No peace of mind at home: ఇల్లు కట్టుకోవడం అనేది చాలామంది కల. కానీ కొంతమంది నేటి కాలంలో ఇల్లు నిర్మించడం కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఇల్లు కట్టుకోవడానికి సరైన స్థలం దొరకకపోవడం.. పెరిగిన నిర్మాణ ఖర్చుల ధరలు ఉండడంతో చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదు. మరి కొంతమంది అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఎలా గైనా సొంత ఇంటిని కలిగి ఉండాలని చాలామంది కోరుకుంటారు.. సొంత ఇంటిలో ఉన్న అనుభూతి వేరని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఎంతో కష్టపడి సొంత ఇల్లు కట్టుకోవడం లేదా ఇల్లు కొనుక్కోవడం వంటివి చేసిన తర్వాత కొందరు అనేక పొరపాట్లు చేస్తున్నారు. ఈ పొరపాట్ల వల్ల జీవితం మనశ్శాంతి లేకుండా పోతుందని కొందరు ఆవేదన చెందుతున్నారు. సొంత ఇంట్లోనూ సంతోషం లేకపోవడానికి ఈ కారణాలు అని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
సొంత ఇల్లు అనేది ఒక రీఛార్జి లాగా భావించాలని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం లేదా వ్యాపార సంస్థల్లో అనేక పనులతో బిజీగా ఉంటారు. ఈ క్రమంలో మానసికంగా, శారీరకంగా తీవ్రంగా కష్టపడతారు. ఇలా కష్టపడిన తర్వాత మనశ్శాంతి కోసం ఇంటికి వస్తారు. అయితే ఇంట్లో మనకు నచ్చిన వ్యక్తులు.. నచ్చిన ఆహారం.. సరైన వాతావరణం ఉండడంవల్ల ఆ వ్యక్తికి రీఛార్జ్ అయినట్లే మళ్ళీ సక్రమంగా పనిచేయడానికి ఉత్సాహంగా ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి పరిస్థితులు లేవు.
కొంతమంది ఇంట్లో వండిన ఆహారం కాకుండా బయట దొరికే ఆహారం కోసం ఆరాటపడుతున్నారు. బయట దొరికే ఆహారంలో టేస్టీ ఉందంటూ ఎక్కువగా వాటిని తింటూ అనారోగ్య పాలవుతున్నారు. అయితే ఇందులో ఇంట్లో ఉండే వారు సైతం వంటపై ప్రత్యేక దృష్టి పెట్టకుండా ఉండడంతో కొంతమంది బయటి ఆహారంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. అందువల్ల ఇంట్లో సరైన ఆహారం ఉంచే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే కొంతమంది తమ కార్యకలాపాలు ముగించుకొని ఇంటికి రావడంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో ఉండకుండా మద్యం సేవించడం, స్నేహితులతో ఉండటం వల్ల కుటుంబ సభ్యులను దూరం ఉంచినట్లు అవుతుంది. దీంతో వ్యక్తులకు కుటుంబ సభ్యులకు మధ్య గ్యాప్ ఏర్పడి మనశ్శాంతి కోల్పోతున్నారు. ఫలితంగా గొడవలు, ఘర్షణ వాతావరణం ఏర్పడి ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. అలా కాకుండా కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. ప్రతిరోజు వారితో సరదాగా మాట్లాడడం లేదా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా పిల్లలతో ఎక్కువగా కాలక్షేపం చేయడం వల్ల వారి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
ఇక చాలామంది రాత్రి సమయంలో నిద్రపోవడం లేదు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మానసిక సమస్యలు వచ్చి మనశ్శాంతి లేకుండా పోతుంది. అందువల్ల త్వరగా నిద్రపోయి ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. సొంత ఇంట్లో ఇలాంటి పనులు చేయడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుందని చెబుతున్నారు.