Parenting Tips: చాలామంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే.. తమ స్కూల్లో జరిగిన విషయాలను చెప్పడానికి ఉత్సాహం చూపిస్తారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు వారి మాట వినడానికి ఒప్పుకోరు. అంతేకాకుండా అనవసరపు విషయాలను ఎందుకు చెబుతున్నావ్? అంటూ వారిస్తారు. కొందరైతే వారు చెప్పుకుంటూ పోతే.. అసలు మాట వినరు. ఇలా కొన్నాళ్లపాటు వారి మాట వినకపోతే.. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో తెలుసా? భవిష్యత్తులో ఇలాంటి పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసా?
నేటి కాలంలో పిల్లలను పెంచడం పై కొందరు తల్లిదండ్రులు చాలా వరకు తప్పులు చేస్తున్నారు. సంతానం లేనప్పుడు పిల్లల గురించి ఎక్కువగా అరాటపడేవారు.. వారు కలిగిన తర్వాత వారి గురించి పట్టించుకోవడం మానేస్తున్నారు. చిన్నపిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. వారికి చిన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైతే.. భవిష్యత్తులో కూడా వారి జీవితంపై అలాంటి ప్రభావమే పడుతుంది. అందువల్ల చిన్నప్పుడే వారిని సున్నితంగా పెంచే ప్రయత్నం చేయాలి. అంటే వారి మనసు నొప్పించకుండా వారి ఆలోచనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చిన్నప్పుడు వారికి పూర్తి అవకాశాలు ఇస్తే.. పెద్దయ్యాక స్వేచ్ఛగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? వారితో ఏం మాట్లాడాలి?
పిల్లలు స్కూల్ అయిపోయాక ఇంటికి ఎంతో ఉత్సాహంగా వస్తారు. ఇంటికి రావడం అంటే వారికి ఎంతో సంతోషం. అంతేకాక తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని చూడగానే వారికి ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది. ఉత్సాహాన్ని అలాగే ఉండనివ్వాలి. అయితే అలా వారు వచ్చిన వెంటనే తమ స్కూలులో జరిగిన విషయాలను టకటక చెప్పేస్తూ ఉంటారు. వారు స్నేహితులతో మాట్లాడిన తీరు.. టీచర్లతో ఎదురైన అనుభవాలను తల్లి లేదా తల్లితో పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా వారు చెప్పేది పూర్తిగా వినాలి. వారు చెప్పేది పూర్తిగా విన్న తర్వాత.. సందేహాలు ఉంటే తీర్చాలి. అంతేకాకుండా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ప్రశ్నలు కూడా వేయాలి. ఎందుకంటే కొందరు స్కూల్లో జరిగిన విషయాలను, సందేహాలను తల్లిదండ్రులకు చెప్పేందుకు ప్రయత్నిస్తారు. కానీ కొందరు తల్లిదండ్రులు వాటిని పట్టించుకోకుండా దబాయిస్తారు. అలా దబాయించడం వల్ల వారు మరోసారి ఎదుర్కొన్న సమస్యలను, సందేహాలను తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి భయపడతారు. ఫలితంగా వారు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది.
అయితే చిన్నప్పుడు వారి విషయాలను పూర్తిగా వింటే.. పెద్దయ్యాక కూడా వారు అడిగిన ప్రతి విషయానికి సమాధానం ఇస్తారు. అంతేకాకుండా చిన్నప్పుడు వారు చెప్పిన విషయాలను తల్లిదండ్రులు వింటారు కాబట్టి.. పెద్దయ్యాక తల్లిదండ్రులు చెప్పిన మాటలు పిల్లలు వింటారు. ఇలా తల్లిదండ్రులు, పిల్లల మధ్య కమ్యూనికేషన్ బలంగా ఉంటుంది. దీంతో ఎటువంటి సమస్యను అయినా పరిష్కరించుకోవచ్చు. అలాగే పిల్లలు ఇంటికి రాగానే వెంటనే వారికి హోంవర్క్ అంటూ ఒత్తిడి చేయకుండా.. కాసేపు విశ్రాంతి తీసుకొని ఇవ్వాలి. అవసరమైతే ఆటలు ఆడుకొని ఇవ్వాలి. ఆ తర్వాత మెల్లిగా వారికి హోంవర్క్ గురించి చెప్పాలి. హోంవర్క్ చేయకపోతే ఏం జరుగుతుందో వివరిస్తే తప్పకుండా వారిలో భయం ఉండి హోంవర్క్ చేస్తారు.