Happy Navratri 2021: విజయదశమి.. ఉత్తర, దక్షిణం అనే తేడా లేకుండా భారతదేశం వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండగల్లో ఒకటి. తొమ్మిది రోజులపాటు దుర్గామాతకు నిష్టతో పూజలు చేసి, పదో రోజున దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా శమీపూజ నిర్వహిస్తారు. హిందువులు ఈ పండుగను అత్యంత ఘనం నిర్వహిస్తారని అందరికీ తెలుసు. కానీ.. ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ ప్రాశస్త్యం ఏంటీ? అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. మరి, ఆ సందర్భం ఏంటీ? అన్నది ఇప్పుడు చూద్దాం.

చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో విజయదశమి, మరికొన్ని ప్రాంతాల్లో దసరాగా పిలుచుకుంటారు. ఈ పర్వదినానికి ముందు తొమ్మిది రోజులపాటు అమ్మవారికి నిష్ఠతో పూజలు చేస్తారు. నిజానికి ఈ నవరాత్రుల అర్థం, పరమార్థం కూడా చాలా మందికి తెలియదు. మనిషిలోని కామ, క్రోద, మోహ, లోభ, మధ, మత్సర, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకార అనే దుర్గుణాలను తొలగించమని దుర్గామాతను పూజించడమే ఈ నవరాత్రుల ఆంతర్యం. అందుకే.. ఈ తొమ్మిది రోజులపాటు ఎలాంటి చెడు పనులు చేయకుండా మడికట్టుకొని పూజ చేస్తుంటారు.

ఇక, పురాణాల్లో విజయదశమికి (Vijayadashami)ఎంతో ప్రత్యేకత ఉంది. త్రేతాయుగంలో కొనసాగిన రామాయణానికి ప్రతీకంగా విజయదశమిని జరుపుకుంటారు. యుద్ధంలో రాముడు రావణాసురుడిని అంతం చేసిన రోజు ఇదేనని పురాణోక్తి. ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ చేసుకునే సంబరాలే ఈ దసరాగా చెబుతారు.
అంతేకాదు.. ద్వాపరయుగంలోనూ ఇదే రోజున మరో కీలక ఘట్టం జరిగిందని చెబుతారు. పాండవులు, కౌరవుల మధ్య కొనసాగిన యుద్ధానికి ఆరంభం ఇదే రోజున జరిగిందని పురాణాలు చెబుతాయి. జూదంలో ఓడి వనవాసానికి వెళ్లిన పాండవులు.. 12 ఏళ్లు వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేయాల్సి ఉంటుంది. ఆ సంవత్సర కాలం పాటు వారు మారువేషంలో నివసిస్తారు. ఈ క్రమంలో.. తమ ఆయుధాలను తమతో ఉంచుకుంటే ఎవరైనా గుర్తు పడతారని భావించి, జమ్మి చెట్టుమీద ఆయుధాలను దాచి వెళ్తారు. అలా దాచిన ఆయుధాలను కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే సమయంలో తిరిగి తీస్తారు. ఆ రోజునే విజయదశమిగా జరుపుకుంటారని పురాణోక్తి.
ఇక, మరో కథ ఏమంటే.. బ్రహ్మదేవుడి వరాలతో గర్వితుడిగా మారిన మహిషాసురుడు.. ముల్లోకాలనూ శాసించే స్థాయికి చేరుకుంటారు. దేవతలతో యుద్ధం చేసి, ఇంద్రుడిని ఓడించి స్వర్గలోక సింహాసనం అధిష్టిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు త్రిమూర్తులను వేడుకోగా.. వారి ఆగ్రహ జ్వాలలో స్త్రీరూపం జన్మిస్తుంది. వారి తేజస్సుతో, అంశతో ప్రత్యక్షమైన అమ్మవారు మహిషాసురుడితో పోరాడి సంహరిస్తుంది. అందుకే.. దసరా రోజున విజయలక్ష్మిని పూజిస్తారు. ఆమెను మహిషాసుర మర్ధనిగా కీర్తిస్తారు. అందుకే.. విజయదశమి రోజున జంతు బలి ఇవ్వడంతోపాటు జమ్మి చెట్టుకు షమీపూజ చేస్తారు. రావణ దహనం నిర్వహిస్తారు. చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఉత్సవంగా జరుపుకుంటారు.