NASA Artemis 1 Launch: చంద్రుడు భూమికి ఉపగ్రహం. కానీ చందమామ లోపల ఎన్నో రహస్యాలు ఉన్నాయి.. అవి మనిషి మేథకు సవాల్ విసురుతూనే ఉన్నాయి. నాసా నుంచి ఇస్రో వరకు ఎన్నో ప్రయోగాలు చేశాయి. వీటిల్లో కొన్ని విజయవంతమయ్యాయి. అయితే తాజాగా నాసా చేసిన ఓ ప్రయోగం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మూడేళ్లలోగా మానవులను చంద్రుడు పైకి పంపించే లక్ష్యంతో నాసా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆర్టేమిస్_1 ప్రయోగం విజయవంతమైంది. ఇంధన లీకేజీ, హరికేన్లు, ఇంజన్ సమస్యలతో రెండుసార్లు వాయిదా పడ్డ ఈ ప్రయోగం బుధవారం విజయవంతమైంది. ఈ ప్రయోగం లో భాగంగా మానవుడు ఇప్పటిదాకా నిర్మించిన లాంచింగ్ వెహికల్స్ లో అత్యంత శక్తివంతమైన స్పేస్ లాంచింగ్ సిస్టం.. మానవ రహిత స్పేస్ క్యాప్సూల్ ఓరియన్ ను మోసుకుంటూ భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఫ్లోరిడాలోని కెనడి స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. రోదసిలోకి దూసుకెళ్లిన రాకెట్ ఓరియన్ స్పేస్ క్యాప్సూల్ ను చంద్రుడి చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 25 రోజులపాటు సాగే ఈ మిషన్ లో ఓరియన్ స్పేస్ క్యాప్సుల్ లోని సెన్సర్లు డేటాను సేకరించి నాసాలోని మిషన్ కంట్రోల్ సెంటర్ కు పంపుతాయి.

తర్వాత తిరుగు ప్రయాణం
సెన్సర్లు డేటాను సేకరించి నాసాలోని మిషన్ కంట్రోల్ సెంటర్ కు పంపిన అనంతరం క్యాప్సూల్ భూమికి తిరుగు ప్రయాణం అవుతుంది.. గంటకు 25వేల మైళ్ళ వేగంతో భూమి వైపునకు దూసుకొస్తుంది. డిసెంబర్ 11న కాలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ సముద్రంలో లాండ్ అవుతుంది. ఇలా మొత్తం 13 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది..ఎస్ ఎల్ ఎస్ రాకెట్, ఓరియన్ క్యాప్సూల్… ఈ రెండు కూడా వ్యోమగాములను చంద్రుడి మీదకు తీసుకెళ్ళి, మళ్లీ వెనక్కి తీసుకు రాగలవా అని తెలుసుకునేందుకే ఈ ప్రయోగం చేశారు.. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే 2024లో నాసా ఆర్టే మిస్ _2 ప్రయోగాన్ని చేపడుతుంది. అందులో స్పేస్ క్యాప్సుల్ లో వ్యోమగాములు కూడా ఉంటారు. అది కూడా విజయవంతమైతే 2025లో అర్టే మిస్ _3 ద్వారా తొలి మహిళా వ్యోమగామిని చంద్రుడి మీదకి పంపిస్తారు.
1960 లో ప్రాజెక్టు అపోలో
చంద్రుని మీద నాసా ప్రయోగాలు చేయడం ఇది కొత్తేమీ కాదు. చంద్రుని మీదకి మనుషులను పంపి, తిరిగి వారిని భూమ్మీదకి క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా నాసా 1960లో ప్రాజెక్టు అపోలోను చేపట్టింది. 1969 లో చేపట్టిన అపోలో_11 ద్వారా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై నడిచిన తొలి మానవులుగా చరిత్ర సృష్టించారు.

1972 డిసెంబర్లో అపోలో 17 మిషన్ తో ఆ ప్రాజెక్టును నాసా నిలిపివేసింది. ఇక ఈ మూడు సంవత్సరాల కాలంలో 12 మంది వ్యోమగాములు చంద్రుడిపై నడిచారు. ఆ తర్వాత చంద్రుడిపై కాలమోపే ఏ ప్రయోగాన్ని కూడా నాసా నిర్వహించలేదు. ఓరియన్ క్యాప్సూల్ ను చంద్రుడి కక్ష్య లోకి నాసా రూపొందించిన ఎస్ ఎల్ ఎస్ నిర్మాణానికి 32,500 కోట్లు ఖర్చు చేసింది. స్పేస్ లాంచ్ సిస్టం నిర్మాణానికి అయిన ఖర్చును మినహాయిస్తే అర్టేమిస్1, 2, 3 మిషన్లకు 7.57 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది.