Return Trip Effect: అనేక కారణాలతో రోజు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కొందరు ఉద్యోగా నిమిత్తం.. మరికొందరు వ్యాపార నిమిత్తం జర్నీ చేస్తూ ఉంటారు. అయితే ఒక్కోసారి తెలియని ప్రదేశానికి వెళుతూ ఉంటాం. శుభకార్యానికి లేదా.. దైవ క్షేత్రాలు సందర్శించడానికి కొత్త ప్రదేశాలను చూడడానికి వెళ్తూ ఉంటాం. ఇలా జర్నీ చేసే సమయంలో ఒక అనుభూతి కలుగుతుంది. అదేంటంటే.. మనం వెళ్లేటప్పుడు చాలా లేటుగా వెళుతున్నామని.. వచ్చేటప్పుడు చాలా తొందరగా వచ్చామని అనుకుంటాం. ఇలా ప్రతి ఒక్కరికి అనుభూతి కలుగుతుంది. చాలామంది ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు. కానీ కొందరు పరిశోధకులు దీనిపై పరిశోధన చేసి అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తేల్చారు. మరి ఆ వివరాల్లోకి వెళ్తే..
మనం ఏదైనా కొత్త ప్రయాణానికి వెళ్ళినప్పుడు భారంగా అనిపించి.. తిరిగి వచ్చేటప్పుడు తొందరగా వచ్చాం అని అనిపించే దానిని రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ అని అంటారు. నెదర్లాండ్ కు చెందిన శాస్త్రవేత్తలు వాన్ డి వెన్ 2011లో ఈ విషయంపై పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా బస్సు, సైకిల్, నడక దారిలో వెళ్లే వారిపై పరిశోధనలు చేశారు. వారు తిరిగి ప్రయాణం చేసినప్పుడు కలిగి అనుభూతి గురించి తెలుసుకున్నారు. వెళ్లేటప్పుడు దారిని గమనిస్తూ.. కొత్త విషయాల గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటారు. దీనినే కాగ్నిటివ్ లోడ్ అని అంటారు. అంటే మనం చేస్తున్న ప్రయాణంతో పాటు మన మెదడు అనేక ఆలోచనలతో ఉంటుంది. అలాగే ఇదే సమయంలో కొత్త పరిచయాలు.. కొత్త పరిసరాలను చూస్తూ ఉంటాం.. వీటిని గుర్తు పెట్టుకోవాలని అనుకుంటాం. ఈ సమయంలో మెదడు భారంగా ఉంటుంది. కానీ తిరిగి వచ్చేటప్పుడు మళ్లీ ఆ విషయాల గురించి ఆలోచించాం. అందుకే పెద్దగా భారం అనిపించకుండా తొందరగా ఇంటికి వచ్చామని అనుకుంటాం.
మెదడులో న్యూరో కెమికల్స్ ఎక్కువగా పని చేయడం వల్ల ఈ అనుభూతి కలుగుతుందని మరో శాస్త్రవేత్త తెలిపాడు. మనం ఒక పని కోసం వెళ్ళినప్పుడు ఆ పని పూర్తి కావాలన్న ఆందోళన ఉంటుంది. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆ పని విజయవంతం అయితే సంతోషంగా ఉండగలుగుతాం. ఈ సమయంలో డోపమైన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో మనసు ఉల్లాసంగా మారుతుంది. ఫలితంగా ప్రయాణం భారంగా అనిపించదు. అలాగే ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు స్నేహితులు లేదా బంధువులతో వెళుతూ మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి సమయంలో మన మెదడు అనేక ఆలోచనలు చేస్తుంది. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఇలాంటి వాతావరణం ఉండదు. అందువల్ల ఇప్పుడు మెదడు పెద్దగా పనితీరు చేయదు.
అయితే ప్రతిరోజు వెళ్లే వారికి కూడా ఇదే అనుభూతి కలుగుతుందా? అనే దానిపై కూడా కొందరు వైద్యులు పరిశోధనలు చేశారు. అయితే దీనిపై కూడా కొందరు వైద్యులు చెబుతున్న ప్రకారం.. ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లే వారికి తాను చేసే విధులపై ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.. కానీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు పెద్దగా ఆలోచనలు ఉండవు. అందువల్ల ప్రతిరోజు వెళ్లే వారికి కూడా రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ ఉంటుందని చెబుతున్నారు.