Difficulties for Ambani: ఉక్రెయిన్–రష్యా ఆయుద్ధం ఆగాలంటే.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేయలని నిన్నటి వరకు భారత్‌కు పదే పదే చెబుతు వచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే అగ్రరాజ్య అధ్యక్షుడి ఆదేశాలను భారత్ లెక్క చేయలేదు. తమ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ఇటునుంచి కుదరడం లేదని భావించిన ట్రంప్.. ఇప్పుడు అటునుంచి నరుక్కొస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు చెందిన ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించారు. ఐరోపా కూటమి కూడా ఆంక్షలు విధించింది. ఈ ప్రభావం భారత పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై పడింది. రష్యా చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్, లుకాయిల్‌పై అమలైన ఆంక్షలు కంపెనీ చమురు సరఫరా ఒప్పందాలను నేరుగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
అమెరికా నిర్ణయానికి రిలయన్స్ ఎఫెక్ట్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం రాస్‌నెఫ్ట్ నుంచి రోజుకు సగటున 5 లక్షల బ్యారెల్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా రష్యా నుంచి రోజుకి 1.7–1.8 మిలియన్ బ్యారెల్ల చమురులో దాదాపు సగం ఈ కంపెనీ వాడుతోంది. ఇప్పుడు అమెరికా, ఈయూ ఆంక్షలతో ఈ సరఫరా తగ్గే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, రిలయన్స్ తన రాస్‌నెఫ్ట్‌తో దీర్ఘకాలిక ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇది కంపెనీకి తక్షణ ప్రత్యామ్నాయ వనరుల కోసం కొత్త వ్యూహం రూపొందించాలనే అవసరాన్ని తెచ్చింది.
కొత్త వనరుల కోసం గల్ఫ్ దిశగా..
గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ప్రపంచంలోనే అతిపెద్దది, దీని ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1.4 మిలియన్ బ్యారెల్లు. రష్యా చమురు నిలిపివేతతో ఈ రిఫైనరీకి నిరంతర సరఫరా కష్టతరం అవుతోంది. ఫలితంగా రిలయన్స్ ఇప్పటికే గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు కొనుగోలు అవకాశాలను పరిశీలించడం ప్రారంభించింది. యూఎస్ ట్రెజరీ తాజా నియమాల ప్రకారం, రష్యా చమురు సంస్థలతో సంబంధం ఉన్న కంపెనీలు నవంబర్ 21 లోపు తమ లావాదేవీలు ముగించుకోవాల్సి ఉంది.
రిలయన్స్ షేర్లు పతనం..
అమెరికా ఆంక్షల వార్తలతో గురువారం స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేరు 1.15 శాతం తగ్గి రూ. 1,448.40 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ. 19.58 లక్షల కోట్లకు పడిపోయింది. ఇతర సూచీలు లాభాల్లో ఉన్నప్పటికీ రిలయన్స్ పతనం పెట్టుబడిదార్ల ఆందోళనను ప్రతిబింబించింది.
వాణిజ్య సంబంధాలకు కొత్త మార్గం..
అమెరికా ఆంక్షలు రిలయన్స్‌పై ప్రభావం చూనినా.. భారత్‌కు మేలు చేసే అవకాశం కనిపిస్తోంది. భారత ప్రభుత్వ రంగ రిఫైనరీలు కూడా రష్యా చమురు కొనుగోళ్ల తగ్గింపుపై పునరాలోచన చేస్తున్నాయి. నిపుణుల ప్రకారం, ఈ నిర్ణయం అమెరికాతో వాణిజ్య ఒప్పందాల పునరుద్ధరణకు మార్గం సుగమం చేస్తుంది. ప్రస్తుతం భారతపై ఉన్న 50 శాతం దిగుమతి సుంకాలు ఈ ఒప్పందం తరువాత 15–16 శాతం తగ్గే అవకాశం ఉంది.
గ్లోబల్ ఇంధన మార్కెట్‌లో రష్యా స్థానం బలహీనమవుతుండగా, గల్ఫ్, ఆఫ్రికన్ వనరుల వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ దృష్టిసారించింది. ప్రస్తుతం వచ్చిన ఈ ప్రభావం తాత్కాలికమేనని నిపుణులు పేర్కొంటున్నారు. గ్లోబల్ పాలిటికల్ మార్పులు భారత చమురు వ్యాపార దిశను నిర్ణయించే అవకాశం ఉంది.