
Couples Quarrel : మనకు ఓ సామెత ఉంది. ఎలుకల బాధకు ఇల్లు కాలబెట్టుకున్నాడని. ఇక్కడ కూడా అదే జరిగింది. పెళ్లాంపై కోపంతో ఓ వ్యక్తి ఇంటికి నిప్పంటించాడు. ఎన్నో కలలతో ఇల్లు కట్టుకుంటారు. జీవితంలో ప్రతి మనిషి కల సొంతింటి నిర్మాణం. అది అందరికి సాధ్యం కాదు. కొంత మంది జీవితాంతం అద్దె ఇంట్లోనే కాలం గడుపుతారు. కొందరేమో సొంతంగా ఇల్లు నిర్మించుకుని హాయిగా ఉంటారు. ఏది ఏమైనా మనం ఎన్ని బాధలు అనుభవించినా సొంతిల్లు ఉంటేనే అతడికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. లేదంటే ఇబ్బందులే.
భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణం. పొద్దున గొడవ పడి సాయంత్రం మళ్లీ కలిసిపోవడం దంపతుల నైజం. కానీ కొందరు మాత్రం తమ ఇగోలను పక్కన పెట్టరు. తానే గొప్ప అనే ఉద్దేశంతో ఎంతకైనా తెగిస్తారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటారు. ఫలితంగా జీవితంలో అన్నింటిని పోగొట్టుకోవడం సహజమే. అయినా వారికి గుణం మారదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటూ వాదిస్తారు.
తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖని లోని ఎన్టీపీసీలో నివాసముంటే ఓ కుటుంబం చిన్నాభిన్నమైంది. తాగిన మైకంలో భర్త చేసిన నిర్వాకం వారిని వీధిపాలు చేసింది. అకారణంగా వచ్చే కోపతాపాలకు పోతే ఇలాగే ఉంటుంది. ఎన్టీపీసీ క్రషర్ నగర్ లో నివాసముండే రవి, రహీమా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ కూడా అదే తీరుగా లొల్లి రాజేసుకోవడంతో రవి కోపోద్రిక్తుడయ్యాడు. ఏం చేస్తున్నాడో తెలియని విధంగా మద్యం మత్తులో తన ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
మంటలు వ్యాపించాయి. స్థానికులు ఆర్పే ప్రయత్నం చేసినా ఆగలేదు. దీంతో ఇల్లు మొత్తం కాలిపోయింది. దీంతో భార్య రహీమా భర్త రవిపై ఫిర్యాదు చేసింది. తలదాచుకుంటున్న ఇంటినే బుగ్గిపాలు చేసిన అతడి నిర్వాకాన్ని అందరు అసహ్యించుకుంటున్నారు. భార్యపై కోపం ఉంటే ఇల్లు కాలబెట్టుకోవడం ఏమిటి? ఇప్పుడు ఎక్కడుంటారు? తాగిన మైకంలో చేసిన పనికి అందరు బాధ్యులు కావాల్సిందే మరి.