Significance of Namaskaram: భారతదేశం ఎన్నో సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయం. పురాతన కాలంలో ఏర్పాటుచేసిన ఈ సాంప్రదాయాలను ప్రస్తుతం భారతదేశంలో కొందరు పాటించడం లేదు. కానీ విదేశీయులు మాత్రం భారతీయ సంస్కృతి పై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కొన్ని దేశాల్లో మహిళలు చీరలు కట్టుకోవడం వంటివి చేయడం సోషల్ మీడియాలో చూస్తున్నా. అలాగే కొందరు ఎవరినైనా పలకరించేటప్పుడు షేక్ హ్యాండ్ కు బదులు నమస్కారం చేస్తున్నారు. నమస్కారం అనేది భారతీయ సంస్కృతిని తెలియజేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ఒక వ్యక్తి మరో వ్యక్తికి నమస్కారం చేస్తారు. ఈ నమస్కారం వల్ల ఎదుటి వ్యక్తిని గౌరవించినట్లు ఉండడమే కాకుండా ఒక వ్యక్తిలో జ్ఞాపకశక్తి, ఆరోగ్యం కూడా ఉంటుందని కొందరు ఆధ్యాత్మిక వాదులు తెలుపుతున్నారు. అసలు నమస్కారం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం..
ఎంతోకాలంగా చూడని వ్యక్తిని.. లేదా ఒకసారి చూసిన వ్యక్తి మరోసారి కలిసినప్పుడు వారికి గౌరవార్థంగా నమస్కారం చేస్తూ ఉంటారు. నమస్కారం పెట్టే పద్ధతి వేద కాలం నుంచే ప్రారంభమైంది. ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గ్రంథాల్లో నమస్కారం గురించి రచించబడింది. నమస్కారం అంటే నమః, వందనం, నమ్రతతో వంగడం అని అర్థం. రాజులు, గురువులు, దేవతల ముందు వంగి నమస్కారం చేయడం వల్ల వారిలోని అహంకారం తగ్గుతుందని అంటారు. అంతేకాకుండా నమస్కారం చేయడం వల్ల ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు. చాలా రోజుల తర్వాత కలిసిన వ్యక్తులకు నమస్కారం చేయడం వల్ల వారిద్దరి మధ్య అన్యోన్యత తొందరగా పెరుగుతుందని చెబుతుంటారు.
నమస్కారం కేవలం సాంప్రదాయం, సంస్కృతి మాత్రమే కాకుండా దీనిని పాటించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. నమస్కారం పెట్టడం వల్ల రెండు చేతుల వేళ్లలోని చివరి చివరి భాగాలను కలుపుతూ ఉంటాం. దీనివల్ల నాడీ వ్యవస్థలో కేంద్రీకరణ, మానసిక స్థిరత్వం రెండు కలిసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. అలాగే చేతి వేళ్లలోని నాడులు మెదడుతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇలా ఒకదానితో ఒకటి కలవడం వల్ల ఆక్యు ప్రెషర్ ప్రభావం ఏర్పడి మెదడులో చైతన్యం వస్తుంది. దీనివల్ల మానసికంగా ప్రశాంతత ఏర్పడి.. కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి.
ఇది మాత్రమే కాకుండా రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల హృదయానికి రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అప్పటివరకు ఉన్న ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. నమస్కారములు మంచి మనసుతో పెడుతూ ఉంటాం. దీనివల్ల సానుకూల ఆలోచనలు వచ్చి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.. అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చేతులు కలపడానికి వీలు లేని సమయంలో నమస్కారం పలకరింపు ఎంతో హాయని ఇస్తుంది. అయితే నమస్కారం అనేది భారతీయతకు చిహ్నం. మానసిక సమతుల్యతకు సాధనం. ఆధ్యాత్మిక జ్ఞానానికి ద్వారం. నమస్కారం చేయడం వల్ల ఒక వ్యక్తిలోని గౌరవం ప్రదర్శించబడుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య హృదయ స్పందన ఒకటిగా మారుతుంది. అలాగే దైవత్వం ఏర్పడి మనసు ప్రశాంతంగా మారుతుంది. అందువల్ల ఎవరైనా వ్యక్తి కలిసినప్పుడు నమస్కారం చేయడం సాంప్రదాయం.