Rishabh Pant Health : న్యూఇయర్ వేడుకలకు హాజరై తన తల్లికి సప్రైజ్ ఇద్దాని ఇంటికి బయల్దేరిన వర్ధమాన క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సొంతంగా తన బీఎంబడ్లూ్య కారు నడుపుకుంటూ ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా హరిద్వార్ జిల్లాలో మంగళూరు, నర్సన్ మధ్య రిషబ్ కారుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. అతికష్టంగా రిషభ్ బయటపడ్డాడు. సాయం చేయాల్సిన స్థానికులు రక్షించకపోగా డబ్బులు ఎత్తుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన రిషభ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. స్వయంగా కారు డ్రైవ్ చేసిన పంత్.. నిద్రపోతూ కారు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడని, కారు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చాడని చెప్పారు.

-కాపాడకుండా డబ్బు ఎత్తుకెళ్లిన దుండగులు..
ఢిల్లీ–హరిద్వార్ హైవేపై ఉదయం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదం కారణంగా పెద్ద శబ్దం రావడంతో అక్కడికి చేరుకున్న సమీప గ్రామ ప్రజలు, పోలీసులు అతడిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారని ప్రచారం జరిగింది. కానీ, ప్రమాదం గురించి మరో కథనం ప్రచారంలో ఉంది. పంత్‌ను ప్రమాదం నుంచి రక్షించే బదులు కొంత మంది అతడి కార్లో నుంచి నగదు, ఒక బ్యాగ్ ఎత్తుకెళ్లారని క్రిక్‌ట్రాకర్ కథనం వెల్లడించింది.
-అంబులెన్స్‌కు ఫోన్ చేసిన రిషభ్..
పంత్ దయనీయ స్థితిలో ఉన్నప్పటికీ.. ఎవరూ పట్టించుకోలేదని.. దీంతో రిషభే అంబులెన్స్, అధికారులకు స్వయంగా ఫోన్ చేశాడని క్రిక్‌ట్రాకర్ పేర్కొంది. ‘ప్రమాదానికి గురయ్యాక.. మంటలు వ్యాపిస్తుండటంతో పంత్ కారు అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చాడు. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాటిని చూస్తే.. పంత్‌కు రక్తం కారుతుండగా.. స్థానికులు బ్లాంకెట్లను అతడికి సాయంగా ఇచ్చారు. హర్యానా ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఇతర సిబ్బంది పంత్‌ను కార్లో నుంచి బయటకు తీశారని.. కారు పూర్తిగా దగ్ధమైందని న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది. రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయిన నగదును ఏరిన స్థానికులు.. పంత్‌కు తిరిగి అప్పగించారని మరో రిపోర్ట్ పేర్కొంది.
-స్పృహలోనే పంత్..
‘‘పంత్‌ను హాస్పిటల్‌కు తీసుకొచ్చే సమయానికి అతడు పూర్తి స్పృహలో ఉన్నాడు. అతడితో నేను మాట్లాడాను. అమ్మను సర్‌ప్రైజ్ చేయడం కోసం అతడు ఇంటికి వెళ్తున్నాడు’’ అని పంత్‌కు చికిత్స అందించిన డాక్టర్ సుశీల్ నగర్ పీటీఐకి తెలిపారు. పంత్‌కు ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారని తెలుస్తోంది.
-ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ..
రిషభ్ పంత్ ప్రమాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పందించింది. ఆయన ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేసింది. రిషభ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించింది.. తల, కాలు, వీపు భాగంలో గాయలయ్యానని పేర్కొంది. అతని కాలు కూడా విరిగినట్లు తెలుస్తోంది.
-ఆస్పత్రికి చేరుకున్న తల్లి..
పంత్ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న అతని తల్లి సరోజ్‌పంత్ ఆసుపత్రికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న కుమారుడిని చూసి బోరున విలపించారు. గత 3–4 రోజులుగా ఇంటికి రావాలని పంత్‌ను కోరినట్లు ఆమె మీడియాకు తెలిపారు. పంత్ వచ్చే విషయాన్ని తమకు చెప్పలేదని ఏడుస్తూ చెప్పారు.
-కోలుకోవాలని ఆకాంక్ష..
పంత్ రోడ్డు ప్రమాదంపై అభిమానులతో పాటు దిగ్గజ ఆటగాళ్లు, స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ పంత్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఇక తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్న పంత్.. షాకిచ్చాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. డ్రైవర్‌తో రావాల్సిందని కామెంట్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ రోడ్డుప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.