Relationship: అన్ని బంధాల కంటే వివాహం బంధం గొప్పది అంటారు పెద్దలు. ప్రతి బంధం బ్లడ్ రిలేషన్ తో మొదలైతే ఈ ఒక్క భాగస్వామి అనే తోడు మాత్రం ఎలాంటి రిలేషన్ లేకుండా వస్తారు. పెళ్లి వల్ల కలకాల కష్టసుఖాలు పంచుకుంటూ ఒకరికి ఒకరు తోడు నీడలా ఉంటారు. అయితే సాధారణంగా కొంతమంది రిలేషన్ లో ఏమైనా సమస్యలు ఉంటే స్నేహితులతో, లేదా ఇతరులతో పంచుకుంటారు. తమ భాగస్వామికి సంబంధించిన విషయాలు చెప్పి సలహాలు సూచనలు తీసుకుంటారు. లేదంటే ఓదార్పు కోరుకుంటారు. అయితే స్నేహితులతో చెప్పడం కరక్టేనా? మూడో వ్యక్తితో పర్సనల్ విషయాలు చెప్పవచ్చా? దీని గురించి మానసిక నిపుణులు ఏం చెబుతున్నారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భార్యాభర్తల మధ్య కచ్చితంగా గొడవలు జరుగుతుంటాయి. ఎవరి సంసారం అయినా గొడవలు లేకుండా సాగదు. కానీ ఇలాంటప్పుడు మూడవ వ్యక్తికి ప్రవేశం కల్పిస్తే.. దానివల్ల రిలేషన్ దూరం అవుతుంది. అందుకే.. శ్రేయోభిలాషులు, స్నేహితుల కు చెప్పడం వారి నుంచి సలహాలు తీసుకోవడం మానేయాలి అంటున్నారు నిపుణులు. ఒక్కొక్కరి రిలేషన్ లో ఒక్కో సమస్య ఉంటుంది. ఎవరి కోణం నుంచి వారికి డిఫరెంట్ గా అర్థం అవుతుంది. అందుకే మీ సంబంధ సమస్యలను మూడవ వ్యక్తి కోణం నుంచి పరిష్కరించాలి అనే ఆలోచన మానుకోవాలి. రిలేషన్ లో మూడో వ్యక్తి ప్రమేయం ఏ విధంగా దూరాన్ని పెంచి మీ సమస్యను మరింత పెద్దది చేస్తుంది.
భాగస్వామితో సమస్యలు కచ్చితంగా వ్యక్తిగతమైనవి.. సున్నితమైనవి. ఇలాంటి విషయాలను మీరు మీ స్నేహితులతో పంచుకున్నప్పుడు, మీ గోప్యత ప్రభావితమవుతుంది. ఇలాంటి విషయాలను ఇతరులకు చెప్పడం వల్ల అవి మీకు కానీ మీ భాగస్వామికి కానీ చెడు చేయవచ్చు. మీ రహస్యాలు ఇతరులకు తెలుస్తుంటాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
స్నేహితులు మీ సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోకుండానే మీ భాగస్వామి మనస్తత్వం తెలుసుకోకుండా సమాధానాలు చెబుతుంటారు. దీనివల్ల మీ రిలేషన్ మరింత పాడవుతుంది. ఉద్దేశపూర్వకంగా మీ స్నేహితులు అలా చెప్పకపోయినా వారికి ఉన్న అనుభవం సరైనది కాకపోయి ఉంటే మీ మంచి రిలేషన్ చెడుగా మారుతుంది.
ప్రతి విషయాన్ని స్నేహితులతో పంచుకోవడం మొదలు పెడితే సామాజిక ఒత్తిడి, ఆందోళన కూడా పెరుగుతుంది. స్నేహితులు మీ సమస్యల గురించి ఇతరులకు చెప్పే అవకాశం కూడా లేకపోలేదు.. ఇది సామాజిక స్థాయిలో మీ ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మిమ్మల్ని బాధపెట్టే వారు కూడా ఉంటారు.
మీ మధ్య ఉన్న సమస్యలు తొలిగిపోవాలి అంటే ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం వంటివి చేస్తుండాలి. ఇక మీ సలహాలతో కాకుండా మీ స్నేహితుల సలహాలతో మీ రిలేషన్ ను కొనసాగిస్తుంటే మీకు మంచి రిజల్ట్ రాకపోవచ్చు. మీరు ప్రేమతో గెలవడం ఉత్తమం. ఇతరుల సలహాలతో రిలేషన్ ను ఎక్కువగా కంటిన్యూ చేయలేరు. సో జాగ్రత్త.