
Mango Pickle : ఆవకాయంటే అందరికి ఇష్టమే. ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయల సందడి షురూ అవుతుంది. మామిడి, నిమ్మ, టమాట, ఉసిరి వంటి వాటితో పచ్చళ్లు తయారు చేయడం సహజమే. పచ్చళ్లలో మామిడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మామిడి పచ్చడి అంటే అందరికి నోరూరడం కామనే. ఈ కాలంలో ఏ కూర కూడా రుచిగా ఉండదు. అందుకే పచ్చళ్లతోనే ఆహారం లాగించేస్తుంటారు.
నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలను తీసుకుని రెండు కప్పుల నూనె, ఆవపిండి ఒక కప్పు, మిరపపొడి ఒక కప్పు, ఉప్పు తగినంత, మెంతిపొడి అరకప్పు, వెల్లుల్లి రేఖలు అరకప్పు, ఆవాలు పావుకప్పు తీసుకోవాలి. ముందుగా మామిడియలను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత తుడుచుకోవాలి. తొడిమెలు తొలగించాలి. టెంకతో సహా కాయలను ముక్కలుగా కోసుకోవాలి.
ముక్కలు తేమ లేకుండా చేసుకోవాలి. వాటిని ఒక వెడల్పు పాత్రలోకి తీసుకుని కొద్దిసేపు ఎండలో పెట్టాలి. తరువాత పాత్రలో మిరప్పొడి, ఆవపిండి, మెంతి పిండి, ఉప్పు, వెల్లుల్లి రేఖలను కలపాలి. ఆవపిండి కారంలో ఉప్పు చూసుకుని రుచిని బట్టి ఉప్పు కలుపుకోవాలి. గిన్నెలో నూనె మరిగించి అందులో ఆవాలు వేసి వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

నూనె చల్లారిన తరువాత ఆవకాయ ముక్కల్లో పోసి గరిటతో కలుపుకుంటే మామిడికాయ పచ్చడి రెడీ. ఇలా ఎండాకాలంలో మామిడి కాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు. దీంతో అన్నంలో పచ్చడి కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. దీంతో నాలుక రుచికి పులకించిపోతుంది. దీని వల్ల మనకు జిహ్వ చాపల్యం తీరుతుంది. ఇలా మామిడికాయ పచ్చడి ఎంతో రుచిగా మనకు పసందుగా ఉంటుంది.