Mobile Addiction in Kids: ప్రస్తుత కాలంలో మొబైల్ లేకుండా ఏ పని ముందుకు సాగడం లేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఏదో రకంగా మొబైల్లో యూస్ చేస్తూనే ఉన్నారు. అయితే పెద్దవారికంటే చిన్న పిల్లలు మొబైల్ ఎక్కువగా వాడుతున్నట్లు కొన్ని సర్వేల్లో తేలింది. తల్లిదండ్రులే పిల్లలకు కొన్ని విషయాల్లో ఫోన్ ను అలవాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వారు ఫోన్ ను ఎక్కువగా చూసి లైట్ స్క్రీన్ కు అలవాటు పడిపోతున్నారు. ఈ లైట్ స్క్రీన్ ను ఎక్కువగా చూడడం వల్ల వారి ప్రవర్తనలో అనేక తేడాలు వస్తున్నాయి. స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఆరోగ్యం పై ప్రతికూల వాతావరణం ఏర్పడి మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. అసలు ఫోన్ లైట్ స్క్రీన్ కు పిల్లలు అలవాటు అయితే ఏం జరుగుతుందో తెలుసా?
పిల్లలు మాట్లాడడం నేర్చుకునే సమయంలో తల్లిదండ్రులు వారికి మొబైల్ అలవాటు చేస్తున్నారు. ఇలా అలవాటు చేయడం వల్ల వారు మాట్లాడే సామర్థ్యాన్ని తక్కువగా కలిగి ఉంటారు. మాట్లాడే సమయంలో ఇతరులతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల వారి మెదడు చురుగ్గా ఉంటుంది. కానీ ఇలాంటి సమయంలో ఫోన్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఇతర వ్యక్తులతో మాట్లాడడానికి ఆసక్తి చూపరు. కొందరికి మాటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కువగా మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల చిన్న వయసులోనే మెదడు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీంతో దృష్టిలోపంతో పాటు భావోద్వేగాల్లో చాలావరకు మార్పులు వస్తాయి. ఇది క్రమంగా వర్చువల్ ఆటిజం సమస్యలకు దారితీస్తుంది.
ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు ఏకాగ్రతను కోల్పోతున్నారు. అందుకు కారణం ఎక్కువగా మొబైల్ చూడడమే అని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. దీనినే Attention Deficit Hyperactivity Disorder (ADHD) అంటారు. ఈ సమస్య తీవ్రమైతే శారీరక ఆరోగ్యం పై దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అంటే మొబైల్ స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల కంటిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీంతో కళ్ళు పొడిబారడం, కళ్ళ నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. క్రమంగా చిన్న వయసులోనే మయోపియా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది రాత్రి సమయంలో చిన్నారులు మొబైల్ స్క్రీన్ కు అలవాటు పడుతుంటారు. ఇలా చూడడం వల్ల వారిలో నిద్రలేమి ఏర్పడుతుంది. ఆలస్యంగా నిద్ర పట్టడం.. నిద్రపోయిన సమయంలో ఎక్కువగా చికాకుతో ఉండడం వంటి సమస్యలు ఉంటాయి.
ఇక మొబైల్ కు ఎక్కువగా అలవాటు అయిన వారు ఒకే చోట ఎక్కువ సమయం కూర్చుంటారు. దీంతో వారికి ఉపకాయం వచ్చే సమస్యలు ఉన్నాయి. భవిష్యత్తులో గుండెపోటు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల మనుషులతో కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. దీంతో ఏదైనా సమస్య వస్తే ఇతరులతో చెప్పి పరిష్కరించుకోవాలనే ఆలోచన తగ్గుతుంది. అందువల్ల మొబైల్ స్క్రీన్ కు అలవాటు పడకుండా చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు వారికి ఆహారం తినిపించడానికి లేదా ఇతర పనులు చేయించడానికి మొబైల్ ఇస్తూ ఉంటారు. ఇలా వారు అలవాటు చేయడం వల్ల భవిష్యత్తులో దీనికి ఎక్కువగా అలవాటుపడే అవకాశం ఉంటుంది.