దేశంలోని వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే గుడ్డు తినాలని సూచనలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు మార్కెట్ లో ఒక గుడ్డు ఆరు రూపాయల వరకు పలికింది. అయితే గత రెండు రోజుల్లో గుడ్డు ధర అమాంతం పెరిగినట్టు తెలుస్తోంది. జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ గుడ్డు రేటును 3.95 రూపాయలుగా నిర్ణయించగా కరోనా మహమ్మారి వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో ఒక గుడ్డు ధర 8 రూపాయలుగా ఉంది.
ఈ స్థాయిలో గుడ్డు ధర పెరగడం ఇదే తొలిసారి. కరోనా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న గుడ్డుపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. గుడ్డు ధర భారీగా పెరగడంతో గుడ్డును కొనుగోలు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్ డౌన్ నిబంధనలు అమలవుతూ ఉండటంతో గుడ్ల సరఫరా గతంతో పోలిస్తే తగ్గడం కూడా గుడ్ల ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 100 గుడ్ల ధర 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పలుకుతుండటం గమనార్హం. గువహతి లో నైట్ కర్ఫ్యూ అమలవుతుండగా రెండు గుడ్ల ధర ఏకంగా 16 రూపాయలకు చేరడంతో గుడ్లు కొనుగోలు చేయాలంటే ప్రజలు జంకుతున్నారు. డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం పెరగడం వల్ల కూడా గుడ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు గుడ్ల ధరపై ప్రభావం చూపుతున్నాయి.
సాధారణంగా ఇతర కాలాలతో పోలిస్తే వేసవి కాలంలో గుడ్డు వినియోగం తక్కువనే సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా గుడ్లకు ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. చికెన్ ఫీడ్ ద్రవ్యోల్బణం కూడా గతంతో పోలిస్తే పెరగడంతో గుడ్ల ధరపై ఆ ప్రభావం పడుతుండటం గమనార్హం.