Sankranti Festival 2023: దట్టంగా పరుచుకున్న మంచు… వెన్నులో వణుకు పుట్టించే చలి… వీటన్నింటిని తొలగించుకుంటూ ఉదయించే సూర్యుడు.. మట్టి కుండలో నాన్న పితికే ఆవుపాలు.. వాకిలి పై కల్లాపి చల్లి రథం ముగ్గులు వేసే అమ్మ.. చిన్నారుల నెత్తిపై భోగీ పండ్లు పోసే నానమ్మ.. భోగీ మంటలు వేసే తాతయ్య… కట్టెల పొయ్యి మీద నేతి అరిసెలు చేసే అమ్మమ్మ… ఎంత బాగుంది బతుకు చిత్రం… ఎంత అందంగా ఉంది కుటుంబ నేపథ్యం… ఇది కదా పండుగ అంటే… ఇదే కదా సంక్రాంతి పండుగ అంటే.. ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక సంబరం… వెరసి సంక్రాంతి పండుగ.. తెలుగువారికి పెద్ద పండుగ అంటే సంక్రాంతే. గ్రామీణ సంస్కృతిలో పంటలు చేతికి అందిన సంతోషంలో జరుపుకునే సంబరాలే సంక్రాంతి గా స్థిరపడ్డాయి..పి తృదేవతలను స్మరించుకోవడం, తమతో పాటు శ్రమించిన వారికీ, పశు సంపదకు కృతజ్ఞతలు చెల్లించుకునే అవకాశాన్ని అందించడం ఈ మూడు రోజుల పండుగ ప్రత్యేకత.

సౌరమానం ప్రకారం సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. దాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ధనస్సు నుంచి మకరంలోకి సూర్యుడు ప్రవేశించే రోజు మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు.. సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణాన్ని పూర్తి చేసుకుని ఉత్తర దిశగా ఈరోజు ప్రయాణం ఆరంభిస్తాడు.. అది ఉత్తరాయణ పుణ్యకాలం. చాంద్రమానం ప్రకారం సంక్రాంతి పుష్య మాసంలో వస్తుంది.. ఈ మాసంలో చంద్రుడు పుష్యమి నక్షత్రానికి దగ్గరగా సంచరిస్తాడు కాబట్టి ఆ పేరు వచ్చింది . పుష్య అంటే పోషించే శక్తి కలిగినది అని అర్థం.. పౌశ్యలక్ష్మిని స్వాగతిస్తూ ప్రజలు సంక్రాంతిని వైభవోపేతంగా జరుపుకుంటారు. రైతులు ఆరు కాలం కష్టించి పండించిన పంటలు ఈ పండుగ సమయానికి ఇళ్లకు చేరుకుంటాయి. ప్రకృతి కూడా ఆహ్లాదంగా ఉంటుంది.. రైతులకు సహాయపడిన పశువులకు ఇది విశ్రాంతి సమయం.. సంక్రాంతి సమయానికి ఎక్కడెక్కడి వారూ తమ ఊళ్ళకు చేరుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు..
వాస్తవానికి ధనుర్మాసం ప్రారంభం నుంచి సంక్రాంతి శోభ దర్శనమిస్తుంది.. దీన్ని నెల పట్టడం అంటారు.. ఇళ్ళ ముందు ఆవు పేడతో కల్లాపి చల్లి, అందంగా రంగవల్లులు తీర్చి, మధ్యలో కంటికి ఇంపుగా గొబ్బెమ్మలు పేరుస్తారు. వాటి చుట్టూ తిరుగుతూ గొబ్బి పాటలు పాడుతుంటారు. గడప గడపలకు పసుపు కుంకుమలు పూస్తారు.. గుమ్మాలకు పచ్చటి తోరణాలు కడతారు.. సంక్రాంతి రోజుల్లో హరిదాసులు, గంగిరెద్దులవారు, జంగం వారు, బుడబుక్కల వారు, పగటి వేషధారులు… ఇలా ఎందరో తమ జానపద కళా వైభవాన్ని ప్రదర్శిస్తారు. సంక్రాంతి పర్వదినాలైన మూడు రోజుల్లో మొదటి రోజైన భోగీ మంటలు వేయడంతో మొదలవుతుంది. ఇంట్లో పనికిరాని వస్తువులను మంటల్లో వేస్తారు.. దానివల్ల అరిష్టాలు తొలగిపోతాయని భావిస్తారు.. ఇంట్లో అందరూ నలుగు పెట్టుకుని, అభ్యంగన స్నానాలు చేసి, ఇష్ట దైవాలను పూజిస్తారు. ఇళ్లల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు.. పిల్లలకు భోగి పండ్లు పోయటం, పేరంటం జరపడం సాంప్రదాయం.. పిల్లలకు భోగి పండ్లు పోస్తే దృష్టి దోషం పోతుందని నమ్మకం.. ఈ రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది.. శ్రీ రంగనాథునితో గోదాదేవి ఐక్యమైన రోజు అయిన భోగినాడు… వైష్ణవాలయాలలో గోదా కళ్యాణం కనులవిందుగా జరుగుతుంది.

సంక్రాంతి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చే రోజు కాబట్టి దీన్ని పెద్దల పండుగ అని పిలుస్తుంటారు..
తర్పణాలతోపాటు దానాలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.. సూర్యోదన కూడా ఈ రోజున విశేషంగా చేస్తారు. వ్యవసాయంలో తమకు సాయపడిన వారికి ధన, ధాన్య, వస్త్ర రూపంలో కానుకలు ఇస్తారు.
మూడో రోజు కనుమ సందర్భంగా భూదేవికి, పశువులకు రైతులు కృతజ్ఞతలు తెలుపుతారు.. రైతులు పశువుల కొట్టాలను శుభ్రం చేసి, పశువులను కడిగి, వాటి కొమ్ములకు రంగులు పూసి, పూలదండలతో వాటిని అలంకరిస్తారు.. కొత్తగా పడిన వరి ధాన్యంతో పొంగలి ఉండి దేవుడికి నివేదిస్తారు.. దానిని తమ పంట పొలాల్లో చల్లుతారు.. పక్షులకు ఆహారంగా గుమ్మాలకు వరి కంకులు కడతారు..
నాలుగు రోజును ముక్కనుమ గా జరుపుకుంటారు.. ఆరోజు ఇంటిల్లిపాది విందు వినోదాల్లో మునిగి తేలుతారు. అందరూ పంచ రుణాలు తీర్చుకునే పనిలో ఉంటారు.. సూర్యుడిని ఆరాధిస్తారు.. యజ్ఞ యాగాదులు చేస్తారు. పెద్దలకు పిండ ప్రదానాలు చేస్తారు.. పశువులు పక్షులకు గ్రాసం, ధాన్యం సమర్పిస్తారు.. ఇలా నాలుగు రోజులపాటు జరిగే సంక్రాంతి పండుగ సాంస్కృతి సంప్రదాయాల సంబరంగా సాగుతుంది.