాకిస్తాన్ విజయం సాధించి ఫైనల్ మ్యాచ్ లో భారత్, పాకిస్తాన్ తలపడాలని టీం ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదే జరిగితే మరో హై వోల్టేజ్ మ్యాచ్ అభిమానులను అలరించడం ఖాయం.
ఇండియా దుమ్మురేపింది
అడిలైడ్ లోని ఓవల్ మైదానంలో టీం ఇండియాకు మెరుగైన రికార్డు ఉంది. ఇక్కడ భారత జట్టు రెండు టీ20 లు ఆడి రెండూ మ్యాచ్ లు గెలిచింది.. 2021లో టీం ఇండియా తొలి టి20 ఆడింది. ఆ మ్యాచ్ గెలిచింది.. తాజాగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ సిరీస్ లోనూ బంగ్లాదేశ్ పై మ్యాచ్ ఆడి గెలిచింది. నవంబర్ రెండో తేదీన జరిగిన ఈ మ్యాచ్లో డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఐదు పరుగుల తేడాతో టీం ఇండియా గెలిచింది. అటు ఈ పిచ్ పై 15 వన్డేలు ఆడితే 9 మ్యాచ్ ల్లో భారత్ విజయం సాధించింది.
ఇంగ్లాండ్ కు చెత్త రికార్డు
అడిలైడ్ లో ఇంగ్లీష్ టీంకు చెత్త రికార్డు ఉంది. 17 వన్డేలు ఆడిన ఇంగ్లాండ్ కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది.. 12 మ్యాచ్ల్లో ఓడిపోయింది.. ఇక్కడ ఆ జట్టు ఒక టి20 మ్యాచ్ ఆడింది. 2011లో జరిగిన ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.. చివరగా ఇంగ్లాండ్ 2015 వన్డే ప్రపంచ కప్ లో ఓవల్ వేదికగా బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడింది. 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది..

కింగ్ కోహ్లీ
ఈ మైదానంపై విరాట్ కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లో కలిపి కోహ్లీ ఇక్కడ 10 మ్యాచ్ లు ఆడాడు.. మొత్తంగా 14 ఇన్నింగ్స్ ల్లో 907 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అడిలైడ్ లో రెండు టి20 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ ఫస్ట్ మ్యాచ్లో 90 పరుగులు, రెండో మ్యాచ్లో 64 పరుగులు సాధించాడు.. ఈ వేదికపై కోహ్లీకి 90.7 సగటు ఉండటం గమనార్హం.
భారత జట్టు దే పై చేయి
టి20 లో ఓవరాల్ గా ఇండియా, ఇంగ్లాండ్ ఇప్పటివరకు 22 సార్లు తలపడ్డాయి. భారత్ 12 సార్లు విజయం సాధించింది. ఇంగ్లాండ్ పది మ్యాచ్ల్లో గెలిచింది. టి20 వరల్డ్ కప్ లో మూడుసార్లు 2007, 2009, 2012లో ఇరుజట్లు పోరాడితే ఇందులో భారత్ రెండుసార్లు గెలిచింది.