
India Vs Australia 3rd Odi: అసలు ఓడిపోయే మ్యాచ్ కాదు. తొందరగా అవుట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చేదించాల్సిన స్కోర్..మరీ అంత పెద్దది కాదు.. ఈ సానుకూలతనున్నప్పటికీ రోహిత్ సేన తడబడింది. గెలవాల్సిన చోట ఓడిపోయింది. చెన్నై చేపాక్ లో కప్ ను ఆస్ట్రేలియాకు ఇచ్చింది
270 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా నిర్దేశించిన నేపథ్యంలో.. బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ దూకుడుగా ఆడారు.. తొలి వికెట్ కు 65 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో రోహిత్ అబాట్ బౌలింగ్ లో, గిల్ జంపా బౌలింగ్ లో వెను వెంటనే ఔట్ అయ్యారు. వీరిద్దరూ ఔట్ అయ్యే సమయానికి 12.2 ఓవర్లలో 74 పరుగులు. ఈ లెక్కన చూసుకుంటే ఆసీస్ కంటే ఎక్కువే రన్ రేట్ ఉంది.
ఈ నేపథ్యంలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ, రాహుల్ సమయోచితంగా ఆడారు. మూడో వికెట్ కు 69 పరుగులు జోడించారు. 32 పరుగులు చేసిన రాహుల్ జంపా బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. రాహుల్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ బ్యాటింగ్ కు వచ్చాడు. దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు.. 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అగార్ బౌలింగ్ లో వార్నర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్థిక్ పాండ్యా కూడా జోరుగా ఆడాడు..40 పరుగులు చేసి అనవసరమైన షాట్ కు యత్నించి జంపా బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. వీరిద్దరిలో ఎవరు నిలబడినా జట్టుకు ఆ దుస్థితి దాపురించేది కాదు..
ఇక ఈ మ్యాచ్లో అత్యంత దురదృష్టం ఏంటంటే… సూర్య కుమార్ యాదవ్ గోల్డెన్ డక్ గా ఔట్ అవ్వడం.. ఎన్నో అంచనాలతో మైదానంలోకి వచ్చిన అతడు.. ఎదుర్కొన్న మొదటి బంతికే అవుట్ అవ్వడం అందర్నీ నిరాశపరచింది. ఆస్ట్రేలియా సిరీస్లో మూడు మ్యాచ్ ల్లో అతడు 0 పరుగులకే అవుట్ అవ్వడం విశేషం. సూర్య కుమార్ యాదవ్ గనుక నిలబడి ఉంటే జట్టు గెలిచేది. రవీంద్ర జడేజా కూడా 18 పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు.. ఒత్తిడిలో ఇతడు కూడా తప్పిదం చేశాడు. ఇక చివరిలో వచ్చిన షమీ బ్యాట్ ఝులిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

ఇక ఈ మ్యాచ్ లో చెప్పుకోవాల్సిందే జంపా బౌలింగ్ గురించి. గిల్, రాహుల్, పాండ్యా, కోహ్లీ… ఇలా కీలకమైన నాలుగు వికెట్లు తీసి భారత జట్టును ఓటమిపాలు చేశాడు.. అత్యంత కఠినమైన బంతులు వేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇక స్మిత్ కూడా బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించి భారత జట్టుకు చుక్కలు చూపించాడు. ఈ ఏడాది చివరిలో వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో.. ఇలా ఒత్తిడిలో చిత్తవుతున్న భారత జట్టు కప్ ఎలా సాధిస్తుందని భారత అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సొంత దేశంలో కనీసం సిరీస్ కూడా దక్కించుకోవాలని దుస్థితిలో టీం ఉండటం బాధాకరమని వ్యాఖ్యానిస్తున్నారు.