Health Care Tips : ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వ్యాయామం మంచిది?

ఎవరి అవసరాల దృష్ట్యా వారు వాకింగ్ మార్గాలను ఎంచుకోవాలి. అయితే వ్యాయామం చేయకుండా మాత్రం ఉండకూడదు.

Written By: Srinivas, Updated On : January 23, 2024 2:00 pm

Health Care Tips

Follow us on

Health Care Tips : ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం తప్పనిసరి. వాతావరణ కాలుష్యంతో నాణ్యమైన ఆహార లోపంతో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రధానంగా చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి కొందరు ఎన్నో రకాల ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మరి కొందరు ఆహార జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వ్యాయామ లన్నింటిలో నడక, లేదా రన్నింగ్ చాలా సులభమైనది. ఎలాంటి పరికరం అవసరం లేకుండా రోజూ నిర్ణీత సమయం నడిస్తే లేదా పరుగెత్తితే ఆరోగ్యంగా ఉంటారని కొందరు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంత మంది ఆరుబయట రన్నింగ్ చేస్తారు. మరికొందరు ఇంట్లోనే ట్రెడ్మిల్ పై నడుస్తారు. అసలు ఆరుబయట రన్నింగ్ చేయడం మంచిదా? లేక ట్రెడ్మిల్ పై నడవడం మంచిదా? అనే సందేహం చాలా మందికి ఇప్పటికే వచ్చి ఉంటుంది. దీనిపై క్లారిటీ కావాలంటే ఈ వివరాల్లోకి వెళ్లండి..

ఆరుబయట వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆరుబయట నడవడం వల్ల కాళ్లు నేలకు బలంగా తాకుతాయి. దీంతో శరీరంపై ఒత్తిడి పెరిగి అనవసరపు కొలెస్ట్రాల్ తొందరగా కరుగుతుంది. అలాగే బయటి వాతావరణంలో నడవడం లేదా రన్నింగ్ చేయడం వల్ల స్వచ్ఛమైన గాలి ఉంటుంది. అలాగే సూర్యరశ్మి శరీరంపై పడి డి విటమిన్ లభిస్తుంది. దీంతో వ్యాయామం తో పాటు స్వచ్ఛమైన గాలి, విటమిన్లు పొందవచ్చు. ఇక చెట్ల మధ్య నడవడం వల్ల శ్వాస ఇబ్బందులు తొలగిపోతాయి. అదే ట్రెడ్మిల్ పై నడవడం వల్ల ఇవి సాధ్యం కాదు.

ట్రెడ్మిల్ పై నడవడం ప్రయోజనాలు లేకపోలేదు. వర్షాకాలంలో ఆరుబయట రన్నింగ్ చేయడానికి ఆస్కారం ఉండదు. బయటి వాతావరణం కలుషితం అవుతుంది. దీంతో వాకింగ్ చేయడం సాధ్యం కాదు. ఒకవేళ వెళ్లినా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని పట్టణాలు, నగరాల్లో అందుబాటులో పార్కులు ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి ట్రెడ్మిల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిపై నడుస్తూ ల్ప్యాప్ ట్యాప్ టాప్ యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా డ్రింక్ తాగుతూ నడవవచ్చు. ఆరుబయట ఇది సాధ్యం కాదు.

ఈ రెండింటిలో దేనికదే ప్రయోజనాలు కలిగి ఉంది. అయితే ఎవరి అవసరాలు ఎలా ఉన్నాయో.. వాటిని దృష్టిలో ఉంచుకొని వ్యాయామం చేయాలి. ఉదాహరణకు రన్నింగ్ పోటీల్లో పాల్గొనాలనుకునేవారు ఆరుబయట ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇలాంటి వారు ట్రెడ్మిల్ పై నడవడం శ్రేయస్కరం కాదు. వయసు ఎక్కువగా ఉన్నవారు… అలర్జీకి గురయ్యేవారు ట్రెడ్మిల్ పై నడవాలి. ఇలా ఎవరి అవసరాల దృష్ట్యా వారు వాకింగ్ మార్గాలను ఎంచుకోవాలి. అయితే వ్యాయామం చేయకుండా మాత్రం ఉండకూడదు.