PAN card: ప్రస్తుత కాలంలో పాన్ (PAN – Permanent Account Number) కార్డు కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు. భారతదేశంలో ఆర్థిక లావాదేవీలకు ఇది అత్యంత కీలకమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడం నుంచి బ్యాంకు ఖాతా ప్రారంభించడం, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయడం, భారీ మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేయడం వరకు అనేక సందర్భాల్లో పాన్ కార్డు తప్పనిసరిగా అవసరం అవుతోంది. అయితే చాలా మంది ప్రతిరోజూ పాన్ కార్డును ఉపయోగిస్తున్నప్పటికీ, దానిపై ఉండే 10 అంకెల నంబర్ వెనుక ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుందని తెలియదు. దాని అర్థం ఏంటో తెలుసుకుందాం..
పాన్ నంబర్ మొత్తం 10 అక్షరాలతో ఉంటుంది. ఇందులో మొదటి ఐదు ఇంగ్లీష్ అక్షరాలు, తర్వాత నాలుగు సంఖ్యలు , చివరిగా మరో ఒక ఇంగ్లీష్ అక్షరం ఉంటుంది. ఉదాహరణకు: ABCDE1234F. ఈ 10 అక్షరాల్లోని ప్రతి భాగానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది.
మొదటి మూడు అక్షరాల అర్థం ఏమిటి?
పాన్ నంబర్‌లోని మొదటి మూడు అక్షరాలు (AAA నుంచి ZZZ వరకు) ఆదాయపు పన్ను శాఖ రూపొందించే ఆల్ఫాబెటికల్ సిరీస్‌లో భాగంగా ఉంటాయి. ఇవి వ్యక్తిగత వివరాలను సూచించవు. పాన్ నంబర్లను ప్రత్యేకంగా గుర్తించేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగిస్తారు.
నాలుగో అక్షరం..
పాన్ నంబర్‌లో అత్యంత ముఖ్యమైనది నాలుగో అక్షరం. ఇది పాన్ హోల్డర్ ఏ కేటగిరీకి చెందినవారో తెలియజేస్తుంది.
కొన్ని ముఖ్యమైన కోడ్లు ఇవి:
P – Individual (వ్యక్తిగత పాన్ కార్డు)
C – Company (కంపెనీ)
H – Hindu Undivided Family (HUF)
F – Firm (భాగస్వామ్య సంస్థ)
A – Association of Persons (AOP)
T – Trust
B – Body of Individuals (BOI)
L – Local Authority
J – Artificial Juridical Person
G – Government
సాధారణంగా వ్యక్తులకు జారీ చేసే పాన్ కార్డులో నాలుగో అక్షరం Pగా ఉంటుంది.
ఐదో అక్షరం ఎందుకు ముఖ్యమైనది?
పాన్ నంబర్‌లోని ఐదో అక్షరం వ్యక్తిగత పాన్ కార్డు విషయంలో చాలా ప్రత్యేకమైనది. ఇది పాన్ హోల్డర్ ఇంటిపేరులో మొదటి అక్షరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఒకరి ఇంటిపేరు Reddy అయితే ఐదో అక్షరం Rగా ఉంటుంది. అయితే కంపెనీలు, ట్రస్టులు లేదా ఇతర సంస్థల విషయంలో మాత్రం ఆ సంస్థ పేరులోని మొదటి అక్షరాన్ని ఈ స్థానంలో ఉపయోగిస్తారు.
మధ్యలో ఉండే నాలుగు సంఖ్యలు?
పాన్ నంబర్‌లోని 6వ నుంచి 9వ స్థానాల్లో ఉండే నాలుగు అంకెలు 0001 నుంచి 9999 వరకు ఉండే ప్రత్యేక సీరియల్ నంబర్. పాన్ కార్డు జారీ సమయంలో ప్రతి దరఖాస్తుదారునికి ప్రత్యేక గుర్తింపుగా ఈ సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్య ద్వారా ఒక పాన్ మరొకదానితో ఎప్పటికీ ఒకేలా ఉండదు.
చివరి అక్షరం ఎలా నిర్ణయిస్తారు?
పాన్ నంబర్‌లోని చివరి (10వ) అక్షరం ఒక చెక్ డిజిట్. ప్రత్యేకమైన ఆల్గోరిథమ్ ఆధారంగా దీనిని రూపొందిస్తారు. దీని ప్రధాన ఉద్దేశం పాన్ నంబర్‌లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండేలా ధృవీకరించడం. దీంతో నకిలీ లేదా తప్పుగా నమోదు చేసిన పాన్ నంబర్లను గుర్తించడం సులభమవుతుంది.
పాన్ నంబర్‌ను ఎందుకు మార్చకూడదు?
ఒకసారి పాన్ నంబర్ జారీ అయిన తర్వాత అది జీవితాంతం అదే ఉంటుంది. చిరునామా, మొబైల్ నంబర్, ఫోటో లేదా ఇతర వివరాలు మారినా పాన్ నంబర్ మాత్రం మారదు. అందుకే దీనిని శాశ్వత ఖాతా సంఖ్య అని పిలుస్తారు.
భారత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ఒక్క పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండడం చట్టవిరుద్ధం. అలాంటి సందర్భాల్లో జరిమానా విధించే అవకాశం ఉంది. అదనంగా ఉన్న పాన్ కార్డులను స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తుంది.
