Mega Brothers: మెగా బ్రదర్స్ ( Mega brothers )మధ్య విభేదాలు వచ్చాయా? గొడవలు జరుగుతున్నాయా? ఈ వార్తల్లో నిజం ఎంత? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మెగా బ్రదర్స్ అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ముగ్గురు మధ్య మంచి అనుబంధం ఉంటుంది. వారే కాదు మెగా కాంపౌండ్ వాల్ నుంచి వచ్చిన ప్రతి హీరో మధ్య ఒక ఎఫెక్షన్ కనిపిస్తుంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అల్లు అర్జున్ మెగా కుటుంబానికి దూరమైనట్టే. ఆ విషయం పక్కన పెడితే మెగా కుటుంబంలో ఉండే ప్రతి హీరో చాలా బాధ్యతతో, అనుబంధంతో మెలుగుతుంటారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలతో పాటు పొలిటికల్ వైపు అడుగులు వేశారు. మధ్యలో ఓసారి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి బ్యాక్ డ్రాప్ అయ్యారు. నాగబాబు మాత్రం తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా నిలుస్తూ ఎమ్మెల్సీ అయ్యారు. ఇద్దరు తమ్ముళ్లను చూసి చిరంజీవి మురిసిపోతుంటారు. ఇటువంటి తరుణంలో ముగ్గురు మధ్య విభేదాలు వచ్చాయని సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది.
ఇటీవల పరిణామాలతో..
ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మొన్న ఆ మధ్యన బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ చిరంజీవి గురించి వ్యాఖ్యానించారు. నాడు ఎవరు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి స్పందించలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో చిరంజీవి గురించి బాలకృష్ణ తప్పుగా మాట్లాడినట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఏకంగా హైదరాబాదులో మెగా అభిమానులు సమావేశం అయితే అది చిరంజీవికి తెలియదా? నాగబాబు అనుమతి లేకుండా జరిగి ఉంటుందా? పవన్ కళ్యాణ్ కు కనీసం తెలియదా? అని ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నాడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల తర్వాత.. పవన్ కళ్యాణ్ కానీ.. నాగబాబు కానీ స్పందించలేదు. అదే చిరంజీవికి ఇబ్బందికరంగా మారిందన్నది ఒక ప్రచారం. అప్పటినుంచి చిరంజీవి మైండ్ సెట్ మారింది అన్నది సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక చర్చ.
జగన్ కు మద్దతు తెలుపుతారని ప్రచారం
అయితే చిరంజీవి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) మద్దతు తెలుపుతారని.. కొందరు అత్యుత్సాహంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై సోషల్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. అప్పుడే ఇది ప్రచారం గా తేలిపోయింది. ముఖ్యంగా దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తోంది. గతంలో మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ ను వేరు చేసి చూపించారు. అల్లు అర్జున్ తమ వాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా చిరంజీవి ఉన్నారని చెప్పి.. మెగా అభిమానుల్లో ఒక చీలిక తేవాలన్నది ప్రయత్నం గా తెలుస్తోంది. అందులో భాగంగానే మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు అంటూ ప్రచారం చేస్తున్నారే తప్ప.. అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయ ప్రయోజకులుగా తమ్ముళ్లు..
మెగాస్టార్ చిరంజీవి పొందలేనిది.. దక్కించుకోలేని గౌరవం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) దక్కించుకున్నారు. దానికి చిరంజీవి కూడా ఆనంద పడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి అధినేతగా చంద్రబాబు ఉన్నారు. ఆయన తరువాత డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కు ఎనలేని ప్రాధాన్యత దక్కుతోంది. మరో బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. త్వరలో మంత్రి పదవి సైతం ఇవ్వనున్నారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి సైతం సంతృప్తిగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాడు చిరంజీవికి కూడా ఎంతో ప్రాధాన్యత దక్కింది. తన తమ్ముళ్లు ఇద్దరు రాజకీయ ప్రయోజకులు గా మారడంతో చిరంజీవి కూడా సంతృప్తిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఇబ్బందికరంగా మారింది. మెగా అభిమానుల్లో ఒక గందరగోళం సృష్టించేందుకే ఈ కొత్త ప్రయోగం చేస్తున్నారని మెగా సన్నిహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.