Homeలైఫ్ స్టైల్Marriage: డబ్బున్నా.. పెళ్లి కష్టమవుతోంది.. ఎందుకు?

Marriage: డబ్బున్నా.. పెళ్లి కష్టమవుతోంది.. ఎందుకు?

Marriage: ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అబ్బాయి, అమ్మాయి తరఫున అటేడు తరాలు, ఇటేడు తరాలు చేసేవారు. ఇక్కడ అమ్మాయి, అబ్బాయి చూసుకునేవారు కాదు. క్రమంగా ట్రెండ్‌ మారింది. పెళ్లి చూపులు వచ్చాయి. 2020 దాటాకా పెళ్లి విషయంలో సామాజిక పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇవి రాత్రికి రాత్రి మారిపోయినవి ఏమీ కావు. క్రమక్రమంగా మారుతూ వస్తున్నవే. 21వ శతాబ్దం తొలి క్వార్టర్‌ నాటికి.. సగటు భారతీయ సమాజంలో, అందునా తెలుగు సమాజంలో.. పెళ్లి పెద్ద కష్టంగా మారింది. ప్రత్యేకించి ఆర్థిక విషయాలతో ముడిపడిన పెళ్లి అంశంలో రివర్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది.

ఆస్తి అర్హత కాకుండా పోతోంది..
చేతిలో డబ్బు ఉంటే ఎంచక్కా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవచ్చు, చేయొచ్చు. ఆస్తులు ఉన్నాయంటే.. అది మంచి సంబంధం కిందే లెక్క. కుటుంబానికి ఆస్తిపాస్తులున్నాయంటే.. పుష్కర కాలం కిందటి వరకూ అంతకు మించిన వరుడు లేడు. అయితే కుటుంబాలకు తరగని ఆస్తులున్నా.. నేడు అబ్బాయికి అది అర్హత కాకుండాపోతోంది. నిజంగానే అమ్మాయిని ఆకట్టుకునే టాలెంట్‌ ఉండి, ఏ లవ్వో చేసినా.. అబ్బాయి గుణగణాలు అమ్మాయి కుటుంబ పరిగణనలోకి వెళ్లాక కూడా.. వారి లెక్కపక్కలన్నీ ఆ పెళ్లికి అడ్డంకులే అవుతూ ఉన్నాయి.

అమ్మాయిలకూ సమస్యే..
ఈ ధోరణి కేవలం అబ్బాయిల సమస్యే కాదు, అమ్మాయిల ఆలోచనాధోరణి వల్ల వారికీ సమస్యే అవుతోంది. ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిల ఆలోచన ధోరణి మరీ అతిగా ఉంటోంది. పెళ్లి ప్రపోజల్‌ రాగానే.. నూరేళ్ల జీవితం గురించి ఆలోచించేస్తూ ఉన్నారు అమ్మాయిలు. అబ్బాయి ఏం చదువుకున్నాడు.. ఏం జాబ్‌ చేస్తున్నాడు, ఎక్కడ జాబ్‌ చేస్తున్నాడు.. ఫారెన్‌ వెళ్లే ఛాన్సులు ఎంత వరకూ ఉన్నాయి, అతడికి అక్కచెల్లెళ్లున్నారా.. అన్నదమ్ములు ఉన్నారా.. వాళ్లు జాబ్‌ చేస్తున్నారా.. వాళ్లు జాబ్‌ చేస్తుంటే.. అది వరుడి చేస్తున్న జాబ్‌ కన్నా చిన్నదా, పెద్దదా.. కుటుంబంలో ఎవరైనా ఆ వరుడి మీద ఆధారపడే అవకాశాలు భవిష్యత్తులో ఉంటాయా.. వాటాలు పెట్టుకుంటే ఒక్కోరికి ఎంత ఆస్తిపాస్తులు దక్కుతాయి, అతడి పేరెంట్స్‌ కానీ ఆడపడుచులు కానీ రేపు తమ మీద ఏమైనా ఆధారపడే పరిస్థితి ఉంటుందా.. అతడి తల్లిదండ్రులకు కాలూచేయి ఆడని పరిస్థితుల్లో తమ అమ్మాయి వారికి సేవలు చేయాల్సి వస్తుందా.. ఇలాంటి ఆరాలన్నీ సహజం అయిపోయాయి.

