Microgreens: ఆదిమానవులు ఆకలి వేసినప్పుడు వేటాడేవారు. జంతువులను వేటాడిన తర్వాత ఆ మాంసాన్ని పచ్చిగా తినేవారు.. కొంతకాలానికి కాల్చుకొని తింటే బాగుంటుందని ఆలోచన వారికి వచ్చింది. ఆ తర్వాత జంతువుల మాసాన్ని కాల్చుకొని తినేవారు. అనేక రకాలుగా పరిణామక్రమం చెందిన తర్వాత ఆదిమానవులు మనుషులుగా రూపాంతరం చెందారు.. ఆహారాన్ని వండుకోవడం మొదలుపెట్టారు. రకరకాల వంటకాలు చేసుకొని.. జిహ్వను సంతృప్తి పరచుకునేవారు.
ఇప్పుడు మనం తింటున్న పూర్తిగా రసాయనలమయం అయిపోయింది.. అధిక ఉత్పత్తి కోసం పంటలకు పురుగు మందుల వాడకం పెరిగిపోయింది. దీంతో తినే ఆహారంలో రసాయనాల అవశేషాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయి. దీంతో తినే ఆహారం విషయంలో మనుషులు మళ్లీ వెనుకటి కాలానికి వెళ్తున్నారు. కాకపోతే అందులో అత్యాధునిక పద్ధతులను పాటిస్తున్నారు. అలా తెరపైకి వచ్చిన విధానం పేరు మైక్రో గ్రీన్స్. ఈ విధానం వెస్ట్రన్ కంట్రీస్ లో ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం గ్లోబల్ విలేజ్ లాగా మారిపోయింది. దీంతో మైక్రో గ్రీన్స్ విధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉంది.
మైక్రో గ్రీన్స్ ను తెలుగులో సూక్ష్మ పచ్చదనం అనొచ్చు. పేరులోనే మైక్రో అని ఉంది కాబట్టి.. ఈ విధానానికి నగరవాసులు జై కొడుతున్నారు.. వారం నుంచి పది రోజుల వ్యవధిలో మూడు అంగుళాల వరకు పెరిగే ఆకుకూరలను, కూరగాయలను మైక్రో గ్రీన్స్ అని పిలుస్తుంటారు.. ఈ విధానంలో ఇళ్లల్లో సులభంగా కూరగాయలను పండించుకోవచ్చు. తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. ఇంటి బాల్కనీ, ఖాళీ స్థలాలు, గోడల మీద మైక్రో గ్రీన్స్ విధానంలో కూరగాయలు సాగు చేసుకోవచ్చు. మట్టి, కోకో పిట్, వర్మీ కంపోస్ట్ ను తగిన మోతాదులో వేసి విత్తనాలు నాటితే సరిపోతుంది. రోజుకు కొద్ది గంటలపాటు ఎండలో ఉంచి.. ఆ తర్వాత ఇంట్లో పెట్టుకోవాలి.. ట్రే లు, ప్లాస్టిక్ డబ్బాలు, ఖాళీ సీసాలు, కుండలలో వీటిని పెంచుకోవచ్చు. వారం నుంచి రెండు వారాల వ్యవధిలో పంట కోసుకోవచ్చు..
కొత్తిమీర, పాలకూర, తోటకూర, బచ్చలి కూర, పెసలు, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, ఉల్లి, వెల్లుల్లి, పొద్దు తిరుగుడు, క్యాబేజీ, క్యారెట్, బీట్ రూట్ వంటి పంటలు పండించుకోవచ్చు. ఇవి మొలకెత్తి మూడు అంగుళాలు పెరిగిన తర్వాత వేర్లను కత్తిరించి ఆహారంగా కూడా తీసుకోవచ్చు.
మైక్రో గ్రీన్స్ పెంపకం చాలా సులభం. ఉడికించకుండా తింటే పోషకాలు శరీరానికి నేరుగా అందుతాయి. అంతేకాదు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయి. విటమిన్ సి, ఈ, కే, బీ3, బీ6, బీ12, ఫైబర్, క్లోరోఫిల్ ఉంటుంది. ఇటీవల విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రయోగాత్మకంగా మైక్రో గ్రీన్స్ ను పండించారు. అందులో 60ఎంజి పోషకాలు ఉన్నాయి. అయితే సాధారణ పంటలలో సగానికంటే తక్కువ పోషకాలు ఉన్నాయి. మైక్రో గ్రీన్స్ పెంపకంలో ట్రే ల పరిమాణం ఆధారంగా విత్తనాలు చల్లుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.