No Physical Aadhaar Card Requirement: Aadhar కార్డు లేకుంటే ఏ పని ముందుకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. అయితే కొన్ని అవసరాలకు వెంటనే ఆధార్ కార్డు కావాలంటే ఫిజికల్ గా అందుబాటులో ఉండకపోవచ్చు. దీంతో గూగుల్ సంస్థ వాలెట్లో ఆధార్‌ను డిజిటల్ ఐడీ రూపంలో భద్రపర్చుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. UIDAI భాగస్వామ్యంతో వచ్చిన ఈ ఫీచర్ వల్ల ఫోన్లోనే ఆధార్‌ను సురక్షితంగా ఉంచుకుని అవసరమైనప్పుడు చూపించుకోవచ్చు.ఈ సౌకర్యాన్ని ఎలా పొందవచ్చో చూద్దాం..
ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఆధార్ తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు ఎప్పటికీ అందుబాటులో ఉండకపోవడంతో ఇప్పటి వరకు చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. దీని పరిష్కారానికి, ఐడెంటిటీ వెరిఫికేషన్ సులభం చేయడానికి గూగుల్ వాలెట్లో స్టోర్ చేసిన ఆధార్‌ను ఆన్‌లైన్‌తో పాటు కొన్ని ఆఫ్‌లైన్ వేరిఫికేషన్ అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రైవసీ పరంగా ఇది కీలకమైన మార్పు. పూర్తిస్థాయి ఆధార్ వివరాలన్నీ ఎక్కడపడితే అక్కడ పంచాల్సిన అవసరం లేకుండా, అవసరమైన సందర్భంలో మాత్రమే పరిమిత సమాచారం చూపించే వెసులుబాటు ఈ ఫీచర్లో ఉంది. అందువల్ల, వయసు లేదా గుర్తింపు నిర్ధారణ కోసం అడిగే చోట పూర్తి కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం తగ్గుతుంది.
ఆధార్‌ను గూగుల్ వాలెట్‌కు జోడించడానికి యూజర్ తన ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫై చేయాల్సి ఉంటుంది. కొన్ని నివేదికల ప్రకారం .. UIDAI యాప్‌లోని షేర్ ఐడీ ఆప్షన్ ద్వారా కూడా ఈ సేవను ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో మాత్రమే ప్రారంభించారు. వీటిలో పీవీఆర్ ఐనాక్స్, భారత్ మ్యాట్రిమోనీ వంటి చోట్ల ఆధార్ వెరిఫికేషన్‌కు ఇది ఉపయోగపడనుంది. త్వరలో మరిన్ని భాగస్వామ్య వేదికలకు విస్తరించే అవకాశం ఉంది.
భద్రత విషయానికొస్తే.. వాలెట్లో నిల్వ చేసే డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉంటుంది. అంతేకాదు స్క్రీన్ లాక్ లేదా బయోమెట్రిక్స్ వంటి డివైస్ సెక్యూరిటీ ఫీచర్లతో అది రక్షించబడుతుందని గూగుల్ తెలిపింది. అంటే ఇది సాధారణ ఫైల్లా కాకుండా, భద్రతను ప్రధానంగా ఉంచిన డిజిటల్ ఐడీ సిస్టమ్ అన్నమాట. ఆధార్ కార్డు తీసుకెళ్లే అవసరాన్ని తగ్గిస్తూ, వెరిఫికేషన్‌ను వేగంగా, సురక్షితంగా, ప్రైవసీకి అనుగుణంగా మార్చే ప్రయత్నమే ఈ కొత్త ఫీచర్ అని గూగుల్ నిపుణులు అంటున్నారు.