అత్తింటివారి ఆలోచన కూడా..
తమ ఇంటికి వచ్చే కోడలి గురించి కూడా అబ్బాయి తరఫున తల్లిదండ్రులు, బంధువులు కూడా విపరీత ఆలోచనే చేస్తున్నారు. అయితే ఈ నిజాన్ని అమ్మాయిల తల్లిదండ్రులు ఒప్పుకోలేరు. తమ కూతురును ఇస్తున్నామంటే మాత్రం.. ఇలాంటి లెక్కలన్నీ వేస్తున్నారు. అబ్బాయి తమ్ముడికో అన్నకో జాబ్‌ లేదనే విషయం తెలిసినా.. వీళ్లు ఆలోచనలో పడిపోతున్నారు. ఇలాంటి తటపటాయింపులకు హద్దు లేకుండాపోతోంది. దీంతో చాలా మంది అమ్మాయిలకు సంవత్సరాలకు సంవత్సరాలు పెళ్లి సంబంధాలను చూడటంలోనే గడిచిపోతూ ఉన్నాయి. అతిగా ఆలోచించడం వల్ల అమ్మాయిలే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

90వ దశకంలో పుట్టిన వారిలో ఈ ధోరణి ఎక్కువ..
ప్రత్యేకించి 1990 నుంచి 1995ల మధ్య పుట్టిన అమ్మాయిల్లో అతిగా ఆలోచించడం, తమ గురించి ఎక్కువ అంచనాలు వేసుకోవడం, కలల్లో మునిగి తేలడమో ఏమో కానీ.. ఈ వయసుల అమ్మాయిల్లో పెళ్లి అనగానే సినిమాల్లో సాంగ్‌ వేసుకున్న తరహా అనే ధోరణి కనిపిస్తూ ఉంది. అబ్బాయికి మంచి ఉద్యోగం ఉండాలి, అందగాడూ అయ్యుండాలి, ఆస్తిపాస్తులు పెద్దలు వెనకేసినివి ఉండాలి, ఆ పై ఇంట్లో వాళ్లెవ్వరూ ఆ అబ్బాయి మీద ఆధారపడరాదు. తమను అలవోకగా విదేశానికి తిప్పగలగాలి. అన్నింటికీ మించి తాము ఏం చేసినా అబ్బాయి దానికి తందానా అనేలా ఉండాలి తప్ప, ఎందుకు? ఏమిటీ అనే ప్రశ్నాలు వేసేవాడైతే వద్దేవద్దు అని ఆలోచిస్తున్నారు.

పెళ్లి చూపుల తర్వాత ఇంటర్వ్యూ..
పెళ్లి చూపుల ప్రక్రియలో… జాబ్, ఆస్తుల అర్హతలు తేలిన తర్వాత.. అమ్మాయి ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేయడం మొదలుపెడుతుంది. ఫోన్లో వీళ్ల మాటలు మొదలైన తర్వాత.. అతడికి అన్ని రకాల లిట్మస్‌ టెస్టులు పెడుతుంది అమ్మాయి. ఇందులో ఆమె అనుకున్నట్టుగా.. ఆమె నచ్చినట్టుగా వాడు ఉంటే సరేసరి. లేకపోతే పేరెంట్స్‌కు నచ్చినా ఆ ప్రపోజల్‌ వెనక్కువెళ్లిపోవాల్సిందే. అబ్బాయి ఆటిట్యూడ్‌ బాగోలేదని, గట్టిగా మాట్లాడతాడనో, ఖరాఖండిగా చెబుతాడనో, తనను బుజ్జగించి, బతిమాలి, అంతిమంగా తను చెప్పింది చెప్పినట్టుగా ఒప్పుకునేలా లేడనే కారణాలతో .. అబ్బాయిని తిరస్కరించేయడం, అది కూడా పదుల కొద్దీ సంబంధాలను తిరస్కరించేయడం కూడా తమ స్వభావంలో తప్పులేనిదనే అమ్మాయిలు భావిస్తున్నారు. అందులో తప్పేం లేదని, రేపు అతడితో కాపురం చేయాల్సింది తామే కాబట్టి .. అందుకు అన్ని రకాలా సెట్‌ అయ్యే వాడిని తేల్చడానికి వెనుకాడేది లేదంటున్నారు.

నచ్చిన సబంధం కోసం ఏళ్లు వేచి చూడడానికి సిద్ధంగా ఉంటున్నారు అమ్మాయిలు. సంవత్సరాలకు సంవత్సరాలు సమయం పట్టినా, పదుల కొద్దీ సంబంధాలు చూస్తూనే ఉన్నా… పోయేదేం లేదన్నట్టుగా అమ్మాయిల ధోరణి ఉంది. దీని వల్ల తామేం మిస్‌ అవుతున్నామో అర్థం చేసుకోలేకపోతున్నారు.

ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగితేనే దానికొక అందం. సినిమాలోనో, సినిమా సెలబ్రిటీలనో చూసి.. తమ ధోరణిని అమ్మాయిలు సమర్థించుకుంటే అందం.. సమయం ఆవిరవుతూ ఉంటుందంతే!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular