Qatar FIFA World Cup 2022: పిఫా ఫుట్ బాల్ కప్ యుద్ధానికి సర్వం సిద్ధమైంది. 32 జట్ల సమరానికి తెరలేచింది. ఈ పోటీకి తొలిసారి ఖతార్ అతిథ్యం ఇస్తోంది. మ్యాచ్ ల కోసం ఐదు నగరాల్లో 8 వేదికలను సిద్ధం చేసింది. సాధారణంగా ఫుట్ బాల్ అనేది వేగానికి అసలు సిసలైన కొలమానం లా ఉంటుంది. మైదానంపై పరుచుకున్న పచ్చని పచ్చిక.. దానిపై కొదమసింహాల్లా పరిగెత్తే ఆటగాళ్లు.. గోల్స్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా సాగే వారు తీరు.. మొత్తానికి కోట్లాదిమంది అభిమానులకు కన్నుల పండువ. ఆదివారం నుంచి ఈ అసలు సిసలైన ఫుట్ బాల్ ప్రపంచకప్ మొదలవుతుంది. ఈ పోటీల కోసం ఎడారి దేశం ఖతార్ 8 మైదానాలను సిద్ధం చేసింది.. అందులో ఒకదానిని పునర్ నిర్మించగా.. మిగతా ఏడు కూడా కొత్తవే.

లూ సెయిల్ ఐకానిక్ స్టేడియం
పేరులో ఐకానిక్ ఉన్నట్టే.. ఈ స్టేడియం నిర్మాణంలో ఖతార్ దేశం చాలా జాగ్రత్తలు తీసుకుంది. స్టేడియం నిర్మాణం చూస్తే ఒకవైపు ఎత్తుగా, మరో వైపు వంపుగా ఉన్నట్టు కనిపిస్తుంది. దీనిని ఇంజనీరింగ్ అద్భుతం అనొచ్చు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రేక్షకులకు ఉపశమనం కలిగించేందుకు చల్లని గాలి వచ్చే సౌకర్యం ఏర్పాటు చేశారు. ఫైనల్ మ్యాచ్ తో పాటు గరిష్టంగా 10 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్న లూ సెయిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. టోర్నీలో ఇదే అతిపెద్ద స్టేడియం అని చెబుతున్నారు.. ఉక్కు ఫ్రేమ్ ల పై అమర్చిన బంగారు రంగు ప్యానెల్స్ కారణంగా స్టేడియం మొత్తం పసిడివర్ణంలా మెరిసిపోతోంది. దీని నిర్మాణానికి 6,241 కోట్లు ఖర్చు అయింది. దీని సామర్థ్యం 80,000.
ఆల్ బేట్ స్టేడియం
ఇది చూసేందుకు ఒక పెద్ద విమానాశ్రయం మాదిరి కనిపిస్తుంది. శ్వేత వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది.. దీని ఆకృతి భారీ టెంట్ మాదిరి కనిపిస్తుంది. వర్షం వస్తే పై కప్పు ముడుచుకునే ఏర్పాటు చేశారు..ఖతార్ నిర్మించిన అత్యంత ఖరీదైన స్టేడియం ఇది. తొలి మ్యాచ్ ఇదే వేదికగా సాగుతుంది. ఇక్కడ మొత్తం తొమ్మిది మ్యాచ్ లు సాగుతాయి. దీని నిర్మాణ వ్యయం 6,892 కోట్లు. 60 వేల సామర్థ్యం.
ఖలీఫా అంతర్జాతీయ మైదానం
రొట్టె ముక్కను సగం తిన్నాక అటు ఇటు కొంచెం వంచితే ఎలా ఉంటుంది.. ఈ మైదానం కూడా అలానే ఉంటుంది. 1976 లో దీనిని నిర్మించారు. ఆసియా క్రీడలు, అరేబియన్ గల్ఫ్ కప్ తదితర పోటీలను ఇందులో నిర్వహించారు.. అయితే దీనిని ఇప్పుడు ప్రపంచ కప్ కోసం పూర్తిగా మార్చారు.. 2017లో ఇందులో పనులను ప్రారంభించారు.. అప్పుడు ఖతార్ దేశవాళీ కప్ ఫైనల్ కు వేదికగా నిలిచింది. ఈసారి ఇందులో ఎనిమిది మ్యాచ్ లు నిర్వహిస్తారు. దీని నిర్మాణానికి పెట్టిన ఖర్చు 3,042 కోట్లు. సామర్థ్యం 40 వేలు.
ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం
ఎడారి ఇసుక తిన్నెల్లో నడుచుకుంటూ వెళ్తుంటే అనుకోకుండా మన కంటికి ఒక వజ్రం కనబడితే ఎలా ఉంటుంది. ఈ స్టేడియం కూడా అలానే ఉంటుంది.. ఇది మొత్తం వజ్రం మాదిరి కనిపిస్తుంది.. సూర్య రష్మి పడగానే స్టేడియం మొత్తం ప్రకాశవంతంగా మారుతుంది. ఎడ్యుకేషన్ సిటీ లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఇందులో ఎనిమిది మ్యాచ్ లు నిర్వహిస్తారు.. దీని సామర్థ్యం 40 వేలు, నిర్మాణ ఖర్చు 5,693 కోట్లు.

అహ్మద్ బిన్ అలీ స్టేడియం
దీనికి కొనలు ఎడారి ఇసుక దిబ్బలను సూచించేలా ఉంటాయి.. 2020లో ఈ స్టేడియం ప్రారంభమైంది.. ఇందులో అమీర్ కప్ మ్యాచ్ లు నిర్వహించారు. ఇప్పుడు ప్రపంచకప్ లో ఏడు మ్యాచ్ లకు ఇది వేదిక కానుంది. ఎడారి కి దగ్గరలో ఈ స్టేడియం నిర్మించారు.. ఖతార్ సంప్రదాయ కట్టడాల నిర్మాణాలను సూచించే విధంగా దీనిని నిర్మించారు. ఇది చూసేందుకు తేనె తుట్టే మాదిరి కనిపిస్తుంది. దీని సామర్థ్యం 40 వేలు, నిర్మాణ ఖర్చు 2,927 కోట్లు.
ఆల్ జనాబ్ స్టేడియం
ఈ స్టేడియాన్ని తెరచాప ఆకారంలో నిర్మించారు.. వర్షం వస్తే పైకప్పు దానంతట అదే ముడుచుకుంటుంది. స్టేడియం పైన బంగారు పూతను అమర్చడంతో సూర్యకాంతి పడగానే అది ధగధగ మెరుస్తుంది. 2019 లో ఈ స్టేడియంలో అమీర్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.. ఈ ప్రపంచకప్ లో ఏడు మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఈ మైదానం సిద్ధమైంది. సామర్ధ్యం 40,000, నిర్మాణ ఖర్చు 4,773 కోట్లు.
ఆల్ తుమామ స్టేడియం
ఇది ముస్లింలు వాడే టోపీ మాదిరి కనిపిస్తూ ఉంటుంది.. రంగులు కూడా అలానే వాడారు. చూసే ప్రేక్షకులకు ఎండ వేడిమి తగలకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఈ మైదానంలో 8 మ్యాచ్ లు సాగుతాయి.. ఈ మైదాన సామర్థ్యం 40 వేలు.. దీనికి అయిన ఖర్చు 2,786 కోట్లు.
స్టేడియం 974
ఈ మైదానం చూసేందుకు సినిమా సెట్టింగ్ మాదిరి కనిపిస్తుంది.. దీనిని ఖతార్ అంతర్జాతీయ డయల్ కోడ్ +974 తో పాటు దీని నిర్మాణంలో ఉపయోగించిన భారీ కంటైనర్ల సంఖ్యను సూచిస్తూ దీనికి స్టేడియం 974 అనే పేరు పెట్టారు. ఈ స్టేడియాన్ని ఎక్కడికైనా తరలించవచ్చు. ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఈ కంటైనర్లను తొలగించి అవసరమైన చోటుకు తీసుకెళ్లి మళ్ళీ స్టేడియం ఆకారంలో నిర్మించవచ్చు. ఫుట్ బాల్ ప్రపంచ కప్ చరిత్రలో ఏడు మ్యాచ్లు నిర్వహిస్తున్న తాత్కాలిక మైదానం ఇదే.
ఖతార్ విఫలం
అయితే ఇన్ని మైదానాలు నిర్మించిన ఖతార్ దేశం వలస కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ స్టేడియాల నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికుల్లో సుమారు 6500 మంది కంటే ఎక్కువ వరుస కార్మికులు కన్నుమూశారు. కానీ వారికి ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. పని ప్రదేశాల్లో కనీస రక్షణ అవసరాలు కల్పించకపోవడంతో ఈ మరణాలు సంభవించాయనే అపవాదు కూడా ఉంది.