Shraddha Walker Murder Case: శ్రద్ధ వాకర్ కేసు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. ఇన్నాళ్లు సహజీవనం చేసిన వాడే తనను హతమార్చిన తీరు, చనిపోయిన తర్వాత కూడా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన తీరు.. విస్మయాన్ని కలిగిస్తున్నది. పోలీసుల విచారణలో రోజుకో దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూస్తుండటంతో సభ్య సమాజం మొత్తం హతాశమవుతున్నది. ఇంత కష్టం ఎందుకు పడ్డావు తల్లీ? ఆ రాక్షసుడిని వదిలేస్తే పోయేది కదా అనే మాట ప్రజల నుంచి వస్తున్నది.

-తప్పా? ఒప్పా?
ప్రేమ.. సహజీవనం తప్పా? ఒప్పా? … దీనిపై ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అభిప్రాయం. సహజీవనం లో నిండా మునిగాక జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవద్దు అనేది ఇక్కడ ప్రధానం. నిజమైన ప్రేమ ఎవరినైనా ఎదిరిస్తుంది.. పెళ్లితో ఒకటైనా, కాకపోయినా కలకాలం తోడు నిలుస్తుంది.. కల్మషం లేని ప్రేమలో లాభనష్టాల బేరీజు ఉండదు.. కపటమైన ప్రేమ అత్యంత అపాయకరం.. అచ్చమైన ప్రేమకు కులం, మతం దీంతో సంబంధం ఉండదు. కానీ ప్రేమ పేరుతో ముందే పథకం వేసుకొని ముగ్గులోకి దింపే ఆప్తాబ్ లాంటి రాక్షసులు కూడా వాళ్ళు కూడా ఉంటారు. శారీరక అవసరాలు తీర్చుకొని అంతం చేస్తారు.. తీయని మాటలతో వలలు వేసి ఆపై అసలు రంగు చూపిస్తారు.
-మేక వన్నె పులులు
ప్రేమ ముసుగు వేసుకున్న మేక వన్నె పులుల జాడ పసిగట్టాలి. కొన్ని సార్లు అభిప్రాయ భేదాలతోనూ ప్రమాదాలు ముంచుకు రావచ్చు. ఒకరిదే నిజమైన ప్రేమ అయినప్పుడు చిక్కులు వస్తాయి..మనసు, తనువు, మనసు అన్ని సమర్పించుకున్నాక జీవితాంతం తనతోనే కలిసి ఉండాలి అనుకుంటారు ఒకరు.. సహజంగానే ఇంకొకరికి ఇది నచ్చదు.. వెంటనే బ్రేకప్ అని సులభంగా అనేస్తారు.. కుదరకపోతే వదిలించుకోవాలని అనుకుంటారు. ఆఖరి ప్రయత్నంగా వాళ్ళని అంతమొందించాలి అనుకుంటారు. కోపంలో జరిగేవి కొన్ని అయితే.. కావాలని ఉసురు తీసే కుటిల యత్నాలు ఇంకొన్ని. శ్రద్ధ విషయంలోనూ ఇదే జరిగింది. పెళ్లి చేసుకుందాం అని చెప్పడం ఆమె పాపం అయింది. ఆఫ్తాబ్ నరరూప రాక్షసుడు ఆమెతో అవసరం తీరాక అంతమొందించాడు.
-శ్రద్ధ ఎందుకు బయట రాలేకపోయింది?
శ్రద్ధ ఇంత టార్చర్ అనుభవించినా ఎందుకు ముందే గుర్తించి బయటపడలేదన్నది చాలా మందికి ఎదురవుతున్న ప్రశ్న. ముందే బయటపడితే ఇంత ఘోరం జరిగేది కాదు కదా? అని అందరూ అంటున్నారు. కానీ ఇది మనం అనుకున్నంత సులభం కాదు.. తల్లిదండ్రులను ఎదురించి వచ్చిన శ్రద్ధకు తల్లి ఇటీవలే చనిపోయింది. తండ్రితో అంత అనుబంధం లేదు. అది కూడా ఓ కారణం. ఇక ఎదురించి వచ్చినందుకు ఎవరికీ చెప్పుకోలేని దుస్థితి. ఇలాంటి విషపూరిత బంధంలో ఆమె కూరుకున్నట్టు గుర్తించడం.. దాన్నుంచి బయటపడలేకపోవడం రెండూ కష్టమే. ఎందుకంటే అక్కడ వారి పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయి. విడిపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆఫ్తాబ్ ఆమెను బెదిరించాడు. ఎమోషనల్ గా.. మానసికంగా, శారీరకంగా టార్చర్ పెట్టాడు. అందుకే శ్రద్ధ ఆ బంధం నుంచి బయటకు రాలేకపోయింది. ఎవరికీ చెప్పుకోలేకపోయింది..

