Lionel Messi: సచిన్ క్రికెట్ వన్డే ప్రపంచ కప్ గెలవకుండా కెరియర్ కు గుడ్ బై చెప్తే ఎలా ఉంటుంది? రోజర్ ఫెదరర్ ఏదో ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకోకుండా టెన్నిస్ కు వీడ్కోలు చెప్తే ఎంత బాధగా ఉంటుంది? సగటు అభిమాని గుండె ఎంత భారంగా ఉండేది? వాళ్ల కెరియర్ పరిపూర్ణమయ్యేదా? అలాగే లియోనల్ మెస్సీ కూడా ఫుట్ బాల్ కప్ అందుకోకున్నా అలాగే ఉండేదేమో? కానీ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఈ సాకర్ మాంత్రికుడి కెరియర్ కు అద్భుతమైన ముగింపునిస్తూ ప్రపంచ కప్ అతడి ఒళ్ళో వాలింది. ఈ టోర్నీలో అతడు కేవలం ఆట మాత్రమే ఆడలేదు. 37 ఏళ్ల వయసులో చిరుత లాగా పరిగెత్తాడు. లార్జర్ దెన్ లైఫ్ అన్నట్టుగా చెమటోడ్చాడు. బంతితో మాయ చేసాడు.. ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. డిఫెన్స్ గోడలను అతడు బద్దలు కొట్టిన తీరు చూస్తే.. ఇతగాడు ఇలా కూడా ఆడతాడా అనేలా అనిపించాడు. తనలో ఉన్న అస్త్ర శస్త్రాలను బయటకు తీస్తుంటే ఈ నాళ్ళు ఇవన్నీ ఎక్కడ దాచాడు అనుకునేలా చేశాడు. ప్రేక్షకులే కాదు అతని ఆట తీరు చూసి ఫిఫా నే ఫిదా అయింది. ఏకంగా సాకర్ ప్రపంచకప్ తన ఒళ్ళో వచ్చి వాలింది.

అందరూ కోరుకున్నారు
2011లో ఇండియాలో ప్రపంచకప్ జరుగుతున్నప్పుడు… ఒక్క శ్రీలంక తప్ప మిగతా దేశాలు మొత్తం ప్రపంచ కప్ ఇండియా గెలవాలని కోరుకున్నాయి. ఎందుకంటే ఆ మ్యాచ్ తో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తన కెరీర్ కు ముగింపు పలకబోతున్నాడు కాబట్టి. దాన్ని కచ్చితంగా అతడు అందుకొని నిష్క్రమించాలని మెజారిటీ క్రికెట్ ప్రపంచం కోరుకున్నది. ఫిఫా కప్ ఫైనల్ లోనూ అర్జెంటీనా, ఫ్రాన్స్ తల పడినప్పుడు అర్జెంటీనా గెలవాలని ఫ్రాన్స్ తప్ప మిగతా దేశాలన్నీ కోరుకున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ తో మెస్సి తన కెరీర్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు కాబట్టి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మెస్సీకి ఉన్న అభిమానం అటువంటిది. ఈ టోర్నీ లో మెస్సీ ఆటతీరు మామూలుగా లేదు. అతడి పాద కదలికలు, డ్రిబ్లింగ్ నైపుణ్యం, గోల్స్ కొట్టడంలో నేర్పరితనం చూసి ముందు తరాల దిగ్గజాలు సైతం అబ్బురపడ్డారు. ఫుట్ బాల్ తో పెద్దగా పరిచయం లేని వాళ్లు కూడా కాసేపు తన ఆట చేస్తే ఈ ఆటలో మజా ఏంటో అర్థమయి ఆస్వాదించేలా చేయగల ఆకర్షణ మెస్సి సొంతం. ఇక 2014లో ఆ కలకు అత్యంత చేరువగా వచ్చి త్రుటిలో కోల్పోయాడు. కానీ 2022 నాటికి వయస్సు పెరిగినా ఉత్సాహం చురుకుదనం తగ్గని మెస్సి.. తన పతాక స్థాయి ఆటతో జట్టును గెలిపించాడు.

ఎన్నో రికార్డులు సృష్టించాడు
ఈ ఒక్క విజయంతో పీలే, మారడోనా ఫుట్ బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళుగా పేరొందిన దిగ్గజాలు, నైపుణ్యాల్లో, ఘనతల్లో ఒకరికి ఒకరు దీటుగా నిలుస్తారు. వీరి తర్వాత ఆ స్థాయి ఆటగాళ్లు ఎవరంటే గుర్తుకొచ్చే పేర్లు మెస్సీ, రొనాల్డోలవే. క్లబ్ ఫుట్ బాల్ లో వీరు సాధించిన ఘనతలు అసాధారణం.. ఇక నైపుణ్యం విషయంలో ఎవరికి వారే సాటి. వీరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం కష్టమే.. కానీ ఇప్పుడు ప్రపంచకప్ విజయంతో మెస్సి, రొనాల్డో తో పోలిస్తే కొన్ని మెట్లు పైకి ఎక్కేసాడు. క్లబ్ ఫుట్ బాల్ లో ఎన్ని ఘనత లు సాధించినా.. ఫుట్ బాల్ లో అత్యున్నతం అనే ప్రపంచ కప్ సాధించడమే ఒక ఆటగాడి అంతిమ లక్ష్యం కాబట్టి ఈ విజయంతో మెస్సీ కెరీర్ పరిపూర్ణమైంది.. అంతే కాదు ఫ్రాన్స్ తో జరిగిన ఫిఫా ఫుట్బాల్ కప్ ఫైనల్ మ్యాచ్లో అత్యధిక మెన్స్ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు మెస్సీ. ప్రస్తుతం ఆడుతున్న మ్యాచ్ అతనికి 26వ వరల్డ్ కప్ మ్యాచ్.కాగా 25 వరల్డ్ కప్ మ్యాచ్ లతో జర్మనీ ప్లేయర్ లోథర్ మ్యాథ్యూస్ పేరిట ఉన్న రికార్డును మెస్సీ బ్రేక్ చేశాడు.