Sakshi: మే నెలలో పోలింగ్ ముగిసిన తర్వాత.. సాక్షి యాంకర్ పసుపులేటి ఈశ్వర్ భారీగా డైలాగులు వల్లె వేశారు. ” కొట్టండి చప్పట్లు. వేయండి ఈలలు. పెట్టండి డీజే.. మోగించండి బాణాసంచా.. విక్టరీ కన్ఫర్మ్ బాస్. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం” ఇలా సాగిపోయింది ఎలివేషన్. కానీ ఫీల్డ్ రియాలిటీ వేరే విధంగా ఉంది.. పంచుడు పథకాలకు ప్రజలు అలవాటుపడ్డారు కాబట్టి.. చచ్చినట్టు ఓటు వేస్తారని.. ప్రతిపక్షానికి అవకాశం ఉండదని వైసిపి భావించింది. కానీ ప్రజలు దేవుడి స్క్రిప్ట్ ను మరో విధంగా ప్రదర్శించారు. ఫలితంగా గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచిన వైసిపికి.. ఈసారి 11 మాత్రమే మిగిలాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.. అధికారంలో ఉన్నప్పుడు సాక్షి అడ్డగోలుగా వార్తలు రాసింది. అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేసింది.. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చింది. దేవుడా.. కాపాడు స్వామి అంటూ ఆర్తనాదాలు పెడుతోంది.
ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఓ రేంజ్ లో ప్రతిపక్షాలను ఆడుకున్న సాక్షి న్యూస్ ప్రజెంట్ ఈశ్వర్.. ఇప్పుడు ఆయన టోన్ ను కొందరు మార్చారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆయన గొంతును సవరించారు. ” కష్టాల్లో ఉన్నాం. కన్నీళ్లు పెట్టుకుంటున్నాం. కాపాడండి” అంటూ వీడియో రూపొందించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని.. వేధింపులు పెరిగిపోయాయని.. దాడులు చేస్తున్నారని సాక్షి పత్రికలో విపరీతంగా కథనాలు ప్రచురితమవుతున్నాయి. సాక్షి ఛానల్ లోనూ దృశ్యాలు టెలికాస్ట్ అవుతున్నాయి.. ఈ విషయాన్ని వైసిపి సోషల్ మీడియా కూడా తెగ హైలైట్ చేస్తోంది. ఇలాంటి దాడులను, వేధింపులను ప్రజాస్వామ్య బుద్ధి జీవులు సహించరు. కానీ గత ఐదు సంవత్సరాలలో ఇలాంటి ఘోరాలు చాలా జరిగినప్పుడు సాక్షి బాధ్యతగల మీడియాగా పట్టించుకోలేదు. సింగిల్ కాలం వార్త కూడా రాయలేకపోయింది.. అప్పుడు సాక్షి రైటర్లకు ఆ సోయి లేదా? కనీసం వార్తను వార్తలాగా ప్రచురించాలనే ఇంగిత జ్ఞానం లేదా?
ప్రస్తుతం పసుపులేటి ఈశ్వర్ వాయిస్ మరింత పెంచి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. అది ఆయన హక్కు కూడా. ఇందులో తప్పు పట్టడానికి లేదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇదంతా చేశాడా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. “అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను ఎలా వాడుకోవాలో జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పారు. జగన్ చూపించిన బాటలోనే ఆయన నడుస్తున్నారు. మాపై రెచ్చిపోయిన వారికి కచ్చితంగా చుక్కలు చూపిస్తారు. వ్యవస్థలను నాశనం చేసి.. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడి.. ఎంత చేయాలో అంత చేశారు. ఇప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఏడ్చినప్పటికీ ఉపయోగముండదు. అందుకే వ్యవస్థలను వ్యవస్థల లాగే ఉంచాలి . ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుందని” టిడిపి నాయకులు అంటున్నారు.
మరోవైపు అధికారం కోల్పోయిన తర్వాత సాక్షి ప్రింటింగ్ లో చాలావరకు కాస్ట్ కటింగ్ జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 60% ప్రింటింగ్ ను తగ్గించారని టిడిపి నాయకులు విమర్శిస్తున్నారు. మరోవైపు కొంతమంది ఉద్యోగులు దిన దిన గండంగా కార్యాలయాలకు వెళ్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి సాక్షి వ్యవహారంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉందని సొంత పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.