Narkachaturdashi Pooja: చీకటిని పాలద్రోలి వెలుగులు విరజిమ్మే పండుగ దీపావళి. రాక్షస పీడ వదిలినందుకు ఆనందగా దీపాలు వెలిగించి దేవతలను ఆరాధిస్తూ జరుపుకునే ఈ పండుగకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీపావళి అనగానే ఇప్పుడున్నవాళ్లలో చాలా మంది ఇంటిని దీపాలతో అలంకరించడం.. లక్ష్మీ పూజ చేయడం.. ఆ తరువాత బాణ సంచా కాల్చడం అని మాత్రమే తెలుసు. కానీ ఈ దీపావళి రావడానికి పెద్ద కథే జరిగింది. ఈ పండుగ వెనుక అనేక కథలు ఉన్నాయి. అప్పటి వరకు తన ఆగడాలతో హింసించిన నరకాసురుడు అంతమైన రోజే దీపావళి అని చెప్పుకుంటారు. అంటే నరకచతుర్దితోనే దీపావళి వచ్చిందంటారు.

దీపావళి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 23 ఉదయం 06:03 గంటల నుంచి 24 ఉదయం 24 సాయంత్రం 05:27 గంటల వరకు పురోహితులు నిర్ణయించారు. క్యాలెండ్ ప్రకారం 25వ తేదీ వచ్చినా ఆ రోజు గ్రహణం వల్ల ఎలాంటి పూజలు చేయరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీపావళి పండుగ ముందు రోజు జరుపుకునేది నరక చతుర్థి. అంటే అక్టోబర్ 23న రాత్రి 11:40 నుంచి అక్టోబర్ 24 ఉదయం 12:31 వరకు నరక చతుర్థిని జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
నరకచతుర్ధిపై ఒక పురాణ గాథ ప్రాముఖ్యంలో ఉంది. హిరణ్యక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టి సముద్రంలో ముంచివేస్తున్న సమయంలో విష్ణుమూర్తి వరహావతారం ఎత్తుతాడు. ఆ రాక్షసుడిసి సంహరించి భూదేవిని ఉద్దరిస్తాడు. ఈ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వర ప్రసాదం వల్ల భీముడనే పుత్రుడు జన్మిస్తాడు. అతడే నరకాసురుడిగా పేరొందుతాడు. అయితే భూమాత నరకాసురుడిని రాక్షసత్వానికి దూరంగానే పెంచుతుంది. కానీ దురదృష్టవశాత్తూ నరకుడు అసుర ప్రభావానికి లోనవుతాడు. ఎన్నో తపస్సులు చేసి తనకు తల్లి చేత తప్ప మరొకరు చంపరాదనే వరం పొందుతాడు.

అయితే తన క్రూర చేష్టలతో ప్రజలు అల్లాడిపోతారు. ఈ క్రమంలో దేవతలకు తీవ్ర అశాంతి కలిగి విష్ణును సంప్రదిస్తారు. దీంతో శ్రీకృష్ణావతారంలో నరకునిపై దండెత్తుతాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు పడిపోతాడు. దీంతో ఉగ్రురాలైన సత్యభామ తన బాణాన్ని ప్రయోగించి నరకాసురుడిని అంతమొందిస్తుంది. అయితే యాదృచ్చికంగా నరకాసురుడి మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవిస్తుంది. నరకాసురుడు అంతమొందిన రోజున అందరూ సంబరాలు చేసుకుంటారు. చీకటిని పారద్రోతులుతూ ప్రజలు దీపాలు వెలిగించి ఆనందంగా గడుపుతారు.
అసలు నరకచతుర్ధిని ఎలా జరుపుకోవాలి..? ఆరోజు ఏం చేయాలి..? నరక చతుర్థి రోజున ఇంట్లోని ఈశాన్య మూలలో పూజ చేయాల్సి ఉంటుంది. ఆరాధన సమయంలో సూర్యుడు, గణపతి, దుర్గ, శివ, విష్ణువుల ప్రతిమలు లేదా ఫొటోలు ఉంచాలి. ఆ దేవతల ముందు దీపం వెలిగించాలి. ఆ తరువాత షోడశోపచార పదార్థాలతో పూజించాలి. ఈ సమయంలో మంత్రాలను పఠించాలి. ఆ తరువాత దేవుళ్లకు నైవేద్యం సమర్పించాలి.