Corona New Sub Variant: ప్రపంచంపైకి కరోనాను వదిలి అందరినీ లాక్ డౌన్ పాలు చేసిన చైనా ఆ మహమ్మారి నుంచి ఇంకా బయటపడలేకపోతోంది. ప్రస్తుతం భారత్ సహా ప్రపంచదేశాలన్నీ కరోనాను జయించి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. కానీ చైనా మాత్రం ఇప్పటికీ ఈ మహమ్మారి ధాటికి విలవిలలాడుతోంది.

చైనాలో కరోనా రూపాంతరం చెందిన మరో కొత్త రకంగా మారి ప్రజలపైవిరుచుకుపడుతోంది. చైనాలో కొత్తగా ఒమిక్రాన్ సబ్ -వేరియంట్ లు అయిన బీఎఫ్-7 , బీఏ 5.1.7 లను గుర్తించారు.ఇవి ఎక్కువగా వ్యాపిస్తున్నాయని.. అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధిగా వైద్యులు తేల్చారు. దీంతో గత కొద్దిరోజుల నుంచి చైనాలో లాక్ డౌన్ విధించడంతోపాటు ప్రయాణాల విషయంలో కొన్ని పరిమితులు అమలు చేస్తున్నారు.
కొత్త కరోనా రకాల దెబ్బకు చైనా దేశం మరోసారి లాక్ డౌన్ విధించింది. ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్ లో ఫెన్ యాంగ్ సిటీలో ఈ లాక్ డౌన్ విధించారు. మంగోలియా దేశం కిందనున్న ప్రాంతాల్లోనూ ఈ ఆంక్షలు విధించారు.
షాంఘై నగరంలోనూ 34 కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా మంగోలియాకు వెళ్లి వస్తున్న వారి వల్లే కరోనా వ్యాపిస్తోందని తేలింది. బీజింగ్ లోకి మంగోలియాకు వెళ్లివచ్చేవారిని నిషేధించారు కూడా. మంగోలియాకు ప్రయాణాలను కొనసాగించవద్దని ప్రజలకు సూచించారు.

రెండు రోజులుగా కరోనా మళ్లీ సెగలు కక్కుతోంది. గత రెండు రోజుల క్రితం 24 గంటల్లో కొత్తగా 1878 కేసులు నమోదయ్యాయి. గత ఆగస్టు 20 తర్వాత మళ్లీ ఇంతగా కరోనా కేసులు పెరగడం ఇదే మొదటిసారి అని చైనా ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ తప్పమార్గం లేదని ప్రజలను ఆంక్షల చట్రంలో మగ్గిస్తున్నారు.