Snoring Problem: ఒంటరిగా పడుకునే వాళ్లకు ఈ సమస్య తెలియదు. ఏదైనా పెళ్లిళ్లు పేరంటాలు జరిగి అందరూ ఒకచోటు చేరి రాత్రి పడుకున్నారా? ఇక ఈ సౌండ్ ఇంజినీర్ల దెబ్బకు అసలు నిద్ర ఉండదు. చాలా మందికి తాము గురక పెడుతున్నామన్న విషయం కూడా తెలియదు. ఎందుకంటే వాళ్లు మంచి గాఢ నిద్రలో ఉంటారు. కానీ వారి గురకతో ఇతరుల నిద్రను చెడగొడుతుంటారు.

ఈ మధ్య గురక అనేది చాలామందికి అతి పెద్ద సమస్య అయిపోయింది. నిజానికి ఇది చాలా సాధారణమైన సమస్య. అయితే, ఇది బాధితున్నే కాకుండా, ఇతరుల్ని కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వైద్య నిపుణులు మాత్రం గురక అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతం అని చెబుతున్నారు. ఎప్పుడో ఒకసారి గురక సమస్య వేధిస్తే తప్పు లేదు కానీ తరచూ ఆ సమస్య వేధిస్తుంటే మాత్రం ప్రమాదమేనని చెబుతున్నారు. గురక ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Also Read: Bride Marries Sister’s Groom : తాళి కట్టే వేళ కరెంట్ కట్: పీటలపై మారిపోయిన వరుడు
-గురక ఎందుకు వస్తుంది?
భర్త గురక భరించలేక విడాకులు ఇచ్చిన భార్యలు ఉన్న సమాజం ఇది. కాబట్టి.. ఈ గురక సమస్యను తేలికగా తీసుకోలేం. అసలు గురక ఎలా వస్తోందో తెలుసా ? నిద్ర పోతున్న సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో ఏమైనా అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తూ ఉంటుంది. పైగా ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. గాలి వెళ్లాల్సిన మార్గంలో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురక చప్పుళ్లు వస్తాయి. అయితే, గురక రావడానికి ఈ ఒక్క కారణం మాత్రమే ఎప్పటికీ కారణం కాదు. నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోను అవుతుంది. అప్పుడు గురక ఎక్కువగా వస్తూ ఉంటుంది. నిద్రించే సమయంలో వ్యక్తి శ్వాస పీల్చినప్పుడు శ్వాసనాళంలో అడ్డంకులు ఏర్పడడం వల్ల క్రమేణా అది గురకకు దారితీస్తుంది. వాస్తవానికి గురకకు మరెన్నో కారణాలు ఉంటాయి. అలాగే మరెన్నో అంశాలు దోహదం చేస్తాయి. అయితే, ప్రధాన కారణం మాత్రం మానసికపరమైన ఒత్తిడి, అలాగే విపరీతమైన కంగారు, అన్నింటికి మించి విపరీతమైన ఆలోచనా ధోరణిని కలిగి ఉండటం.
-గురక వల్ల ఇతర అనర్థాలు..
గురక వస్తుందంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్వాస సరిగ్గా ఆడకపోతే గురక వస్తుంది. అయితే గురక వచ్చే వాళ్లకు అవసరమైనంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వేధిస్తాయి. గురక ఎక్కువ రోజులు ఉంటే సరిగ్గా నిద్రపొకపోవడం వల్ల రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది. బరువు పెరిగినా కొన్నిసార్లు గురక సమస్య వేధించే అవకాశం ఉంటుంది.

-గురక ఎవరికి ఎక్కువగా వస్తుంది..?
జలుబు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లను ఎక్కువగా గురక సమస్య వేధిస్తూ ఉంటుంది. పొగ తాగే అలావాటు ఉన్నవాళ్లలో శ్వాస సంబంధిత సమస్యల వల్ల కూడా గురక సమస్య వేధించే అవకాశం ఉంటుంది. పడుకునే సమయంలో సరిగ్గా పడుకోకపోయినా గురక వచ్చే అవకాశం ఉంది.
-గురక రాకుండా ఏం చేయాలి?
గురకకు కారణమయ్యే గొంతు వాపు, ధూమపానం వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక లావుగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవాలి. అలా పడుకోవటం అలవాటు చేసుకుంటే.. గురక తగ్గుతుంది. అదే విధంగా నీటి ఆవిరిలో యూకలిప్టస్ తైలాన్ని వేసి ఆవిరి పడి తే శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తగ్గుతుంది. గురక తగ్గడానికి ఆవిరి పట్టడం అనేది మంచి హోం రెమెడీ. ఇది అందరూ ట్రై చెయ్యొచ్చు. గురక తగ్గాలంటే ముందు స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. వయస్సుకు, ఎత్తుకు తగిన బరువు ఉంటే గురక వచ్చే అవకాశం తగ్గుతుంది. ప్రతిరోజూ గురక వస్తుంటే మాత్రం మందులు వాడి సమస్య నుంచి బయట పడవచ్చు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించి గురక సమస్యకు సులువుగా చెక్ పెట్టవచ్చు.

-గురుకను తగ్గించే చిట్కాలివీ..
-ప్రతిరోజూ రాత్రి మీరు నిద్రపోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తీసుకుని తింటే, ఇక గురక రాదు. వచ్చినా కంట్రోల్ అవుతుంది.
-అర టీ స్పోన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగండి. అప్పుడు కూడా గురక రాదు. దీని వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
-ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించండి. మీ గురక మాయం అవుతుంది.
-కొద్దిగా పిప్పర్‌మెంట్ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది.
– ఒక గ్లాసు వేడి నీటిలో అరటీ స్పూన్ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగండి. . దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.
-రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టినా గురక రాదు. పైగా నిద్రపోయాక మంచి నిద్ర పడుతుంది.
ఇలాంటి ఎన్నో చిట్కాలను పాటించి మనం మన గురకను చక్కగా తగ్గించుకోవచ్చు.
గమనిక: గురక సమస్యపై నివేదించిన పై విషయాలు కేవలం ఆయుర్వేద నిపుణులు, ఆరోగ్య నిపుణుల సూచనలే. ఈ చిట్కాలను మా ‘oktelugu.com’ ధ్రువీకరించడం లేదు. గురక ఆరోగ్య సమస్యలుంటే వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.. వారి సలహాపై చికిత్స తీసుకోండి.
Recommended Videos: