India vs England Semi Final 2022: టి20 అంటేనే దూకుడుగా ఆడాలి. క్రీజు లోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఎదురుదాడి ప్రారంభించాలి.. అలా అయితేనే జట్టు భారీ స్కోరు సాధిస్తుంది. లేకుంటే అంతే సంగతులు.. అయితే టి20 మెన్స్ వరల్డ్ కప్ ప్రారంభం అయిన నాటి నుంచి కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ తప్ప మిగతా బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. కేఎల్ రాహుల్ చివరి రెండు మ్యాచ్ల్లో మాత్రమే హాఫ్ సెంచరీలు సాధించాడు. కానీ ఇదే సమయంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో మిగతా బ్యాట్స్మెన్ విఫలమవుతున్నారు. ముందు వరుసలో ఉండేది దినేష్ కార్తీక్. 36 ఏళ్ల దినేష్ కార్తీక్ మొన్నటిదాకా జట్టుకు ఎంపిక కాలేదు. ఆసియా కప్ టోర్నీలో రోహిత్ శర్మ సిఫారసు మేరకు అతడిని జట్టులోకి తీసుకున్నారు. కానీ పెద్దగా చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. పైగా ఆడాల్సిన మ్యాచుల్లో విఫలమయ్యాడు. ఏ సమయంలో అతడు గతంలో బంగ్లాదేశ్ పై ఆడిన మ్యాచ్ పరిగణలోకి తీసుకొని టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ కి ఎంపిక చేశారు. అయితే భారత్ ఇప్పటిదాకా ఆడిన అన్ని మ్యాచ్ల్లో అతడు పెద్దగా గొప్ప ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. పైగా వికెట్ కీపింగ్ కూడా బాగా చేసింది లేదు.

రిషబ్ పంత్ కూడా..
వర్ధమాన ఆటగాడు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ప్రతిభావంతుడే. ఆస్ట్రేలియాపై అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది.. కానీ అతడు రిజర్వ్ బెంచికే పరిమితమయ్యాడు.ఈ క్రమంలో దినేష్ కార్తీక్ తరుచూ విఫలమవుతున్న నేపథ్యంలో అతనికి విశ్రాంతి ఇచ్చి జింబాబ్వే తో జరిగిన మ్యాచ్లో పంత్ ను తీసుకున్నారు. కానీ అతడు కూడా తేలిపోయాడు. భారీ స్కోర్ సాధించేందుకు అవకాశం ఉన్న మ్యాచ్లో వెంటనే క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లీష్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే ఇంగ్లీష్ జట్టుపై కూడా రిషబ్ పంత్ కు మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. గతంలో అతడి వీరోచిత బ్యాటింగ్ వల్ల ఇంగ్లీష్ జట్టుపై భారత జట్టు టెస్ట్ సిరీస్ నెగ్గింది. అయితే జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో రిషబ్ మెరుగైన పరుగులు చేసి ఉంటే ఈరోజు ఈ సందిగ్ధమైన పరిస్థితి ఉండేది కాదు. అతడు అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడంతో దినేష్ కార్తీక్ ని తీసుకోవాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది.

కప్ ఒడిసిపట్టాలని
అయితే 2007 తర్వాత ఇంతవరకు భారత జట్టు టి20 వరల్డ్ కప్ నెగ్గిన దాఖలాలు లేవు. పైగా ఈసారి లీగ్ మ్యాచ్లో ఒక్క దక్షిణాఫ్రికా మినహా అన్ని జట్ల పై భారత్ గెలిచింది.. గ్రూప్ లో టాపర్ గా నిలిచింది.. ఇదే ఊపులో సెమిస్ వెళ్ళింది.. మరోవైపు న్యూజిలాండ్ పై పాకిస్తాన్ గెలిచిన నేపథ్యంలో.. ఇంగ్లీష్ జట్టును జయించి ఫైనల్ వెళ్లాలని రోహిత్ సేన భావిస్తోంది. కీలకమైన మ్యాచ్ కావడంతో దినేష్ కార్తీక్ కంటే పంత్ వైపే జట్టు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ధారాళంగా పరుగులు సమర్పిస్తున్న అక్షర్ పటేల్ పై రోహిత్ ప్రదర్శిస్తున్న ప్రేమ జట్టుకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నది. రోహిత్ ఫామ్ లేమి కూడా జట్టును కలవర పడుతున్నది. తన పూర్వ లయను అందిపుచ్చుకుంటే విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ పై భారం తగ్గుతుంది.