Peace of Mind: ప్రతి వ్యక్తి ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనులతో బిజీగా ఉండే రోజులు ఇవి. దీంతో చాలామంది సమస్యలతో బాధపడుతూ మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఇది కంటిన్యూగా ఉండడంతో ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుంది. అయితే మానసికంగా ఇబ్బందులకు గురైనప్పుడు కొన్ని రకాల పనులు చేయడం వల్ల మనిషి ప్రశాంతంగా అవుతుంది. కానీ కొందరు తమ మానసిక సమస్యలను తమకు తామే సృష్టించుకుంటారు. ముఖ్యంగా మనశ్శాంతి కోల్పోయిన వారు కొన్ని విషయాలకు దూరంగా ఉండటం వల్ల సమస్య నుంచి బయటపడతారు. వాటిలో ఈ మూడు ప్రధానమైనవి. ఈ మూడింటిని దూరంగా ఉంచి ప్రయత్నించండి..
ఇతరులపై విమర్శలు చేయడం:
కొందరు తమ జీవితం గురించి ఆలోచించడం కంటే ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇతరుల బాగోగులను చూస్తే తట్టుకోలేరు. అలాగే ఇతరులకు డబ్బు ఎక్కువగా ఉంటే ఒప్పుకోలేరు. అయితే ఇలా నచ్చని వారిపై ఏదో ఒక కారణంతో ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇలా వారిపై విమర్శలు చేయడానికి ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. అలా ఆలోచిస్తూ తమ సొంత పనులను దూరంగా ఉంచుతారు. ఫలితంగా సక్రమంగా అయ్యే పనులు ఆగిపోతాయి. దీంతో మరింత మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఇతరులపై విమర్శలు చేయడం మానుకుంటే కచ్చితంగా మనశ్శాంతి ఉండే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు తెలుపుతున్నారు.
సమస్యలను వెతకడం:
ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమస్య తప్పనిసరిగా ఉంటుంది. అయితే దాని నుంచి బయటపడే మార్గం వెతుక్కోవాలి. ఒక సమస్య వచ్చినప్పుడు చాలా మంది మరో సమస్యలతో ముడి పెడుతూ కొత్త సమస్యలను తెచ్చుకుంటారు. గతంలో ఉన్న సమస్యలను.. భవిష్యత్తులో ఉన్న సమస్యలతో పోలిస్తూ ఉన్న సమస్యల పరిష్కారాన్ని గురించి మర్చిపోతుంటారు. అందువల్ల ఒక సమస్య ఏర్పడితే దాని నుంచి బయటపడేందుకు మార్గం మాత్రమే ఆలోచించాలి. ఇతరుల విషయాలు పట్టించుకోకుండా ఉండడమే మంచిది.
ఇతరులతో పోల్చుకోవడం:
కొంతమంది అనుకున్న దానికంటే తొందరగానే డబ్బు సంపాదిస్తారు. వారి తోటి వారు మాత్రం వెనుకబడిపోతూ ఉంటారు. దీంతో డబ్బు ఎక్కువగా ఉన్న వారితో పోల్చుకుంటూ తమకు తామే నిందించుకుంటూ ఉంటారు. తమ జీవితం ఇక వ్యర్థం అని.. తాము ఏం చేయలేకపోతున్నామని కుంగిపోతూ ఉంటారు. ఇలా నిత్యం బాధపడుతూ అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటారు. ఇలా కాకుండా తమ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు.. తమకు ఉన్న పరిధిని బట్టి తమ జీవితం ఏంటో నిర్ణయించుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఒక్కోసారి ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది.
ఇవే కాకుండా ప్రతిరోజు ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టె ఆలోచన చేయాలి. ఎందుకంటే నేటి కాలంలో శారీరక శ్రమ కంటే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కునే వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటివారు ప్రతిరోజు ధ్యానం చేయడం లేదా వ్యాయామం చేయడం వల్ల మానసికంగా ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది.