BJP: బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు.. రేసులో లక్ష్మణ్‌

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరో తెలుగు నేత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో దళితుడు అయిన బంగారు లక్ష్మణ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.

Written By: Raj Shekar, Updated On : June 11, 2024 1:01 pm

BJP

Follow us on

BJP: కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నరేంద్రమోదీ.. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. కేంద్ర క్యాబినెట్‌లోకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డాను తీసుకున్నారు మోదీ. ఆయనకు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికపై కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డికి కూడా మరోమారు కేబినెట్‌లో స్థానం దక్కింది. దీంతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా కొత్తవారికి ఇవ్వనున్నారు.

జాతీయ అధ్యక్ష రేసులో తెలుగు నేత..
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరో తెలుగు నేత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో దళితుడు అయిన బంగారు లక్ష్మణ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. తాజాగా మరో లక్ష్మణ్‌ కూడా అధ్యక్ష రేసులో ముందు ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్న కె.లక్ష్మణ్‌ను కమలం నేతలు.. బీజేపీ అధ్యక్ష పదవిలోకి పరిగణనలోకి తీసుకుంటున్నారు.

మొదట శివరాజ్‌సింగ్‌కు ఇవ్వాలని..
జేపీ నడ్డా పదవీ కాలం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయనను మోదీ కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిపించిన నేత శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని మొదట భావించారు. ఆయనకు జాతీయ స్థాయిలో ఇమేజ్‌ ఉంది. అయితే అనూహ్యంగా మోదీ శివరాజ్‌ను కూడా కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. తర్వాత అధ్యక్ష రేసులో ఒడిశా నేత ధర్మేంద్ర ప్రధాన్‌ రేసులో ఉంటారని భావించారు. కానీ, ఆయనకు కూడా కేంద్ర క్యాబినెట్‌లో బెర్తు దక్కింది. జాతీయస్థాయి ఇమేజ్‌ ఉన్న నేతలంతా కేంద్ర కేబినెట్‌లో చేరడంతో కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న చర్చ జరగుతోంది.

తెరపైకి లక్ష్మణ్‌ పేరు..
ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పేరు తెరపైకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ ఆ మేరకు లక్ష్మణ్‌కు జాతీయ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీ టార్గెట్‌గా బెంగాల్‌ కూడా ఉంది. బెంగాల్, యూపీకి చెందిన నేతల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే వీరికి పెద్దగా ప్రజాదరణ, గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ రేసులో ముందు ఉన్నట్లు తెలుస్తోంది.