Summer Holidays: పాఠశాల సమయంలో నిత్యం చదువులు.. హోంవర్క్ ల తో బిజీగా ఉండే విద్యార్థులు సెలవుల రాగానే ఎంతో హాయిగా ఉంటారు. దాదాపు రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకునే విద్యార్థులు ఈ సమయంలో స్నేహితులతో ఉల్లాసంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే పట్టణాలు, నగరాల్లో ఉండే విద్యార్థులు మాత్రం ఆడుకోవడానికి సరైన స్థలం లేక.. స్నేహితులు లేక ఇంట్లోనే కూర్చుంటారు. ఈ సమయంలో విశ్రాంతి కోసం టీవీలు చూస్తూ.. మొబైల్ తో కాలక్షేపం ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల పిల్లల కంటి చూపు మందగించే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల మనసు ఆందోళనగా మారి ఆ తర్వాత చదువుపై దృష్టి పడే అవకాశం ఉండదు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టి ఈ పనులను చేయాలి. అవేంటంటే?
వేసవి సెలవులు విద్యార్థులకు విశ్రాంతి ఇవ్వడంతో పాటు ఈ సమయంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలి. వేసవి సెలవుల్లో చాలా సంస్థలు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసి వివిధ రకాల స్పోర్ట్స్ లేదా కల్చరల్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలో వారికి ఆసక్తి ఉంటే నేర్పించే ప్రయత్నం చేయాలి. అయితే బలవంతంగా నేర్పించే ప్రయత్నం చేయొద్దు. ఈ సమయంలో ఏదైనా ఒక అంశం ని ఎంచుకొని దానిని నేర్చుకునేలా ప్రోత్సహించాలి. ఇవి భవిష్యత్తు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయి.
అయితే అందరూ పిల్లలు ఇలాంటి వాటిపై ఆసక్తి ఉండకపోవచ్చు. ఈ సమయంలో అమ్మమ్మలు, లేదా బంధువులు ఇంటికి పంపించాలి. ముఖ్యంగా వ్యవసాయదారుల కుటుంబాలకు పంపించడంతో వారికి వ్యవసాయం గురించి తెలియజేసినట్లు అవుతారు. వీలైతే వారిని పొలాలకు తీసుకెళ్లి అక్కడున్న విషయాలను పూర్తిగా వివరించాలి. దేశానికి అన్నం పెట్టేవారు రైతులు అని వారు గుర్తించేలా చేయాలి. అంతేకాకుండా ఒక పంట తీయడానికి వారు ఎలాంటి కష్టం పడతారు చెప్పాలి. ఇలా చేయడం వల్ల వారికి కష్టసుఖాల గురించి పూర్తిగా తెలుస్తుంది.
ఈ అవకాశం లేని వారు తల్లిదండ్రులు వారానికి ఒకరోజు లేదా సందర్భం వచ్చినప్పుడు యాత్రలు చేస్తూ ఉండాలి. అయితే వీటిలో ఆధ్యాత్మిక యాత్రలో అయితే మరీ మంచిది. ఎందుకంటే పిల్లల్లో దైవభక్తి పెంపొందిస్తే వారి మనసు ప్రశాంతంగా మారుతుంది. దీంతో చదువుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తారు. అంతేకాకుండా జీవితానికి సంబంధించిన కొన్ని విలువలను కూడా ఇలాంటి క్షేత్రాల్లో చెప్పే ప్రయత్నం చేయాలి. వీటితోపాటు కొన్ని పురాతనమైన లేదా చరిత్ర కలిగిన ప్రదేశాలకు తీసుకెళ్లాలి. వాటి గురించి చెబుతూ అక్కడి రాజుల గురించి వివరించే ప్రయత్నం చేయాలి.
ఇక పిల్లలు ఏం చేస్తే సంతోషంగా ఉంటారో.. వారికి అనుగుణంగా తల్లిదండ్రులు అవే పనులు చేయాలి. అయితే మొబైల్ లేదా టీవీ వంటివి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఎక్కువసేపు స్నేహితులతో ఆడుకునేలా ప్రోత్సహించాలి. అలాగే వారికి మైండ్ గేమ్ కు సంబంధించిన ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. తల్లిదండ్రుల్లో ఎవరూ ఒకరు వారితో ఆటల్లో పాల్గొనడం వల్ల వారికి కూడా తల్లిదండ్రులపై గౌరవం పెరుగుతుంది.