-ఇద్దరికీ ఇష్టం ఉన్నప్పుడే
అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ ఇష్టం ఉన్నప్పుడే ప్రేమ, సహజీవనం సాధ్యమవుతాయి.. ఇద్దరిలో ఒకే రకమైన అభిప్రాయం ఏర్పడితే అనుబంధంలో ఎటువంటి భేదం ఉండదు.. ఇంట్లో ఒత్తిడి, మనస్పర్ధలు మొదలైనప్పుడే తగాదాలు ప్రారంభమవుతాయి. వదిలించుకునేందుకు హత్యల దాకా వెళ్తారు. ఈ ప్రమాదం ముందే తలెత్తకముందే ప్రేమ, సహజీవనం కొత్తలో ఉన్నప్పుడే ఎంతవరకు ముందుకెళ్లాలి? అని తెలుసుకోవాలి. పాలల్లో మహా అయితే పంచదార వేయగలం.. బెల్లం వేయగలం. తేనె కల్పగలం. కానీ ఉప్పు, కారం వేస్తే ఎలా ఉంటుంది? ఇక వారి ప్రవర్తన ద్వారా ఎలాంటివారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారి వారి అలవాట్ల ఆధారంగా తేడా ఉంటే వెంటనే వదిలించుకోవడం మంచిది. సాధారణంగా యుక్త వయసుకు వచ్చిన వారికి ఎమోషనల్ సపోర్ట్ లేనప్పుడు బయట వ్యక్తుల నుంచి ఆశిస్తారు. వాళ్లకి దగ్గరవుతారు. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఘటనలు మొత్తం ఇలాంటివే. అందుకే యుక్త వయసు వచ్చిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. లేకుంటే శ్రద్ధ లాంటి దారుణాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.
————————
మన జీవితాన్ని వారి చేతుల్లో పెట్టొద్దు..
-జక్కని రాజు, సైకాలజిస్ట్
అన్ని విషయాలు కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకునే మనం ప్రేమ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇలాంటివేవి పాటించారు. ఎందుకంటే వారు తమ బంధాన్ని అంగీకరిస్తారో లేదోనన్న భయం.. చాలా మంది మహిళలు భాగస్వామి వేధింపులను మౌనంగా భరించడానికి కారణం ఇదే. భాగస్వామి మంచివారైతే ఫలితం సానుకూలంగా.. లేదంటే వేధింపులు, అభద్రతా భఆవం, దానివల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవడం.. ఇలా నష్టాలు, సమస్యలు ఒకదాని వెనుక మరొకటి క్యూ కడుతుంటాయి. ఇవి మితిమీరితే ఒక దశలో జీవితాన్ని స్వయంగా అంతం చేసుకుంటారు. శ్రద్ధ లాగా అవతలి వారి చేతుల్లో బలి అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పూర్తిగా భాగస్వామి గురించి తెలుసుకోకుండా చనువివ్వడం.. మన జీవితాన్ని ఎదుటివారి చేతుల్లో పెట్టొద్దు.. అలాగే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలిగే సత్తాను పెంచుకుంటే ప్రేమలో ఓడిపోవాల్సిన, బలవ్వాల్సిన అవసరం రాదు.
ప్రేమ పిశాచులను పసిగట్టి జాగ్రత్తపడండిలా:
– గీతా చల్లా, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
ప్రవర్తన మారుతుంది. నడవడిక చేంజ్ అవుతుంది. అతిగా కోపానికి వస్తారు. తిట్టడం.. ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ప్రవర్తిస్తారు.. విపరీతంగా ఖర్చు పెడుతారు. దురలవాట్లు ఇలాంటివి కనిపిస్తే ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. తెలిసిన వెంటనే ఆ బంధం (సహజీవనం) నుంచి బయటపడాలి. లేదంటే తమ స్నేహితులు, తల్లిదండ్రులకు వివరంగా చెప్పి వారి సాయం తీసుకోవాలి. యుక్త వయసులో అమ్మాయిలకు ఎమోషనల్ సపోర్ట్ లేనప్పుడు బయటి వ్యక్తుల నుంచి ఇలాంటివి ఆశిస్తారు. వాళ్లకు దగ్గరవుతారు. ఆపై ఇలాంటి శ్రద్ధవాకర్ లాంటి దారుణాలు జరుగతాయి. తల్లిదండ్రులు పిల్లలకు విలువలతో కూడిన పెంపకం ఇచ్చినప్పుడు ఇలాంటివి కొంతవరకూ అరికట్టవచ్చు.