SCSS Scheme: ఒక్కసారి పెట్టుబడితో వేలల్లో రాబడి.. ఆ స్కీం సీనియర్‌ సిటిజన్లకు మాత్రమే..

రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే బెనిఫిట్స్‌ను ఖర్చు చేయకుండా రిటైర్మెంట్‌ తర్వాత కూడా రాబడి వచ్చేలా సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే గణనీయమైన రాబడిని పొందవచ్చు.

Written By: Raj Shekar, Updated On : June 11, 2024 1:06 pm

SCSS Scheme

Follow us on

SCSS Scheme: మన దేశంలో ప్రైవేటు కంపెనీలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. చాలా మంది రిటైర్‌ అయిన తర్వాత ఆదాయం తగ్గిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పెన్షన్‌ స్కీం కూడా ఎత్తివేయడంతో ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి ఆదాయం రావడం లేదు. అదే సమయంలో వృద్ధాప్య సమస్యల కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయి. వీటికోసం కొడుకులు, కూతుళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే రిటైర్మెంట్‌ తర్వాత అసాధారణ ఆదాయం పొందవచ్చంటున్నారు ఆర్కెట్‌ నిపుణులు.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంతో రాబడి…
ఇక రిటైర్మెంట్‌ తర్వాత వచ్చే బెనిఫిట్స్‌ను ఖర్చు చేయకుండా రిటైర్మెంట్‌ తర్వాత కూడా రాబడి వచ్చేలా సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే గణనీయమైన రాబడిని పొందవచ్చు. ఈ పథకంలో, ఒకసారి రూ. 10 లక్షల పెట్టుబడి పెడితే మూడు నెలలకు రూ.20,500 చొప్పున రిటర్న్‌లు తీసుకోవచ్చు. ఏడాదికి రూ.82 వేలు పొందవచ్చు.

పథకం ప్రనయోజనాలు ఇవీ..
సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం పోస్టాఫీస్‌ నిర్వహిస్తున్న పొదుపు పథకం. హామీతో కూడిన రిటర్న్‌ స్కీంగా నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో సీనియర్‌ సిటిజన్లు 8.20 శాతం వార్షిక వడ్డీని పొందుతారు. నాన్‌ మార్కెట్‌ లింక్డ్‌ స్కీమ్‌. ఐదేళ్ల లాక్‌ ఇన్‌ వ్యధి ఉంటుంది. ఈ పథకంలో వడ్డీ రూపంలో త్రైమాసిక ఆదాయాన్ని పొందవచ్చు. పథకంలో కనీస డిపాజిట్‌ రూ 1,000గా ఉంటే గరిష్ట డిపాజిట్‌ రూ. 30 లక్షలుగా ఉంది. ఎస్‌సీఎస్‌ఎస్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు

55 ఏళ్లు దాటితేనే..
ఇక సేవింగ్‌ స్కీంలో చేరడానికి ఏ వ్యక్తి వయసు అయినా 55 కంటే ఎక్కువ, 60 ఏళ్లలోపు ఉండాలి. 50 సంవత్సరాల కన్నా ఎక్కువ, 60 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న రిటైర్డ్‌ డిఫెన్స్‌ ఉద్యోగులు కూడా ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతా తెరవడానికి అవకాశం ఉంది. ఖాతాదారులు మూడు నెలలకు ఒకసారి వడ్డీ పొందుతారు. డిపాజిట్‌ చేసిన తేదీ నుంచి మార్చి 31/జూన్‌ 30/సెప్టెంబర్‌ 30/డిసెంబర్‌ 31 వరకు వర్తిస్తుంది. ఆర్జించిన వడ్డీ ఏడాదిలో రూ.50 వేలు దాటితే పన్ను విధిస్తారు.

రూ.82 వేల ఆదాయం ఇలా..
ఇక ఎస్‌సీఎస్‌ఎస్‌ ద్వారా రూ. 82 వేల వార్షిక ఆదాయం పొందేందుకు సీనియర్‌ సిటిజన్స్‌ ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడితో వారికి మూడు నెలలకు రూ.20,500 చొప్పున వడ్డీ వస్తుంది. నాలుగు త్రైమాసికాలకు కలిపి రూ.82 వేలు పొందవచ్చు. ఇక పథకం మెచ్యూరిటీ తర్వాత డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. ఈ పథకంలో గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. రూ.30 లక్షలకు ప్రతీ మూడు నెలలకు రూ.61,500 చొప్పున వడ్డీ పొందుతారు. ఏడాదికి రూ.2,46,000 రిటర్న్‌లు వస్తాయి. మెచ్యూరిటీ తర్వాత, అసలు మొత్తం రూ.30 లక్షలను తిరిగి పొందవచ్చు.