Children future intellectuals: నేటి బాలలే రేపటి పౌరులు.. అన్న నినాదం చిన్నప్పటినుంచి వింటూ ఉంటాం. అయితే ప్రస్తుతం ఉన్న సమాజం ప్రకారం నేటి బాలలు రేపటి నిజమైన పౌరులుగా మారే అవకాశం ఉందా? అనే సందేహం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కొందరు మరీ గారాబం చేస్తూ.. వారికి లోకజ్ఞానం తెలియకుండా చేస్తుంటే.. మరికొందరు మాత్రం తమ పిల్లలను ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. అయితే ఇలా ఉన్న తల్లిదండ్రుల పిల్లలతో మిగతావారు కూడా చెడిపోయే అవకాశం ఉంది. మరి పిల్లలను ఎలా పెంచాలి? ఎలా చేస్తే వారు రేపటి మేధావులుగా మారుతారు?
పిల్లలు మొక్కలు లాంటివారు. మొక్క పెరుగుదలపై ఎంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలో.. పిల్లల పెంపకం పై కూడా అంతే శ్రద్ధ ఉంచాలని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే నేటి కాలం తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులో ఉంచుతున్నారు. అంతేకాకుండా వారికి అవసరంలేని కొన్ని సౌకర్యాలను కూడా ఇవ్వడంతో.. వారు సొంతంగా నేర్చుకోవడం గానీ లేదా.. సమాజ పరిస్థితులు అర్థం చేసుకోవడం గానీ తెలుసుకోవడం లేదు. దీంతో వీరు పెద్దయ్యాక అయోమయంగా జీవిస్తూ.. అనేక కష్టాలు పడుతున్నారు.
ఒక పిల్లవాడిని మొక్కగా పోలిస్తే.. ఒక మొక్క పెరుగుదలకు తగిన నీరు పోస్తే సరిపోతుంది. ఆ మొక్క కావలసిన ఎరువులను.. భూమిలోనే తయారు చేసుకుంటుంది. కానీ నేటి కాలం తల్లిదండ్రులు మొక్కకు నీటితోపాటు కావలసిన దానికంటే ఎరువు ఇచ్చినట్లు.. పిల్లలకు అవసరం లేని కొన్ని అలవాట్లను నేర్పుతున్నారు. వాస్తవానికి పిల్లలకు సరైన ఇంటి ఆహారం.. చక్కని చదువు.. చెబితే సరిపోతుంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు వారికి అవసరంలేని డబ్బును చూపిస్తున్నారు. అంతేకాకుండా వారు అడగకుండానే కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇలా వారికి చిన్న వయసులోనే అడగకుండా అన్ని ఇస్తే.. పెద్దయ్యాక వారు కావలసిన దానికి పట్టుపడతారు. అవసరమనుకుంటే వారు కావాల్సిన దానికోసం ఎంతకైనా పోరాడాల్సి వస్తుంది.
అందువల్ల ప్రతి పిల్లాడికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూనే.. కష్టపడితేనే డబ్బు వస్తుంది అన్న విషయాన్ని కూడా చెప్పాలి. అంతేకాకుండా డబ్బు ఎలా వస్తుంది? ఎంత కష్టపడితే ఎంత డబ్బు వస్తుంది? అనే విషయాన్ని కూడా వారు తెలియజెప్పాలి. కొందరు తల్లిదండ్రులు ఇంట్లో వండిన ఆహారం కాకుండా బయట దొరికే ఆహారం గురించి ఎక్కువగా పరిచయం చేస్తారు. అంతేకాకుండా వారికి కొత్త కొత్త రుచులు చూపిస్తారు. కొన్నాళ్లయిన తర్వాత పిల్లలు ఇంట్లో ఆహారాన్ని మరిచిపోయి.. బయటి ఆహారం తినడానికి మాత్రమే ఆసక్తి చూపుతారు. దీంతో వారికి పెద్దయ్యాక అనారోగ్యం రావడమే కాకుండా తల్లిదండ్రులకు భారంగా మారే అవకాశం కూడా ఉంటుంది.
ఒక పిల్లవాడు మంచి విద్యావంతుడు అయితే తన జీవితాన్ని చక్కగా నిలబెట్టుకునే సత్తా అతనికి ఉంటుంది. అలా మంచి విద్యావంతుడు కావడానికి అవసరమైన సౌకర్యాలు మాత్రమే కల్పించాలి. అలాకాకుండా అదనపు డబ్బు.. హోదా.. వంటివి చిన్నప్పుడే కల్పిస్తే.. పెద్దయ్యాక అనేక కష్టాలు పడాల్సి వస్తుంది..