Best Post Office Scheme: పోస్టాఫీస్‌లో చాలా చిన్న పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. రికరింగ్ డిపాజిట్ నుండి సుకన్య సమృద్ధి యోజన వరకు వివిధ రకాల స్కీమ్‌లు ఉన్నాయి. వాటిలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒకటి. పోస్టాఫీస్ స్కీమ్‌లలో అత్యధిక రాబడిని ఇచ్చే పథకాల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ల కోసం రూపొందించిన కొన్ని పథకాలలో ఇది ముఖ్యమైంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది నెలకు స్థిరమైన ఆదాయం అందించే ఒక ప్లాన్. ప్రస్తుతం దీనికి ప్రభుత్వం 8.25శాతం వడ్డీని అందిస్తోంది. ఐటీ సెక్షన్ 80సి కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడికి టాక్స్ డిడక్షన్ అవకాశం లభిస్తుంది.
ఈ పథకం ముఖ్యంగా రిటైర్ అయిన వారి కోసం రూపొందించబడింది. 60 సంవత్సరాలు పైబడిన వారికి ఇది వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లయితే వారికి 55 సంవత్సరాల వయస్సు నుంచే ఇది అందుబాటులో ఉంటుంది. సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వారికి కనీస వయస్సు 50 సంవత్సరాలుగా ఉంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కనీస పెట్టుబడి రూ.1,000 కాగా, గరిష్ట పెట్టుబడి రూ.30 లక్షలు. ఇది ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగినటు వంటి స్కీమ్. కాలపరిమితి ముగియకముందే పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే జరిమానా వర్తిస్తుంది.
Also Read: Multiple credit cards: ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉన్నాయా?
ఒక సంవత్సరం లోపు పథకం నుండి నిష్క్రమిస్తే ఎటువంటి వడ్డీ ఆదాయం లభించదు. ఒక సంవత్సరం తర్వాత కానీ రెండు సంవత్సరాలలోపు అకౌంట్ నిలిపివేస్తే మొత్తం వడ్డీ నుండి 1.5శాతం మొత్తాన్ని జరిమానాగా తీసుకుంటారు. రెండు సంవత్సరాల తర్వాత అకౌంట్ నిలిపివేస్తే, వడ్డీలో 1శాతం మొత్తాన్ని జరిమానాగా వసూలు చేస్తారు. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయవచ్చు. సింగిల్ అకౌంట్ అయితే రూ.30,00,000 వరకు ఒకేసారి డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంది. ఒకేసారి రూ.30 లక్షలు డిపాజిట్ చేస్తే, సంవత్సరానికి రూ.2.46 లక్షలు వడ్డీగా లభిస్తుంది. దీనిని నెలకు లెక్కిస్తే దాదాపు రూ.20,500 వడ్డీ ఆదాయం లభిస్తుంది. అయితే, మీకు నెలవారీగా డబ్బు లభించదు. బదులుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు.