Homeపండుగ వైభవంSita Rama Kalyanam: నవమి నాడే రామయ్య కల్యాణం..ఇందులో ప్రత్యేకత ఇదీ

Sita Rama Kalyanam: నవమి నాడే రామయ్య కల్యాణం..ఇందులో ప్రత్యేకత ఇదీ

Sita Rama Kalyanam
Sita Rama Kalyanam

Sita Rama Kalyanam: ఆదర్శ దాంపత్యానికి ప్రతిరూపం సీతారాములు. . నాటికి, నేటికి వారే ఆదర్శ జంట. దీనికి కారణం వారి వైవాహిక జీవితం. ఏకపతి, ఏకపత్నీవ్రతులుగా సాగింది. ఏ దేవతామూర్తుల కల్యాణంలో అయినా చిన్న చిన్న లోపలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తాయి. అయితే జానకీరాముల కల్యాణంలో మనకు ఏ మాత్రం ఇటువంటి లోపాలు కనపడవు. సీతారాములు ఇరువురు ఒకరిని మించి ఒకరు అందంగా ఉండటం, గుణగణాల్లోను ఒకరికి ఒకరు పోటీ పడటం. ఇరువురి తల్లిదండ్రులు పరస్పరం అంగీకరించడం. అన్నింటికంటే ప్రధానంగా విశ్వామిత్రుడు, వశిష్టుడు వంటి మహర్షుల సమక్షంలో వారు ఇరువురి కల్యాణం అంగరంగ వైభవంగా జరగడం. అలా జరిగితేనే బాగుంటుందని ప్రతి ఒక్కరి మనస్సులో ఎలా కలుగుతుందో, ఆ విధంగా సీతారాముల కల్యాణం జరగడం విశేషం. హిందూ వైవాహిక జీవితాల్లో నేటికి నవదంపతులను సీతారాముల్లా కలకాలం కలిసి ఉండండి అంటూ పెద్దలు ఆశీర్వదిస్తూ ఉంటారు. దీని అర్థం కష్ట, సుఖాల్లో ఇద్దరు కలిసి మెలిసి ఉండాలన్నదే వారి అభిమతం.

నవమినాడు రామయ్య కల్యాణం భద్రాద్రిలో ఎందుకంటే

“యస్యావతార దివసే తస్య కల్యాణ మాచరేత్‌” అని పురుషోత్తమ సంహితలో పేర్కొన్న విధంగా శ్రీరామునికి జన్మదినం నాడే కల్యాణాన్ని నిర్వహిస్తారు. వాల్మీకి రామాయణంలో చెప్పినట్లు ఫాల్గుణ పూర్ణిమనాడు శ్రీరామనవమి జరిగినట్లు కనిపిస్తుంది. వసంతపక్ష తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవాహ్నిక మహోత్సవాలు నిర్వహిస్తున్న సమయంలో సీతారామచంద్రస్వామికి కల్యాణం నిర్వహిస్తారు. రాముని జన్మస్థలమైన అయోధ్యలో సైతం కేవలం రామజన్మోత్సవానికే ప్రాధాన్యం ఇస్తారు. కాగా దేశంలో ఒక్క భద్రాచలంలో మాత్రమే చైత్రశుద్దనవమి నాడు జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేక రామక్షేత్రంగా భాసిల్లుతున్న భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి విశేషమైన ప్రాచుర్యం ఉంది.

అయోధ్య లాగే..

అయోధ్య లాగే భద్రాద్రి రామయ్యకు మిక్కిలి ప్రీతి. “జనక తనయా: స్నాన పుణ్యోద కేషు” అని మహాకవి కాళిదాసు తన మేఘసందేశం కావ్యంలో పేర్కొన్నారు. అంటే సీతాదేవి జలకాలాడటంతో గోదావరి జలాలకే పుణ్యం చేకూరిందని అర్థం. అలాగే సరయు నది కంటే సీతమ్మవారు జలకాలాడిన గోదావరి నది ఎంతో పవిత్రమైందని వాల్మీకి రామాయణంలో పేర్కొన్నారు. వనవాస సమయంలో సీతారాములు ఇదే ప్రాంతంలో నడయాడారని పురాణాల్లో ఉంది. “అయోధ్య అంటే వైకుంఠం అని కూడా పేరు, అలాగే భద్రాచలాన్నే కలియుగ వైకుంఠం భద్రాచల నిలయము సేవింతుము” అనే కీర్తనలో భక్తరామదాసు వైకుంఠమే సాక్షాత్తు భద్రాద్రిగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

“శ్రీ రామ సీతగాథ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంభు గాగ విరజానది గౌతమి గాగ వికుంఠమున్నారజ భద్రశైల శిఖరాగ్రము కాగా, వసింతు చేతనోద్దారకుడైన విష్ణుడవు దాశరధీ కరుణాపయోనిధీ” అనే పద్యం ద్వారా సాక్షాత్తుగా వైకుంఠంలో ఉండేటటువంటి శ్రీ మహాలక్ష్మే ఇక్కడ సీతమ్మవారుగా ఆవిర్భవించారని భక్తరామదాసు పేర్కొన్నారు. అలాగే అక్కడ ఉండే సమస్త విష్ణు పారిషద బృందం ఇక్కడ ఉండే సమస్త అర్చకాది బృందంగానూ, వైకుంఠంలో ప్రవహించేటటువంటి విరజా నదే ఇక్కడ గోదావరి గానూ, వైకుంఠము అనేది భద్రశైల శిఖరాగ్రముగాను సాక్షాత్తు అక్కడ ఉండే విష్ణుమూర్తే ఇక్కడ రాముడిగా కొలువై ఉన్నారని రామదాసు ఈ పద్యం ద్వారా తెలిపారు. రాముడికి సైతం తాను జన్మించిన అయోధ్య లాగ వనవాస సమయంలో తాను సంచరించిన గోదావరి తీరం, పర్ణశాల అంటే అయోధ్య అంత మక్కువ అని వాల్మీకి రామాయణంలో పొందుపరిచి ఉంది.

Sita Rama Kalyanam
Sita Rama Kalyanam

సీతారాములు ఏకాంతవాసంగా ఈ ప్రాంతంలో గడపడం కూడా అనువుగా ఉండటం వల్ల రామునికి ఈ ప్రాంతమంటే ఎంతో ఇష్టమని ప్రసిద్దిగాంచింది. కాగా ముక్తి అనేది ఏడు పుణ్యక్షేత్రాల్లో వస్తుందని పేర్కొనగా, అందులో మొదటిది అయోధ్య కావడం విశేషం. మిగిలిన క్షేత్రాలైన మధుర, మాయ(హరిద్వార్‌), కాశి, కాంచీపురం, అవంతిక(ఉజ్జయిని), ద్వారక క్షేత్రాలు భక్తులకు మోక్ష ప్రదాయనిగా పిలుస్తున్నాయి.అయినప్పటికీ రామునికి అయోధ్య లాగే భద్రాచలం ప్రాంతంపైనే ఎనలేని ప్రీతి ఉందని వాల్మీకి రామాయణంలో పేర్కొన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular